విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో వైభవంగా ‘ఉత్సవ్‌

రూ.119 లక్షల స్కాలర్‌షిప్పుల పంపిణీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో వైభవంగా ‘ఉత్సవ్‌

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.17.6 కోట్ల ఫీజురాయితీలు
చదువులతోపాటు, ఆటలు, సాంస్కృతికాంశాల్లో ప్రతిభావంతులకు నగదు బహుమతులు
యువతకు భారీ లక్ష్యాలు ఉండాలి: టీసీఎస్‌ వైస్‌ ప్రెసిడెంట్, గ్లోబల్‌ ఆర్‌ఎంజీ హెడ్‌ ఈఎస్‌ చక్రవర్తి
 ప్రత్యేక లక్షణాలుంటేనే జీవితంలో విజయం: మాజీ ఏడీజీపీ వీవీ లక్ష్మీ నారాయణ
యువతకు భారీ లక్ష్యాలు ఉండాలని టీసీఎస్‌ వైస్‌ ప్రెసిడెంట్, గ్లోబల్‌ ఆర్‌ఎంజీ హెడ్‌ ఈఎస్‌ చక్రవర్తి  తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక ‘‘ఉత్సవ్‌’’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చదువులో ప్రతిభ చూపిన 233 మందికి రూ.119లక్షల విలువైన స్కాలర్‌షిప్పులు అందజేశారు. 15 క్రీడాంశాలు, 15 సాంస్కృతికాంశాల్లో విజేతలైన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. మొత్తం 233 మంది విద్యార్థులకు పలు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. చదువుల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు  రూ.17.6కోట్ల ఫీజు రాయితీ ఇస్తూ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీసీఎస్‌ గ్లోబల్‌ హెడ్‌ ఈఎస్‌ చక్రవర్తి మాట్లాడుతూ దేశంలోని గొప్ప విశ్వవిద్యాలయాల్లో విజ్ఞాన్‌ కూడా ఒకటన్నారు. యువత ఉద్యోగం కోసం చూడొద్దని తెలిపారు. ఉద్యోగాలు సృష్టించాలనే కోణంలోనే ఆలోచించాలన్నారు. ఆ దిశగా కష్టపడితే తప్పక విజయం సాధిస్తారని వెల్లడించారు.
ప్రత్యేక లక్షణాలుంటేనే జీవితంలో విజయం: మాజీ ఏడీజీపీ వీవీ లక్ష్మీ నారాయణ
ఉత్సవ్‌ కార్యక్రమానికి గౌరవ అతిథిగా వర్చువల్‌ విధానంలో హాజరైన మాజీ ఏడీజీపీ వీవీ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ కేవలం పరీక్షల్లో ఉత్తీర్ణులవడమే ముఖ్యం కాదని తెలిపారు. మనం యూనివర్సిటీల్లో నేర్చుకున్నదానికి, కంపెనీల్లో చేస్తున్న ఉద్యోగానికి మధ్య సంబంధం ఉండదని తెలిపారు. ఎవరైనా వారి వారి రంగాల్లో విజయవంతమైన వ్యక్తులుగా ఎదిగారంటే అది వారికి ఉన్న నిజాయితీ, సహనం, మానవవిలువలు, ప్రేమ, అప్యాయత లాంటి లక్షణాలే కారణమని తెలిపారు. వాటన్నింటినీ యువత నేర్చుకోవాలని సూచించారు. 
నూతన సాంకేతిక అంశాలపై పట్టు ఉండాలి: రత్తయ్య విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ ఐవోటీ, బిగ్‌డేటా, రోబోటిక్స్‌ లాంటి నూతన సాంకేతిక అంశాలను నేర్చుకోవాల్సిందేనన్నారు. వీటిపై పరిజ్ఞానం లేకుంటే జీవితంలో ఎదగలేరని హెచ్చరించారు. పెద్దపెద్ద జీతాలు పొందే ఉద్యోగులుగా యువత మారాలంటే నూతన టెక్నాలజీలపై పట్టు సాధించాల్సిందేనని స్పష్టంచేశారు. మంచి వ్యక్తిత్వం, సహనం, పట్టుదల, కష్టపడేతత్వం ఉన్న విద్యార్థులు జీవితంలో అందరికంటే ఉన్నతంగా ఎదుగుతారని పేర్కొన్నారు. ఉద్యోగాలకే పరిమితమవవకుండా పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని సూచించారు.
ఉపాధి కలిగించే దిశగా అడుగులేయండి: విజ్ఞాన్‌ సంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు
ప్రతి ఒక్క విద్యార్థి ఉద్యోగిగా కాకుండా... అందరికీ ఉపాధి కలిగించే దిశగా అడుగులు వేయాలని విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల వైస్‌ చైర్మన్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి ప్రశ్నించగలిగే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. మనలోని సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకుని సమస్యలకు పరిష్కారం కనుగొనగలగాలి. సృజనాత్మకతను పెంపొందించుకోవాలి. ఆశించిన పలితాలను సాధించేందుకు మనోధైర్యాన్ని కూడగట్టుకుని పోటీ ప్రపంచానికి అనుగుణంగా నూతన ఆవిష్కరణలు చేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విజ్ఞాన్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, వర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.