రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌ని కలిసిన ఏపిడబ్ల్యుజేఎఫ్ బృందం

రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌ని కలిసిన ఏపిడబ్ల్యుజేఎఫ్ బృందం   
విజయవాడ: వృత్తి పన్ను వేసి జర్నలిస్టుల పై ఆర్థిక భారాన్ని మోపాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఏపీడబ్ల్యుజేఎఫ్) ప్రతినిధులబృందం బుధవారం మధ్యాహ్నం విజయవాడలో రాష్ట్ర సమాచారశాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా హెల్త్ కార్డుల పునరుద్ధరణ గురించి, జర్నలిస్టుల ప్రమాదభీమా గురించి, మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు ఇచ్చే పెన్షన్ స్కీం గురించి, చిన్నపత్రికలకు మెడమీద కత్తిలా మారిన జి.ఎస్ టి  గురించి ఫెడరేషన్ ప్రతినిధుల బృందం కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళింది. కమిషనర్ స్పందిస్తూ, వృత్తి పన్ను విషయం మా డిపార్టుమెంటుకు సంబంధించింది  కాదు కాబట్టి విషయాన్ని ఆయా అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే హెల్త్ కార్డుల పునరుద్ధరణ కార్యక్రమం, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఇచ్చే పెన్షన్ విషయంరెండూ ప్రాసెస్ లో వున్నాయని, త్వరలోనే ఆ రెండు పూర్తిచేస్తామని చెప్పారు. ఇక ప్రమాదభీమా విషయానికి సంబంధించి ఫైల్ సెక్రటేరియట్ లో ప్రాసెస్ లో వుందని, త్వరలోనే దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలియజేస్తానని హామీ యిచ్చారు. ప్రమాదబీమా అందకపోవడం వల్ల జర్నలిస్టు కుటుంబాలు ఎంతో ఇబ్బంది పడుతున్నారంటూ, ప్రకాశం జిల్లా పొదిలిలో రోడ్ యాక్సిడెంట్లో జర్నలిస్టు నరసింహారావు మరణించిన విషయాన్ని ప్రతినిధి బృందం కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళింది. కమిషనర్ ని కలిసినవారిలో రాష్ట్ర కార్యదర్శి ఖాజావలి, ఏపీడబ్ల్యుజెఎఫ్ విజయవాడ సిటీ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కలిమిశ్రీ, ఎం.బి.నాధన్, కోశాధికారి జె.వి.శ్రీనివాసరావు, కృష్ణాజిల్లా శాఖ బాధ్యులు వై.శ్రీనివాసరావు వున్నారు.