విజ్ఞాన్‌ ఫార్మసీలో ఘనంగా అంతర్జాతీయ సదస్సు

విజ్ఞాన్‌ ఫార్మసీలో ఘనంగా అంతర్జాతీయ సదస్సు
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలో మంగళవారం అంతర్జాతీయ సదస్సును నిర్వహించినట్లు విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ విజ్ఞాన్స్‌ ఫార్మసీ కళాశాల, వీ కాన్ఫిగర్‌ అనలిటిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారి సంయుక్త సహకారంతో ‘‘ కెరీర్‌ ఆపర్చునిటీస్‌ ఇన్‌ క్లినికల్‌ రీసెర్చ్‌ విత్‌ సాస్‌ ప్రోగ్రామింగ్‌’ అనే అంశంపై అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను నిర్వహించామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూఎస్‌ఏలోని బేయర్‌ ఫార్మాస్యూటికల్స్‌ డేటా సైంటిస్ట్‌ వెంకట్‌ ఇక్కుర్తి మాట్లాడుతూ క్లినికల్‌ రీసెర్చ్‌లో సాస్‌ ప్రోగ్రామింగ్‌ను ఉపయోగించి అనలిటికల్‌ రిపోర్ట్స్‌ను జనరేట్‌ చేయవచ్చునని, దీని వలన ఖర్చు, మానవ వనరులు ఆదా అవుతాయని విద్యార్థులకు తెలియజేసారు. వీటితో పాటు ఖచ్చితమైన రిపోర్ట్స్‌ను పొందవచ్చునన్నారు. ఫార్మారంగంలో విద్యార్థులకు మంచి అవకాశులున్నాయని.. విద్యార్థులు కష్టపడి చదివి క్లినికల్‌ ఫార్మాసిస్ట్‌లుగా, పారిశ్రామిక రంగంలో శాస్త్రవేత్తలుగా, విద్యావేత్తలుగా ఎదిగి తమ కలలను సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన ఇండియా ఆపరేషన్స్‌ స్టాటిస్టికల్‌ ప్రోగ్రామింగ్‌ పారాక్సెల్‌ హెడ్‌ జయపాండియన్‌ నాగమలైయాన్‌   మాట్లాడుతూ విద్యార్థుల నుంచి ఇండస్ట్రీలు ఏమి ఆశిస్తున్నాయో వివరించారు. అనంతరం క్యాంపస్‌ టు కార్పొరేట్‌ అనే అంశంపై ప్రసంగించారు. మరో అతిథి ఇండియా బేయర్‌ అంకాలజీ డేటా అనలిటిక్స్‌ హెడ్‌ హనుమంతరావ్‌ కారెడ్ల మాట్లాడుతూ సాస్‌ ప్రోగ్రామింగ్‌ను అభ్యసించిన విద్యార్థులకు ఇండస్ట్రీలు, ఫార్మా రంగంలో ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని తెలిపారు. ఫార్మా విద్యార్థులు నూతన ఔషధాలను ఆవిష్కరించాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన అతిథులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆయా విభాగాల అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.