విద్యార్థులతో ఏదైనా సాధ్యమే

విద్యార్థులతో ఏదైనా సాధ్యమే
 - మాజీ ఏడీజీపీ వీవీ లక్ష్మీ నారాయణ


విజ్ఞాన్స్‌లో 100 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ

విద్యార్థులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని మాజీ ఏడీజీపీ వీవీ లక్ష్మీ నారాయణ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఏడీజీపీ వీవీ లక్ష్మీ నారాయణ మొదటి సంవత్సరం విద్యార్థులతో మాట్లాడుతూ బ్రెయిన్‌ అనే సూపర్‌ పవర్‌ను ఉపయోగించి దేశాన్ని సూపర్‌ పవర్‌గా మార్చాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు నిరంతరం దేశం గురించే ఆలోచించాలన్నారు. ఆనాటి భారతీయ సంస్కృతి, టెక్నాలజీ, సంప్రదాయాలు, స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర గురించి ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి గ్రామాలకు వెళ్లి రైతుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. విద్యార్థులందరూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలను ముందుకు వస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. విద్యార్థులు కృషి చేస్తేనే భారతదేశం కూడా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్నారు. అనంతరం ఎన్‌సీసీ విద్యార్థుల ఆధ్వర్యంలో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా 100 అడుగుల జాతీయ జెండాతో యూనివర్సిటీ ప్రాంగణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు  పాల్గొన్నారు.