విజ్ఞాన్స్‌లో ఘనంగా ప్రారంభమైన జాతీయస్థాయి వర్క్‌షాప్‌

విజ్ఞాన్స్‌లో ఘనంగా ప్రారంభమైన జాతీయస్థాయి వర్క్‌షాప్‌

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ విభాగంలోని డివిజన్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించనున్న జాతీయస్థాయి వర్క్‌షాప్‌ కోర్సును బుధవారం నుంచి ప్రారంభించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ ఏ వైడ్‌ గముత్‌ ఆఫ్‌ స్పెక్ట్రోస్కోపిక్‌ టెక్నిక్స్‌ ఇన్‌ కెమిస్ట్రీ’’ అనే అంశంపై ఈ కోర్సును ప్రారంభించామన్నారు. ఈ వర్క్‌షాప్‌ను డీఎస్టీ– సెర్బ్‌ ఇనిషియేటివ్‌ అభ్యాస్‌ స్కీమ్‌ కింద నిర్వహిస్తున్నామని తెలియజేసారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బెంగుళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌ గౌతమ్‌ దేసిరాజు మాట్లాడతూ విద్యార్థులకు నైపుణ్యంతో పాటు పరిశోధనాత్మక ఆలోచనలు కలిగిన విద్యా విధానం ఉండాలని తెలిపారు. ప్రస్తుతం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో వస్తున్న నూతన ఆవిష్కరణలు సమాజాభివృద్ధికి దోహదం చేస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు జీవితంలో ఉన్నతస్థానాలకు ఎదగాలంటే సాంకేతిక నైపుణ్యంపై పట్టు సాధించాలని తెలిపారు. నూతన టెక్నాలజీలపై అవగాహణ పెంచుకున్న విద్యార్థులకు మాత్రమే భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు దక్కుతాయని తెలిపారు. ఇప్పటి నుంచి విద్యార్థులు వారికి ఆసక్తి ఉన్న అంశాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ ప్రొఫెసర్‌ పన్నూరు వెంకటేషు మాట్లడుతూ రసాయన శాస్త్రంలో శాస్త్రవేత్తలు, నిపుణులు చేసే సూచనలు ఆ రంగంలో విద్య, పరిశోధనలకు దిశా నిర్దేశం చేసేందుకు దోహదం చేయాలని అన్నారు. విద్యార్థులు సంబంధిత సబ్జెక్టుల్లో వస్తున్న నూతన అంశాలు, ఆధునిక పద్ధతులపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధించగలుగుతారని తెలిపారు. నిత్యం మనం ఉపయోగించే వస్తువులు ఏ మెటీరియల్‌తో తయారుచేశారనే విషయాలను విద్యార్థులు అధ్యయనం చేయాలన్నారు. భవిష్యత్‌ అంతా బయో ఫిజిక్స్, గ్రీన్‌ కెమిస్ట్రీ రంగానిదేనని, విద్యార్థులు కష్టపడి చదువుకుంటే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందన్నారు. పరిశోధనల వైపు ఆసక్తి పెంచుకోవాలని, అప్పుడే దేశానికి ఉపయోగపడే విధంగా అనేక ఆవిష్కరణలకు నాందీ పలకవచ్చన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, కోర్సు కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ దేవనూరి నాగరాజు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, రీసెర్చ్‌ స్కాలర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.