బ్లాక్‌చైన్‌ టెక్నాలజీతో సమాచారం భద్రం

బ్లాక్‌చైన్‌ టెక్నాలజీతో సమాచారం భద్రం

  కర్ణాటకలోని కువేంపు యూనివర్సిటీ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కే.చిదానంద గౌడ

  విజ్ఞాన్స్‌లో ఘనంగా ప్రారంభమైన జాతీయస్థాయి రీసెర్చ్‌ కాన్‌క్లేవ్‌–2కే22

ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో సమాచారానికి సంబంధించి ఎదురవుతున్న సమస్యలకు బ్లాక్‌చైన్‌ టెక్నాలజీతో అడ్డుకట్టవేయవచ్చని కర్ణాటకలోని కువేంపు యూనివర్సిటీ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కే.చిదానంద గౌడ తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని కంప్యూటర్‌ సైన్స్‌ డిపార్ట్‌మెంట్, చెన్నై రీజియన్‌లోని సీఎస్‌ఐ స్టూడెంట్‌ చాప్టర్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ఫ్యూచరిస్టిక్‌ ఐడియాస్‌ ఫర్‌ ఇన్నోవేటివ్‌ రీసెర్చ్‌ ’’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయస్థాయి రీసెర్చ్‌ కాన్‌క్లేవ్‌–2కే22ను ఘనంగా ప్రారంభించారు. కాన్‌క్లేవ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన కర్ణాటకలోని కువేంపు యూనివర్సిటీ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కే.చిదానంద గౌడ మాట్లాడుతూ బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ సహాయంతో ప్రభుత్వ పాలనకు సంబంధించి భూ రికార్డులు ట్యాంపరింగ్‌ జరగకుండా భద్రపరచవచ్చునన్నారు. బ్యాంక్‌ లావాదేవీలపై సైబర్‌ దాడులను పూర్తిగా నిరోధించవచ్చునని తెలియజేసారు. ఆసుపత్రుల్లో రోగులకు చేసే వైద్యపరీక్షల వివరాలను బ్లాక్‌చైన్‌ విధానంలో నమోదు చేస్తే మళ్లీ మళ్లీ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉండదన్నారు. వర్చువల్‌ కరెన్సీ అయిన బిట్‌కాయిన్‌లకు మూల ఆధారం బ్లాక్‌చైన్‌ టెక్నాలజీయేనని విద్యార్థులకు తెలియజేసారు. రానున్న కాలంలో బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చెందబోతుంది?, వాటి ఆపరేషన్స్, రీసెర్చ్‌ ఇష్యూస్‌ వంటి వాటిని విద్యార్థులకు, యంగ్‌ రీసెర్చ్‌ స్కాలర్స్‌కు కూలంకషంగా వివరించారు. బ్లాక్‌చైన్‌ టెక్నాలజీపై పట్టు సాధించిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన యూనివర్సిటీ ఆఫ్‌ మైసూర్‌లోని కంప్యూటర్‌ సైన్స్‌ డిపార్ట్‌మెంట్‌ చైర్మన్, ప్రొఫెసర్‌ డీ.ఎస్‌.గురు మాట్లాడుతూ దేశంలోని దాదాపు అన్ని రంగాల్లోని సంస్థలు రానున్న కాలంలో కమ్యూనికేషన్, రోబోటిక్స్, ఫేస్‌ మాస్క్‌ డిటెక్ట్‌ చేయడం, రిమోట్‌ సెన్సింగ్, ఐవోటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్, సైబర్‌ సెక్యూరిటీ, మెషిన్‌ లెర్నింగ్‌ ఆధారంగా కార్యకలాపాలు నిర్వహిస్తాయని పేర్కొన్నారు. కావున అధ్యాపకులు, పరిశోధన విద్యార్థులు మెషిన్‌ లెర్నింగ్‌పై పరిశోధనలు చేస్తే అద్భుత ఫలితాలను రాబట్టవచ్చునని వెల్లడించారు. అధ్యాపకులు వీటిపై పరిశోధనలు కొనసాగించాలంటే ఆలోచన శక్తి, విశ్లేషణాత్మక పరిజ్ఞానం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, టీం వర్కు, ఓర్పు, నేర్పులతో పాటు తాజా ఆవిష్కరణలపై అవగాహన ఉండాలన్నారు. అవసరమైన సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రాంలను రూపొందించడం, సాంకేతిక సమస్యలను పరిష్కరించడంపై పట్టుసాధించాలన్నారు. కార్యక్రమంలో కోయంబత్తూర్‌లోని ఆంఫి వెంచర్స్‌ చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రదీప్‌ కుమార్, ఐఐఐటీ అలహాబాద్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సోనాలి అగర్వాల్, ఐఐటీ రూర్కీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పార్థ ప్రతిమ్‌ రాయ్, విజ్ఞాన్స్‌ వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.