టెలికాం రంగంలో విప్లవాత్మక టెక్నాలజీ 5జీ

టెలికాం రంగంలో విప్లవాత్మక టెక్నాలజీ 5జీ

 - త్రిచిలోని ఐఐఐటీ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌వీఎస్‌ఎన్‌ శర్మ

  - విజ్ఞాన్‌లో ఘనంగా ప్రారంభమైన రెండో అంతర్జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌

భవిష్యత్‌లో టెలికాం రంగంలో 5జీ టెక్నాలజీతో విప్లవాత్మక మార్పులు వస్తాయని త్రిచిలోని ఐఐఐటీ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌వీఎస్‌ఎన్‌ శర్మ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని  డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ‘‘ వీఎల్‌ఎస్‌ఐ, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌–2022’’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న రెండో అంతర్జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌ను  శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న త్రిచిలోని ఐఐఐటీ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌వీఎస్‌ఎన్‌ శర్మ మాట్లాడుతూ 5జీ (జనరేషన్‌) టెక్నాలజీ 4జీ కంటే 100 రెట్లు వేగవంతమైనదని తెలిపారు. ఇప్పటికే ఈ టెక్నాలజీ ప్రపంచంలోని పలుదేశాల్లో వినియోగంలోకి వచ్చిందన్నారు. 5జీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఒకే సిమ్‌ నంబర్‌ను వినియోగించవచ్చునన్నారు. 5జీ టెక్నాలజీ రంగంలో ఉద్యోగాలు సాధించాలనుకునే విద్యార్థులు ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌ను ఒడిసిపట్టుకోవాలని విద్యార్థులకు తెలియజేసారు. 5జీ టెక్నాలజీ సాయంతో వైద్యరంగంలో కీలకమైన శస్త్రచికిత్సలు, 3–డి ఎక్స్‌రేలు, ఇతర స్కానింగ్‌లు తీసే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ రంగంలో ఐవోటీ సాంకేతికత ఆధారంగా వాతావారణ పరిస్థితులను పరిశీలిస్తూ సరితూగే పంటలు వేయడం, పర్యవేక్షణ ద్వారా దిగుబడులు భారీగా పెంచేందుకు అవకాశం ఉందన్నారు. రిటైల్‌ రంగంలో వర్చువల్‌ రియాలిటీ, ఆగ్మెంటెడ్‌ రియాల్టీ ఆధారంగా... ఏదైనా ఒక వస్తువు లేదా ఉత్పత్తిని కళ్లకు కట్టినట్లు చూపి ఆయా వస్తువల నాణ్యతను లోతుగా పరిశీలించేందుకు 5జీ టెక్నాలజీ దోహదపడుతుందన్నారు. 5జీ విస్తరణతో అగ్రిఫార్మా, ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్, రోబోటిక్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్, మెషిన్‌ లెర్నింగ్‌ వంటి సాంకేతికతలు విస్తృతంగా అందుబాటులోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఈసీఈ విభాగం సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.