విజ్ఞాన్స్‌లో ఘనంగా జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌

విజ్ఞాన్స్‌లో ఘనంగా జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌
,
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లా ఆధ్వర్యంలో మొట్ట మొదటి జాతీయస్థాయి టెక్నో కాన్ఫరెన్స్‌ను ఘనంగా నిర్వహించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ శనివారం తెలిపారు. ఈ జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌ను ‘‘ టెక్నో– ఐపీ కాన్‌టర్స్‌ ఇన్‌ ఇండియా’’ అనే అంశంపై నిర్వహించామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ శ్రీసుధ మాట్లాడుతూ మేథో వస్తువల ( ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ) సృష్టిని ప్రోత్సహించడమే మేథో సంపత్తి చట్టం ( ఐపీ లా) అని విద్యార్థులకు తెలియజేసారు. ఎవరైనా వ్యక్తులు కనిపెట్టిన లేదా సృష్టించిన వస్తువులకు లభించే గుర్తింపు, వాటి ద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనాలపై పూర్తి హక్కులు సృష్టికర్తలకే చెందాలని చట్టాలు చెబుతున్నాయని తెలియజేసారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆవిష్కరణలు వృద్ధి చెందే వాతావరణాన్ని పెంపొందించడమే దీని లక్ష్యమన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన విశాఖపట్నంలోని డీఎస్‌ఎన్‌ఎల్‌యూ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ మనదేశంలో కాపీరైట్, పేటెంట్, ట్రేడ్‌మార్క్, ఇండస్ట్రియల్‌ డిజైన్స్, జియోగ్రాఫికల్‌ ఇండికేషన్స్, ట్రేడ్‌ సీక్రెట్స్‌.. వంటివి మేధో సంపత్తి హక్కుల జాబితాలో ఉన్నాయని విద్యార్థులకు తెలియజేసారు. కాపీరైట్‌ అనేది ఒక రచయిత లేదా యజమానికి చట్టం కల్పించిన హక్కుల జాబితానని, ఒక రచనపై దాన్ని రచించిన లేదా సృష్టించిన వ్యక్తికే సర్వ అధికారాలు ఉంటాయని పేర్కొన్నారు. సాహిత్యం, నాటక రంగం, సంగీతం, కళాత్మక రచనలు, సినిమాటోగ్రాఫిక్‌ ఫిల్మ్, సౌండ్‌ రికార్డింగ్‌.. వంటి విభాగాలకు కాపీరైట్‌ వర్తిస్తుందన్నారు. అయితే చట్టపరంగా యజమానులకు లభించిన మేధో సంపత్తి హక్కులను ఎవరైనా అక్రమంగా వినియోగించినప్పుడు.. వారిపై మేధో సంపత్తి రకం, అధికార పరిధి, చర్య స్వభావాన్ని బట్టి.. సివిల్, క్రిమినల్‌ చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ లా డిపార్ట్‌మెంట్‌ అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.