స్త్రీజనోద్ధరణ సంస్కర్త రాజారామ్మోహన్ రాయ్ గారి జయంతి

స్త్రీజనోద్ధరణ సంస్కర్త రాజారామ్మోహన్ రాయ్ గారి జయంతి 
మూడు వందల ఏళ్ల క్రితం..మన వేదభూమిని చీకట్లు ఆవహించాయి..
అనాచారాలు స్త్రీ జాతి పాలిట శాపంలా మారాయి..దేశం సామాజిక మత విశ్వాసాల అంధకారంలో అలమటిస్తున్న కాలం. కాలం చెల్లిన అనాచారాలతో దేశం తల్లడిల్లుతున్న రోజులవి. 

మతమౌఢ్యం..సాంప్రదాయ కర్కశత్వం.. దైవత్వం ముసుగులో చలామణి అవుతున్న రోజులు. 

అమానవీయ దుర్మార్గం అసహాయులను.. అమాయకులను బలితీసుకుంటున్న దుష్ట చారిత్రక నేపథ్యం. పసిమొగ్గలాంటి పుత్తడి బొమ్మలను పండు ముదుసళ్ళకిచ్చి పెళ్ళిళ్ళు చేసారు. సమాజంలో సగభాగమైన స్త్రీలకు చదువే కాదు.. స్వేచ్ఛ కూడా అవసరం లేదని శాసించారు. బాల వితంతువులైనా నాలుగ్గోడల మధ్య అంధకారంలో మగ్గిపోవాల్సిందేనని ఛాందసత్వపు కొరడాలు ఝళిపించారు. వితంతు పునర్వివాహం జరిగితే లోకమే తల్లకిందులవుతుందని పుణ్యాత్ములు గుండెలు బాదుకున్నారు. కులమతాలకు పెద్ద పీట వేశారు. అప్పుడు ఆ సంధియుగంలో తూర్పు భళ్ళున తెల్లవారినట్టు భారతావనిని ఆవరించిన చీకట్లు చీల్చుకుంటూ ఉదయించాడో సంపూర్ణ మానవుడు. ఆనాటి ఆటవిక దుర్నీతిపై ..దుర్మార్గ దుస్ధితిపై తొలిసారి గళమెత్తాడు. కలమెత్తాడు. తిరుగుబాటు బావుటా నింగికెగరేసి అబద్ధపు ఆకాశాన్ని గడగడలాడించాడు. అతడే రాజా రామ్మోహన్ రాయ్.

ప్రస్థానం...
"""""""""""""""""""""""""'""""""""""""""
పశ్చిమ బెంగాల్ లోని ముర్షీదాబాద్ జిల్లా, రాధానగర్ గ్రామంలో మే22, 1772 లో సనాతన వైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో రామ్మోహన్ రాయ్ జన్మించాడు. ఆయన ఇంటి పేరు బందోపాధ్యాయ్. ఆయన ప్రాధమిక విద్యాభ్యాసం ఆ గ్రామంలోనే మాతృ భాష బెంగాలీలో జరిగింది. విద్య అంటే ఎంతో ఇష్టపడే రాయ్ తన ఉన్నత చదువులకోసం పాట్నా వెళ్లాడు. అక్కడే ఆయన పర్షియన్ అరబిక్ భాషలపై గట్టి పట్టు సాధించాడు. ముస్లింల పవిత్ర గ్రంధమైన ఖురాన్ తో పాటు ఇతర సూఫీ మత పెద్దల రచనలను మాతృకృతిలోనే చదవగలిగాడు. ఇదే సమయంలో ఆయన అరిస్టాటిల్, ప్లేటో రచనలు కూడా అధ్యయనం చేశాడు. అనేక ప్రాంతాలు పర్యటించి కొంత కాలానికి ఇంటికి చేరిన ఆయనకు వివాహం జరిపితే ఆయనలో కొంత మార్ప వస్తుందని కుటుంబపెద్దలు భావించారు. అయితే వివాహానంతరం కూడా ఆయనలో ఆశించిన మార్పు రాలేదు. ఆయన భావాలు ఆలోచనల్లో, తత్వంలో ఎలాంటి మార్పూ లేదు. పైగా హిందూ మత గ్రంధాలను మరింత విస్తృతంగా అధ్యయనం చేయడం కోసం కాశీ వెళ్లాడు.

సతీసహగమనం దురాచారంపై ..
""""""""""""""""""""""""""""""""""""""""
తాను నమ్మిన సిద్దాంతాల పైనే గట్టిగా రాయ్ నిలబడ్డాడు. సతీ సహగమనమనే అప్పటి ఆచారాన్ని అధికారికంగా నిషేధించడానికి ఇంగ్లీష్ ప్రభుత్వ పెద్దలకు అర్జీలు పెట్టాడు. ద్వారకానాధ్ వంటి కొందరు మిత్రులు రాజా రామ్మోహన్ రాయ్ ని సమర్దించారు. సతీ సహగమనం అనాగరికం అని బ్రీటీష్ ప్రభుత్వం కూడా గుర్తించింది. భర్త మృతదేహంతో పాటే భార్యను సజీవంగా చితిలో వేసి దహనం చేయడం అమానుషం అని గ్రహించింది. అయితే మరో వైపు ప్రజల మత విశ్వాసాలు సంప్రదాయాలలో ప్రభుత్వ జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మరో వర్గం హెచ్చరించింది. ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని తెగేసి చెప్పింది. సతిపై ఎటూ తేల్చుకోలేని స్ధితిలో బ్రిటీష్ ప్రభుత్వం పడిపోయింది. ఇటువంటి విషయాలలో ఆచీతూచీ వ్యవహరించాలని నిర్ణయించింది. దేశ మత విశ్వాసాలలో బ్రిటీష్ ప్రభుత్వం అనవసరంగా జోక్యం చేసుకుంటుందనే భావన ప్రజల్లో కలగకుండా చూడాలని నిర్ణయించింది. అయితే రాయ్ అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ ముందు బలమైన వాదనలు వినిపిస్తాడు. సమాజంలో కొన్ని సానుకూల మార్పులు సంస్కరణలు తెచ్చేముందు ఇటువంటి ఆటుపోట్లు తప్పవని ఆయన చెప్పాడు. రాయ్ ని బలపరుస్తూ విలియం బెంటింక్ సతీ నిషేధ చట్టాన్ని తెచ్చాడు. ఆ వార్తతో రాయ్ మిత్ర మండలికి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది.

ఇంటినుండే పోరు...
""""""""""""""""""""""""""""""""""""""""
రామ్మోహన్ రాయ్ తన సోదరుడు మరణించాడని వార్త తెలిసింది. పుట్టెడు దుఃఖంతో ఇంటికి చేరుకున్నాడు. అప్పుడే అతనికి మరో పిడుగుపాటు లాంటి వార్త తెలుస్తుంది. తన అన్నగారి చితిమంటల్లోనే వదిన గారు కూడా ఆత్మాహుతి చేసుకుందని తెలుస్తుంది. ఆమె వీర మరణం పొందినట్టు తల్లి చెప్తుంది. అది తమకు గర్వకారణమని అంటుంది. అప్పుడే రాయ్ కి తన పాదాల కింద భూమి కంపించి నట్టవుతుంది. తను ఏ దురాచారాన్ని రూపుమాపాలని అనుకుంటున్నాడో సరిగ్గా అదే తనింట్లోనే కనిపించింది. ఆవేశంతో ఊగి పోయాడు. సతి పేరిట తన వదినను హత్య చేశారని తల్లితో అంటాడు. ఆచారాల పేరుతో మనుషుల్ని చంపే అధికారం ఎవరికీ లేదని చెబుతాడు. సతీ సహగమనం ఒక మహాపాపమని గర్జించాడు. ఈ శాపాన్ని, మహాపాపాన్ని అంతమొందించే దాకా నిద్రపోనని నడుం బిగించాడు. నారీలోకానికే అసలైన పూజ్యనీయుడిగా చరిత్రలో నిలిచాడు.

పురుషులతో స్త్రీలు సమానం...
"""""""""""""""""""""""""""""'""""""""""
రాజా రామ్మోహన్ రాయ్ తాను చూసిన ఏ సామాజిక దురాగతాన్ని వదల్లేదు. బహుభార్యత్వం, బాల్య వివాహాలు తగదన్నాడు, వితంతు పునర్వివాహాలు ప్రోత్సహించాడు. స్త్రీలకు చదువు తప్పని సరని వారిని పురుషులతో సమానంగా చూడాలన్నాడు. స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించాలన్నాడు. కుల వ్యవస్ధను కూల్చాలన్నాడు. తాను చదివిన ఇస్లాం, క్రైస్తవం, హిందూ మతాలలోని అంశాలను ఐరోపా దేశాల్లోని స్వేచ్ఛా భావనలతో కలిపి ఒక సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టాడు. వేల ఏళ్లుగా వేళ్లూనిన మతాచారాలను ప్రశ్నించడం ఎవరికైనా అంత సులభం కాదు. ప్రజలను సన్మార్గంలో నడిపంచాల్సిన ఆచారాలే దురాచారాలై దురాగతాలు సృష్టిస్తున్నాయని చెప్పడం అంత తేలిక కాదు. కానీ ఆయన నల్గురితో నారాయణ అనలేదు. సంఘాన్ని సంస్కరిచడానికి ముందు దాన్ని నడిపించే మతాన్ని కూడా సంస్కరించాలనుకున్నాడు.

బ్రహ్మసమాజం నిర్మాణం...
""""""""""""""""""""""""""""""""""""""""
జాతి మనుగడకు దేశ ప్రజలు, ముఖ్యంగా యువత శాస్త్రీయ దృక్పధం అలవర్చుకోవడం తప్పనిసరని అప్పుడో ఉద్భోదించాడు. సమాజ పురోగతికి మహిళల స్వేచ్ఛ, మహిళల అభ్యన్నతికి ప్రత్యక్ష సంబంధం ఉందన్నాడు. మహిళలకు విద్యాగంధమే నిజమైన భూషణమని ఆరోజుల్లోనే ఆయన తేల్చిచెప్పాడు. అతని ఉత్సాహం ఉద్రేకం ఉద్వేగం విచక్షణ.. విజ్ఞానం ముందు ఆనాటి సాంప్రదాయక ఛాందసవాదులు కుప్పకూలిపోయారు. చిన్నవయసులోనే ఆయన ప్రప్రంచాన్ని చదివాడు. అనేక ప్రాంతాలు పర్యటించాడు. ముఖ్యమైన మత గ్రంధాలను చదవడం కోసం సంస్కృతం, పర్షియన్, అరబిక్, హిబ్రూ, యునానీ, ఆంగ్లం వంటి భాషలన్నీ నేర్చుకున్నాడు. సర్వమత సారాంశాన్ని క్రోడీకరించి హిందూ మతాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను పుననుజ్జీవంపజేశాడు. బ్రహ్మసమాజం పేరిట నవ సమాజానికి దారులు వేశాడు. సమాజం కోసం ఈస్టిండియా కంపెనీ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. నమ్మిన ఆదర్శాల కోసం కుటుంబ జీవనాన్నే ఫణంగా పెట్టాడు. సంప్రదాయాల విషయంలో తల్లిదండ్రులతో ఆయన అనేక సార్లు ఘర్షణపడ్డాడు.

పరమత సహనం...
""""""""""""""""""""""""""""""""""""""""
రాజారామ్మోహన్ రాయ్.. ఒక మహావ్యక్తి. సంఘసంస్కర్త.. సాహితీవేత్త, బహుగ్రంధకర్త, రాజకీయవేత్త, దూరదృష్టిగల నేత, మానవతావాది, హేతువాది, స్త్రీ పక్షపాతి, శాస్త్రీయ దృక్పధం కలవాడు, బహుభాషా కోవిదుడు. అనేక మతాల సారాంశం ఔపోసన పట్టినవాడు. సాంఘిక దురాచారాలపై సమర భేరి మోగంచిన వాడు. అలాంటి ఘనుడు సనాతన ఆచారాలను తు.చ. తప్పకుండా పాటించే ఒక సద్భ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. దాంతో రామ్మోహన్ రాయ్ కి హిందూ ఆచార వ్యవహారలను చాలా దగ్గరగా, ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం కలిగింది. వాటిలోని మంచి చెడులను బేరీజు వేసే వీలు కలిగింది. ఈ కారణంగానే ఆయన హిందూమతంలో సంస్కరణల అవసరాన్ని, అనివార్యాన్ని గుర్తించగలిగాడు. మత గ్రంధాల భాషణలకు విరుద్ధంగా ఆచారాల పేరిట సాగుతున్న అనేక అంశాలపై అభ్యంతరాలు చెప్పాడు. మత గ్రంధాల స్ఫూర్తికి విఘాతం కలుగుతోందని ఆయన ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఆధిపత్య వర్గాలు అణగారిన వర్గాలపై పెత్తనం చేయడం వారిని మరింత అణచి వేయడం ఏ మత గ్రంథాలు సమర్ధించడం లేదని ఆయన సంగ్రామస్ఫూర్తితో వాదించాడు. ఆ కాలంలో స్వమత కీర్తన, పరమత దూషణ సర్వసాధారణంగా జరిగేవి. ఇతర మతాలలోని మంచిని హిందూ మతం స్వీకరించాలని ఆయన పలికిన హితవు పెత్తందారీ వర్గాలకు కలవరం పుట్టించింది. సామాజికంగా, సాంస్కృతికంగా దేశం ముందంజ వేయడానికి రామ్మోహన్ చూపిన బాట ప్రపంచానికే ఆదర్శాలుగా మారాయి. అంటే తూర్పూ పడమరల మేలుకలయికకు ఆయన నిలువెత్తు సాక్ష్యంగా నిలిచాడు.

సంఘసంస్కరణలు...
""""""""""""""""""""""""""""""""""""""""
సమాజం గతి తప్పినప్పుడు సరిచేయాల్సిన బాధ్యతను గుర్తెరిగి నడుచుకున్నాడు. పాత దారులు పూడుకుపోయినప్పుడు కొత్తదారులవైపు కదలాలని చెప్పాడు. అప్పుడే సమాజం వినూత్నకాంతులతో వెలుగొందుతుందనే సందేశం ఇచ్చాడు. ఆ దారులకు సంస్కరణలు అన్వేషించాలని చెప్పాడు. సమాజంలో సాంఘికంగా, మతపరంగా సంస్కరణలు తీసుకు వచ్చే ఉద్దేశంతో రాయ్, 1814 లో ఆత్మీయ సభ అనే సంస్ధను ప్రారంభించాడు. ఆ తరువాత ఆయన 1828 లో బ్రహ్మసమాజం పేరిట మరో సంస్ధను స్ధాపించాడు. బ్రహ్మ సమాజం అంటే భగవంతుని సమాజం అని అర్ధం. భగవంతుడు ఒక్కడే అని, విగ్రహారాధన వద్దని ఈ సమాజాల ద్వారా ఆయన ఎలుగెత్తి చాటాడు. భగవంతునికి పలు రూపాలు కట్టబెట్టిన ఆలోచనల వెనక ఔచిత్యాన్ని ప్రశ్నించాడు. చనిపోయిన భర్తతోపాటే భార్యను చితిలో వేసే దురాచారం సతీసహగమనంపై పోరాటం చేశాడు. ఇందుకోసం ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి ఎన్నోవ్యాసాలు రాశాడు. చివరికి అప్పటి ఇంగ్లీషు ప్రభుత్వం దిగివచ్చి సతీ ఆచారాన్ని నిషేధిస్తూ చట్టం తెచ్చింది. బ్రిటీష్ ప్రభుత్వ గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడంలో రాయ్ పాత్ర కీలకమైందని చెప్పాడు. ఈ విషయం పై హిందూ సనాతన వాదుల నుంచి రాయ్ తీవ్ర ప్రతిఘటనను ఎదురుకున్నాడు.

ఆంగ్లభాషతో ఆధునిక భావాలు...
"''"''"""""""""""""""""""""""""'""""""""""
పదిహేనేళ్ళలోపే రాయ్ పలు ప్రధాన భాషలు నేర్చుకున్నాడు. ప్రజల్లో ముఖ్యంగా యువతలో ఆధునిక భావనలు పాదుకొల్పటానికి ఇంగ్లీష్ విద్యే సరైందని నమ్మాడు. అయితే ఆయనకు ఇంగ్లీష్ భాషన్నా, ఇంగ్లీష్ వారన్నా అవ్యాజ్యమైన ప్రేమ ఉందనడం సరైంది కాదు. ఆయన విశ్వజనీనమైన స్వేచ్ఛను ఆకాక్షించాడు. 1830 లో ఫ్రెంచ్ విప్లవం విజయం సాధించడాన్ని రామ్మోహన్ రాయ్ స్వాగతించాడు. అలాగే ఐర్లాండ్ లోనీ ప్రజలను బ్రిటీష్ వారు నానా యాతనలు పెట్టడాన్ని నిరసించాడు. సంస్కృతంలో కొనసాగుతున్న భారతీయ సంప్రదాయ విద్యా విధానం కన్నా ఆంగ్లభాషలో సాగే విద్యా విధానం మరింత ఉత్తమమైందని, ప్రయోజనకరమైందని భావించాడు. ఆంగ్లభాష అభ్యసించడం వల్ల శాస్త్రీయ దృక్పధం అలవడుతుందని, వైద్య, సాంకేతిక రంగాల్లో పురోభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మాడు. ఈ ఉద్దేశంతోనే ఆయన ఆంగ్లం బోధనామాధ్యమంతో పాఠశాలలను, కళాశాలలను కూడా స్ధాపించాడు.

ప్రపంచపర్యటనలు...
"""'''"""""""""""""""""""""""'"""""""""""
రాజా రామ్మోహన్ రాయ్ స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తి. ఆ రోజుల్లోనే ఆయన మతంలో భారీ సంస్కరణలు అవసరమని నిష్కర్షగా చెప్పాడు. చెప్పడమేకాదు, అనేక సామాజిక దురాచారాలపై ప్రత్యక్ష యుద్దం ప్రకటించాడు. ఈ సందర్భంగా ఆయన తన కుటుంబంతో కూడా ఘర్షణ పడాల్సి వచ్చింది. మనం సమాజంలో బతకాల్సి ఉంటుందని, సమాజాన్ని కాదంటే పచ్చి మంచినీళ్ళు కూడా పుట్టవని తన మాతృమూర్తి రాయ్ కి నచ్చజెప్ప చూస్తుంది. ఆ భగవంతుడ్ని పలురూపాల్లో సాక్షాత్కరింప చేసే విగ్రహాలను ఆరాధించ వద్దంటావా? అవి ఒట్టి శిలలని అంటావా? అని నిలదీస్తుంది. తమ కుల దైవమైన పూరీ జగన్నాధుని సందర్శనకు వెళ్ళడానికి కొంత ధనం సర్ధమని కుమారుడ్ని అడుగుతుంది. అందుకు ఆయన నిరాకరిస్తాడు. ఆలయాల సందర్శన వంటివాటికి తప్ప మరేయితర సామాజిక సేవా కార్యక్రమం తలపెట్టినా ధనం ఇవ్వడానికి అభ్యంతరం లేదని చెప్పాడు. తాను నమ్మిన ఆశయాల కోసం ఆయన తన తల్లి పట్ల ఆవిధంగా కఠినంగా వ్యవహరించాడు. దుఃఖాన్ని దిగమింగాడే తప్ప ఆశయాలకు నీళ్లొదల్లేదు. ఆయన తన ప్రపంచ అవగాహన పెంచుకోడానికి వివాహానికి ముందే హిమాలయ ప్రాంతంలోను, టిబెట్ లోను పర్యటించాడు. మత సంస్కరణలకు సంబంధించి నూతన మార్గాలను ప్రతిపాదించడానికి దోహదపడ్డాయి. మతం సర్వసమ్మతం కావాలి కానీ మూఢత్వం కాకూడదని చాటిచెప్పాడు.

రాజా' బిరుదుతో సత్కారం...
""''''"""""""""""""""""""""""""""""""""""
అలాగే ఆ కాలంలో ఇంగ్లీష్ భాష అందుబాటులోకి రావడంతో, భారతీయ మేధావుల్లో అనేక కొత్త దృక్పధాలకు దారులు తెరుచుకున్నాయి. ఇదెందుకు ? అదెలా? అని ప్రశ్నించే హేతువాద ఆలోచనలు కొత్త చిగుళ్లు తొడిగాయి. విషయాలను గుడ్డిగా నమ్మడం, వాటిని ఆచరించే పద్దతుల్లో మార్పులొచ్చాయి. స్త్రీ స్వేచ్ఛాసంబంధ భావనలు వ్యాపించాయి. వీటినుంచి స్ఫూర్తిని పొందిన రాయ్, సమాజ సంస్కరణల ఆవశ్యకతను గుర్తించి అందుకోసం నడుంబిగించాడు. అది గుర్తించిన మొఘల్ ప్రభువులు రాయ్ సేవలకు, ప్రతిభకు మెచ్చి 'రాజా' అనే బిరుదుతో సత్కరిస్తారు. ఆ కారణంగానే రామ్మోహన్ రాయ్... రాజా రామ్మోహాన్ రాయ్ అయ్యాడు. తరువాత ఆయన మొఘల్ ప్రభువుల రాయభారిగా 1830 లో ఇంగ్లాండ్ వెళ్తాడు.

ఉదయభానుడు ఆస్తమయం...
""""""""""""""""""""""""""""""""""""""""
ఇంగ్లాండ్ వెళ్ళటానికి ఆయన చేసిన సముద్రయానం కూడా వివాదస్పదం అవుతుంది. సముద్ర యానాన్ని హిందూమతం ఆమోదించదనే సనాతనులు అభిప్రాయాన్ని తల్లి వెల్లడిస్తుంది. ఇంగ్లాండ్ వెళ్లిన రాయ్ ఇక తిరిగి స్వదేశం రాలేదు. ఆ దేశంలో బ్రిస్టల్ సమీపంలోని స్టాపిల్ టన్ లో రాయ్, సెప్టెంబర్ 27,1833 లో మెదడు సంబంధ వ్యాధితో ఆయన కన్ను మూశాడు. అప్పటికి ఆయన వయస్సు 61 ఏళ్ళు. చీకట్లో మగ్గుతున్న స్త్రీ జాతి విముక్తి కోసం అహర్నిశలు తపించిన, శ్రమించిన ధీరోదాత్తుడు రాయ్.. మత సంప్రదాయాలు గతి తప్పి అనాగరికమైనప్పుడు ఆ మతాన్నే ఆసాంతం ప్రక్షాళన చేయాలన్న సాహసికుడు.. దార్శనికుడు. సంప్రదాయం ముసుగులో దైవత్వం పేరుతో సమాజంలోని సగభాగాన్ని అన్యాయంగా శాశ్వతంగా చీకటి లోయల్లోకి విసిరేయడం మహాపాపమని నినదించాడు. అందుకే ఆయన స్త్రీజాతికి అసలైన దేవుడుగా నిలిచాడు. అందుకే ఆయన సమాజం చీకట్లోనుండి వెలుగులు పంచే ఉదయభానుడు.. ఆధునిక భారత నిర్మాత, సంఘ సంస్కర్త ..