విజ్ఞాన్‌ యూనివర్సిటీలో వేడుకగా జాతీయ క్రీడా దినోత్సవం

విజ్ఞాన్‌ యూనివర్సిటీలో వేడుకగా జాతీయ క్రీడా దినోత్సవం

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో సోమవారం ధ్యాన్‌చంద్‌ జయంతి సందర్భంగా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో జాతీయ క్రీడాదినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ముందుగా జాతీయ జెండాతో భారీ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమానికి ఇంటర్నేషనల్‌ అథ్లెట్, 15వ ఆసియన్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌ సిల్వర్‌ మెడల్‌ విజేత ఆర్‌.బంగారయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన∙మాట్లాడుతూ ఒలంపిక్‌ క్రీడల్లో దేశానికి వరుసగా మూడు సార్లు స్వర్ణపతకాలను అందించిన ఘనత ధ్యాన్‌చంద్‌కే దక్కుతుందన్నారు. ఆయన పేరుమీదనే భారత ప్రభుత్వం క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ‘‘ మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న’’ అవార్డును క్రీడాకారులకు అందజేస్తుందన్నారు. విద్యార్థులందరూ ఆటల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో మూడు సెమిస్టర్‌లలో స్పోర్ట్స్‌కు సంబంధించిన అంశాలకు మార్కులు కూడా కేటాయించడం హర్షనీయమన్నారు. విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలని, అనుకున్నది సాధించేదాక కష్టపడి పనిచేయాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా... ఎప్పుడు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం వివిధ క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను, మెడల్స్‌ను అందజేసారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.