మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తే సర్వీస్‌ సాధ్యమే

మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తే సర్వీస్‌ సాధ్యమే

  ఆలిండియా సివిల్స్‌ 37వ ర్యాంకర్, ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 3వ ర్యాంకర్‌ వి.సంజన సింహా

సివిల్స్‌లో సత్తాచాటాలనుకునే విద్యార్థులు  ఏడాది పాటు చదివి పరీక్షలో విజయం సాధించకపోతే.... నిరాశ చెందకూడదని, ఓర్పు, సహనంతో మళ్లీ మళ్లీ ప్రయత్నించి సర్వీస్‌ సాధించాలని ఆలిండియా సివిల్స్‌ 37వ ర్యాంకర్, ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 3వ ర్యాంకర్‌ వి.సంజన సింహా విద్యార్థులకు పిలుపునిచ్చారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని సివిల్స్‌ సర్వీసెస్‌ అకడమీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ‘‘సివిల్స్‌ పరీక్షను ఎలా అధిగమించవచ్చు?’’ అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఏడాది సివిల్స్‌ ర్యాంకర్‌ వీ.సంజన సింహా మాట్లాడుతూ పాత ప్రశ్నాపత్రాలను బాగా ప్రాక్టీస్‌ చేయడం వలన ప్రశ్నల సరళి ఏ విధంగా అడుగుతున్నారో అర్థమవుతుందన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఎలా ప్రిపేర్‌ అవ్వాలో తెలియాలంటే మాత్రం నిపుణుల గైడెన్స్‌ తీసుకోవాలన్నారు. సివిల్స్‌ పరీక్షలో మెరవాలంటే శ్రమ, శ్రద్ధ, అంకితభావం, సొంత ప్రతిభతోనే రాణించగలరని పేర్కొన్నారు. సివిల్స్‌ ప్రిపేర్‌ అయ్యే విద్యార్థులు ఎన్ని పుస్తకాలు చదివాం.. ఎన్ని గంటలు చదివామన్నది కొలమానం కాకుండా సబ్జెక్ట్‌ల విశ్లేషణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రతి చిన్న అంశాన్ని క్షుణ్ణంగా చదివి పూర్తి అవగాహన పొందాలన్నారు. సొంతంగా ప్రిపేర్‌ అయ్యే విద్యార్థులు సబ్జెక్టులపై అవగాహన ఉన్న సీనియర్లు, ఇప్పటికే సర్వీస్‌లో ఉన్నవారి సలహాలు తీసుకోవటం మంచిదన్నారు. సివిల్స్‌ సాధించాలనే విద్యార్థులు ముందుగా సిలబస్‌ను పూర్తిగా అర్థం చేసుకోవాలన్నారు. కరెంట్‌ అఫైర్స్, ప్రసుత పరిణామాలను ఎప్పటికప్పుడు వాటిపై పట్టు సాధిస్తూ ఉండాలన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ సివిల్స్‌ ర్యాంక్‌ సాధించిన వీ.సంజన సింహాను అభినందించటంతో పాటు ప్రజలకు వినూత్న సేవలను అందించగలిగి ఆ పదవికి సార్ధకత తీసుకురావాలని కోరారు. అనంతరం సివిల్స్‌ ర్యాంకర్‌  వీ.సంజన సింహాను, ఆమె భర్త, మెంటర్, ట్రైనర్, సివిల్స్‌ ఫ్యాకల్టీ హర్షను ఘనంగా సన్మానించారు.