విజ్ఞాన్స్‌లో బీటెక్‌ ఫస్టియర్‌ తరగతులు ప్రారంభం

విజ్ఞాన్స్‌లో బీటెక్‌ ఫస్టియర్‌ తరగతులు ప్రారంభం

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో గురువారం నుంచి బీటెక్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ తమ యూనివర్సిటీలో చేరిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. విద్యార్థులకు చదవటమే అంతిమ లక్ష్యం కాదు. మీరు చదువుకున్న దానితో మంచి ఉద్యోగం పొందటమే అంతిమ లక్ష్యంగా నిర్ణయించుకోవాలన్నారు. విద్యార్థులకు నైపుణ్యంతో పాటు పరిశోధనాత్మక ఆలోచనలు కలిగించాలనే ఉద్దేశ్యంతో విద్యార్థులకు ఎన్‌ఈపీ–2020ను అమలుచేస్తున్నామని తెలిపారు. కార్పొరేట్‌ ప్రపంచంలో యువతకు విస్తృత అవకాశాలున్నాయని, వాటిని సాధించేందుకు అవసరమైన సామర్థ్యాన్ని విద్యార్థులు పెంపొందించుకోవాలని సూచించారు. తమ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులలో 90 శాతం మంది పిల్లలకు మల్టీనేషనల్‌ కంపెనీలలో ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. తమ యూనివర్సిటీలో కౌన్సిలింగ్‌ సిస్టంద్వారా ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక అ«ధ్యాపకుడిని నియమిస్తామని చెప్పారు. దీని ద్వారా విద్యార్థులను ఎప్పటికప్పడు మానిటరింగ్‌ చేస్తూ విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి వారి అభ్యున్నతికి తోడ్పడుతామన్నారు. తమ యూనివర్సిటీలో పనిచేసే అధ్యాపకులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవడం వలన నూటికి నూరు శాతం ఫలితాలను సాధిస్తున్నామన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.