నేడు విశ్వ కవి జాషువా జయంతి

నేడు  విశ్వ కవి జాషువా  జయంతి

*నిఖిల లోక మెట్లు నిర్ణయించిన నాకు
 తిరుగు లేదు విశ్వ నరుడ నేను."!!

*జాషువా అనగానే పద్యం గుర్తుకు రావడం    
 సహజం..!!

" కవితావీణపై నేను మ్రోయించిన వ్యధ తంత్రులే …
  నా " ఖండ కావ్యాలు " ..!!

*నేనాచరింపని నీతులు బోధించి రాని రాగము
 తీయలేను నేను.."!

 *ఇది మరణదూత తీక్షమౌ దృష్టు లొలయ
  నవని బాలించు భస్మ సింహాసనంబు "!

*కులమతాలు గీసుకున్న గీతలు జొచ్చి
 పంజరాన గట్టు పడను నేను
 నిఖిల లోక మెట్లు నిర్ణయించిన నాకు
 తిరుగు లేదు విశ్వ నరుడ నేను."!!

ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా నాటి  సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసారు.. కొందరు తక్కువ  కులంగా  భావించే 
కులం‌ లో జన్మించిన ,కారణంగా అనేక అవమా
నాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయు
ధంగా చేసుకుని మూఢాచారాలపై తిరగబడ్డారు.
కులమతాల పంజరంలో చిక్కే సామాన్యుడ్ని కాను..
"విశ్వనాథుని" నేను.. అంటూ ప్రకటించుకున్నారు‌
తన సహజ ప్రతిభతో ..ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందిన గొప్ప కవి గుర్రం జాషువా గారు….!!

*జీవితం.. !!

"నవయుగ కవి చక్రవర్తి " గుర్రం జాషువా గారు
1895, సెప్టెంబర్ 28 న గుంటూరు జిల్లా వినుకొండ
గ్రామంలో జన్మించారు.తండ్రి వీరయ్య,తల్లిలింగమ్మ
వేరువేరు కులాలకు చెందిన వారు. తండ్రి యాదవ, తల్లి మాదిగ.ఈ పెళ్ళికి కుల పెద్దలు అంగీకరించక 
పోవడంతో వీరయ్య క్రైస్తవం స్వీకరించి మత బోధ
కుడయ్యాడు.

*బాల్యం నుంచే కష్టాలు..!!

కుల వివక్ష వల్ల బాల్యంనుంచేజాషువా ఎన్నో అవమానాల్ని,ఛీత్కారాల్ని ఎదుర్కొన్నారు
మూఢాచారాలతో నిండిన సమాజంలో కులం పేర వెలికి గురయ్యారు.బడిలో చేరాక జాషువా గారికి అసలు కష్టాలు మొదలయ్యాయి.

బళ్ళో ఉపాధ్యాయులు, తోటి అగ్రవర్ణాల  పిల్లల నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిం
ది.అయితే జాషువా గారు ఊరుకొనేవారుశ కాదు, తిరగబడేవారు. అగ్రవర్ణాల పిల్లలు కులం పేరుతో హేళన చేస్తే, తిరగబడి వాళ్ళను కొట్టేవారు‌

1910లో జాషువా గారు శహమేరీని పెళ్ళి చేసు
కున్నారు.. మిషనరీ పాఠశాలలో నెలకు మూడు రూపాయల జీతంపై ఉద్యోగం చేసేవాడు.ఆ ఉద్యో.
గం పోవడంతో రాజమండ్రికి వెళ్ళి 1915-16 లలో అక్కడ సినిమా వాచకుడిగా పనిచేసారు. టాకీ సినిమాలు లేని ఆ రోజు ల్లో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా నేపథ్యంలో కథను, పాత్రోచి
తంగా సంభాషణలను చదవడమన్న మాట. తరు
వాత గుంటూరులోని లూథరన్‌ చర్చి నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా10 సంవత్సరాల పాటు పనిచేసారు.తరువాత 1928 నుండి 1942 వరకుగుంటూరు లోని ఉన్నత పాఠ
శాలలో తెలుగు పండితుడిగా పనిచేసారు.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా కూడా పనిచేసారు.. 1957-59 మధ్య కాలంలో మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా
 పనిచేసారు.జీవనం కోసం ఎన్నో రకాల ఉద్యోగాలు చేసిన జాషువాకు 1964లో ఆంధ్ర ప్రదేశ్ శాసన
మండలిలో సభ్యత్వం లభించింది.1971 జూలై 24న తన య75వ యేట  గుంటూరు లో గుర్రం 
జాషువా తుది శ్వాస వదిలారు.

ఒకసారి వినుకొండలో జరిగిన ఒక అవధాన సభలో 
ఆయన పద్యాలు చదివాడు. తక్కువ కులం వాడిని
 సభ లోకి ఎందుకు రానిచ్చారంటూ కొందరు ఆయన
ను అవమానించారు. ఆయనకు జరిగిన అవమానా
లకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అంటరానివాడ
ని హిందువులు ఈసడిస్తే, క్రైస్తవుడై ఉండీ, హిందూ 
మత సంబంధ రచనలు చేస్తున్నాడని క్రైస్తవ మతా
ధిపతులు ఆయన్ను నిరసించారు. ఆయనకుటుంబా
న్ని క్రైస్తవ సమాజం నుండి బహిష్కరించారుదాంతో
ఆయన క్రమంగా ఆయన నాస్తికత్వం వైపు మొగ్గు
చూపారు.తన జీవిత కథను " నా కథ " పేర పద్యాల
లో రాసుకున్నారు.

*రచనలు…!!

ప్రారంభంలో సంసారం గడవడానికి జాషువా రచన
ల్ని చేశారు.వోటిలో చిదానంద ప్రభావతము, రుక్మిణి
కల్యాణం,ధ్రువ విజయము,మీరాబాయి,తెరచాటు
అనే నాటకాలు రాశారు.వీటితో పాటు హిమదహ
మార్కపరిణయము,మదాలస తదితర రచనలు
కూడా చేశారు.అలాగే శివాజీ రాజు కథ అనే….. 
ప్రభంధాన్ని కూడా రాశారు.అయితే అది అలభ్యం.!

* ఖండకావ్యాలు..!!

జాషువా అనగానే ఖండ  కావ్యాలు గుర్తొస్తాయి.
ఇలా పద్యాల్లో ఖండకావ్యాల రచనలో బ్రహ్మర్షి
ఉమర్ అలీ షా గారి తర్వాత చెప్పుకోదగిన
మహాకవి జాషువా గారే.కరుణశ్రీ జంధ్యాల పాప
య్య శాస్త్రి గారిని  కూడా ఇదే వరుసలో స్మరించు
కోవాలి..

జాషువా అనగానే పద్యం గుర్తుకు రావడం సహజం.
పద్యం ఆయన చేతిలో కొత్త సొగసుల్ని సంతరించు
కుంది.ఆయన రాసినవన్నీ దాదాపు పద్యరచనలే.

జాషువా అనేక కావ్య ఖండికలను రాశారు.ఒక్కో
వస్తువును ఒక్కో ఖండికగా మలిచేవారు.‌వాటన్ని
టిని ఖండ కావ్య సంపుటిగా వెలువరించేవారు.
కాగా..తన ఖండశ కావ్యాలను  గురించి జాషువా
గారేమన్నారో..చూడండి..!

"మరణం లేని మానవత్వాన్ని కామించు కవితా
వీణపై నేను మ్రోయించిన వ్యధా తంత్రులే ...
" ఖండ కావ్యాలు ",దేశం చిమ్ముతున్న కన్నీటి 
చెమ్మ నా  ఈ ఖండ కావ్యాలు."!!

*ఖండకావ్యం.‌తొలి భాగం...!!

ఈ సంపుటి పలుమార్లు ముద్రణలు పొందింది.
ఇందులో..సాలీడు, స్మశాన వాటిక,రాజదర్శనం
గుంటూరు సీత,..తదితర ఖండికలున్నాయి.
స్మశాన వాటికలోని కొన్ని పద్యాలను బలిజేపల్లి 
లక్ష్మీకాంతం గారి సత్యహరిశ్చంద్ర నాటకంలో
పొందుపరచడం విశేషం.ఈ పద్యాలు నేటికీ
జనం నోళ్ళలో నానుతున్నాయంటే అతిశయోక్తి కాదు.

*ఇచ్చోటనే  సత్కవీంద్రుని  కమ్మని
                 కలము నిప్పులలోన గరిగిపోయె

యిచ్చోటనే భూములేలు రాజన్యుని
.                యధికార ముద్రిక లంతరించె

యిచ్చోట నేలేత యిల్లాలి నల్లపూ
  ‌              సల సౌరు గంగలో గలసిపోయె 

యిచ్చోట నెట్టి పేరెన్నికం గనుగొన్న
‌.              చిత్ర  లేఖకుని కుంచియె నశించె.!!

 ‌.        ఇది పిశాచులతో నిటలేక్షణుండు
          గజ్జెగదలించి యాడు రంగస్థలంబు
          ఇది మరణదూత తీక్షమౌ దృష్టు లొలయ
          నవని బాలించు భస్మ సింహాసనంబు "!

    ‌‌.      …. (మహాకవి గుర్రం జాషువా)

జాషువా గారు  దళితుడన్న కారణంతో సమాజం
లోనే కాకుండా, కవిత్వంలో కూడా అస్పృశ్యతను 
పాటించారు మన ఒంటికన్ను పండితులు.

“ నా కవితా వధూటి వదనంబు నెగాదిగ జూచి
  రూప రే
  ఖా కమనీయ వైఖరులు గాంచి “భళీభళి “ యన్న 
  వాడె మీ
  దేకుల “ మన్న ప్రశ్న వెలయించి : చివాలున 
  లేచిపోవుచో
  బాకున గ్రుమ్మినట్లగును పార్థివ చంద్ర వచింప 
 ‌ సిగ్గగున్ . “

                    (రాజదర్శనము..ఖండము )

మీ గోత్రం ఏదండీ? అనడిగితే “నాది విశ్వమానవ 
గోత్రం “అనిచెప్పే మానవతా వాదిజాషువా గారి 
పట్ల చూపిన  ఈ వివక్షతను ఏమనాలి? కవిత్వాన్ని 
చదివి ఆనందంచి‌ “భళీభళీ “అంటూ... ఆకాశానికె
త్తేసిన వారు,ఈ  కవి కులం తెలియగానే ' ముఖం
తిప్పేసే ' కులపిచ్చోళ్ళున్న ఈ సమాజంలో కులం,
మతం ముసుగులో కవులకు ,రచయితలకు  
జరుగుతున్న అన్యాయానికి  సిగ్గుపడాలి.!!

*ఖండకావ్యం..రెండో భాగం.!!

ఇందులో భరతమాత,ఆంధ్రుడు,హెఛ్చరిక,శశి ప్రబో
ధం,వివేకానంద,ఆంధ్రుడు,పంచముడు,మాతృప్రేమ,
కవితా లక్షణము,చీట్లపేక.తదితర 32,ఖండికలు న్నాయి..

*సింధు గంగానదీ జల క్షీరమెపుడు
 గురించి బిడ్డలు బోషించు కొనుచు నున్న
 పచ్చి బాలెంతరాలు మా భరతమాత
 మాతలకు మాత సకల సంపూర్ణేష్"!!

         .           ‌. ‌..భరతమాత.!!

ఖండకావ్యం..మూడో భాగం..!!

ఇందులో కృతజ్ఞత,తిక్కయజ్ఞ,భట్టు మూర్తి,గోవు,
కన్నతల్లి,సుబాసు బోసు తదితర 20 ఖండికలు న్నాయి.

*నా కన్నన్ మొనగాండ్రు సత్కవి వరుల్ 
 నా కన్న విద్యా నిధుల్
 నాకన్నన్ రుచిగా దెలుంగు కవితన్గ
 ల్పించు వారుండగా
 నాకీ బంగరు గండపెండియరము 
 న్బాదాన గీలించి పె
 న్బాకీ నాతల నిల్పినావు గదా?‌బెజ్వాడ 
 పుర గ్రామణీ."!!

బెజవాడలో తనకు జరిగిన సమ్మానానికి 
జాషువా గారు కృతజ్ఞతా పూర్వకంగా 
చెప్పినా పద్యం ఇది.తను ఎంత పెద్ద కవైనా..
ఎదిగిన కొద్దీ ఒదిగుండాలన్న ఆయన వినయాన్ని
సంస్కారాన్ని ఇందులో చూడొచ్చు.

*ఖండకావ్యం..నాల్గో భాగం..!!

నవభారతం,క్రీస్తు, తెలుగు గడ్డ, వీరేశలింగం కవి,
స్వేచ్ఛా దినం,సవతి తల్లి,ప్రశ్న..తదితర 26 ఖండి
కలున్నాయి.

*ఖండకావ్యం..ఐదో భాగం..!!

బడిపంతులు,వుంచితే,ఓటు,మాత,పిలక,నేను 
వంటి 24ఖండికలున్నాయి.

*ఖండకావ్యం..ఆరోభాగం.!!

శారదా దర్శనము,నాగార్ధునుడు,విశ్వకవి,వీరి
చానమ్మ, సంక్రాంతిశ్రద్ధాఃజలి.జోతలు,మణిహారము,
చంద్రోదయం..తదితర 33కవితా ఖండికలు న్నాయి.

*ఖండకావ్యం..ఏడో భాగం.!!

రక్త తిలకం,ప్రథమాస్థాన కవి,సింహనాదము, తస్మాత్
 జాగ్రత్త.పితృభక్తి,తండ్రిదీవెన తదితర
25కవితా ఖండికలు న్నాయి.

*లఘు కావ్యాలు..!!

*గబ్బిలం..!!

జాషువా గారి పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చే గొప్ప
కావ్యం.."గబ్బిలం ".

కవ్య రచనలో రాజులను,మహారాజులను నాయకు
లుగా చేసే పద్ధతికి స్వస్తి చెప్పి...చెప్ఫులు కుట్టుకుం 
టూ..బతికే ఓ అరుంధతీ సుతుణ్ణి నాయకుడిగా …
చేశారు కావ్యం వస్తువులో ఇలాంటి సరికొత్త ప్రయో
గం చేయబట్టే..ఈ కావ్యం వెయ్యేళ్ళ తెలుగు సాహి
త్యంలో గొప్ప గ్రంథాలుగా ఎంపికైన వాటిలో 
ఈ కావ్యం ముందు వరుసలో వుంది. 

*పిరదౌసి…!!

పారశీక కవి పిరదౌసి కారును పత్రికల్లో చదివి జాషు
వా గారు ఈ కావ్యాన్ని రచించారు.గజనీ మొహమ్మ
ద్ తన వంశం చరిత్రను రచిస్తే పద్యానికి ఓ బంగారు
నాణెం ఇస్తానని చెబుతాడు.ఈ మేరకు "షానామా " 
పేరులో ఫిరదౌసి గజనీ వంశ చరిత్రను రచిస్తాడు.
కానీ ..గజనీ మాట తప్పి పిరదౌసి కి వెండి నాణాలు 
పంపుతాడు‌.పిరదౌసి వాటిని తిరస్కరిస్తూ..గాంధీజీకి
ఓ నిందాపూర్వక లేఖ పంపుతాడు.దానికి కోపించి
పిరదౌసిని బంధించమని ఆజ్ఞాపిస్తాడు గజనీ.ఈ 
విషయం తెలుసుకున్న కవి పారిపోతాడు.అయితే 
అప్పటినుంచి గజనీకి అనేక కష్టాలు చుట్టుముట్టి 
ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.తాను చేసిన తప్పును తెలుసు
కొని అన్ని మాట ప్రకారమే పిరదౌసికి బంగారు నాణేలను 
పంపుతాడు.వాటితో తన సొంత నగరంలో ఓ ధర్మ  సత్రం 
కట్టిస్తాడు పిరదౌసి‌..

జాషువా గారి గొప్ప రచనల్లో ఇదొకటి.

*ముంతాజ మహలు..!!

ఈ కావ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే.మొగల్
చక్రవర్తి తన భార్య ముఃతాజు గుర్తుగా తాజ్ మహల్ 
ను కట్టిస్తాడు.ప్రపంచంలోనే ఏడో వింతగా చెప్పుకునే 
ఈ పాలరాతి భావన నిర్మాణానికి దారితీసిన పరిస్థి
తులు,..ప్రేమైక జీవనం.వేదాంత చర్చలతో ఈ కావ్యాన్ని 
రక్తి కట్టించారు జాషువా.

తాజ్ నిర్మాణంఎలా జరిగింది?దానికి ఎటువంటి 
జాగ్రత్తలు తీసుకున్నారో జాషువావర్ణించిన తీరును
మీరే చూడండి.. 

“ఏ  వన్నె గల తీవ కే పచ్చ సవరింప
        జెలువారునో దాని చిలికిజేసి
ఏ పుష్పదళమున కే పుష్యరాగంబు
         సరిపోవునో దాని సంఘటించి
ఏ కిసాలంబున కే కెంపు జోడింప
         కొమరారునో దాని కూర్పుజేసి
ఏ గులాబీ మొగ్గ కే రవ్వ బొదిగింప
         నందగించునొ దాని నతుకబెట్టి

ప్రకృతిసిద్ధమైన వన్నెతో వన్నెకు
చెలిమి గలిపి భావముల నిమిడ్చి
చలువరాతి ఫలకములు దీర్పసాగిరి
చిత్ర చిత్ర గతుల  శిల్పివరులు “

               *...ముంతాజ మహలు !!

ఇక "కాందిశీకుడు,బాపూజీ,స్వప్నకథ,నేతాజీ,రాష్ట్ర
పూజ,ముసాఫిరులు,క్రీస్తు చరిత్రము,కొత్త లోకము,
వంటి లఘు కావ్యాలు జాషువా గారి రచనా సంధా
నానికి అద్దంపడతాయి.

*నెరవేరని..జంటకవిత్వం!!

దీపాల పిచ్చయ్య శాస్త్రి, జాషువా గారు  కలిసి 
జంటగా కవిత్వం రాద్దామనుకున్నారు ,అయితే 
వీరి జంటకు పేరు సరిగ్గా కుదరలేదట.ఎటుతిప్పినా '
పిచ్చి జాషువా 'అనిగానీ,లేక‘జాషువా పిచ్చి’ అని 
గానీ జంట పేరు పెట్టుకోవాల్సి వస్తున్నందున,ఈ 
ప్రయత్నాన్ని  వారు విరమించు కున్నారట.

*వ్యక్తిత్వం..!!

నివసించుటకు చిన్ని నిలయమొక్కటి దక్కు 
గడన సేయుట కాన పడను నేను

ఆలుబిడ్డలకు నై యాస్తిపాస్తులు గూర్చ 
పెడత్రోవలో పాద మిడను నేను

నేనాచరింపని నీతులు బోధించి రాని రాగము
తీయలేను నేను

సంసార యాత్రకు చాలినంతకు మించి
గ్రుడ్డి గవ్వయు కోరుకొనను నేను.."!!

జాషువా జీవితం కష్టాల సంద్రం.ఒడిదుడుకుల 
నావ.నాటి సమాజంలోని దారిద్ర్యం,కుల వివక్షను
చీల్చిచెండాడి..తాను మనిషిగా నిరూపించుకోవా
లని ప్రయత్నించారు.ప్రజలందరికీ నిత్యావసరాలు
సమకూరిన నాడే నిజమైన స్వాతంత్ర్యం సిద్ధిస్తుం
దని భావించేవారు.

జాషువా గారు దేశభక్తుడు.సామాజిక వాది.విశ్వ
నరుడు.అందరూ బాగుండాలని కోరుకున్న మంచి
మనిషి.సమాజంలోని మూఢనమ్మకాలు,మతం
పేర కులం పేర జరిగే  వివక్షల్ని ఆయన ధైర్యంగా
ఎదిరించి నిలిచారు.

'గుణం లేని పాలకుడు కులం గొడుగు పడతాడు.
మానవత్వం లేని పాలకుడు మతాలను రెచ్చ 
గొడతాడు.పనితనం లేని పాలకుడు ప్రాంతాల
 మధ్య చిచ్చు పెడతాడు.'అంటూ దుర్మార్గుడైన 
పాలకుడ్ని గురించి చెబుతారు జాషువా.!

*హేతువాదిగా..!!

హేతువాద ఉద్యమ కర్త గోరా గారి కుమారుడు
లవంగంకు తన కుమార్తె హేమలతనిచ్చి పెళ్ళి 
చేశారు.అసలు భగవంతుడెళరు? స్వర్గమంటే 
యేమిటని ప్రశ్నించారు.గబ్బిలం కావ్యంలో అరుం
ధతీ సాగుతుందని వుద్దేశించి ' మనిషిని ఉద్ధరించ
డానికి భగవంతుడే లేకపోతే..ఇక మనిషినెట్లా కాని
కరిస్తాడని ప్రశ్నిస్తాడు.దెవుడికి పక్షపాతం లేదనడం 
లో నిజం లేదంటారు జాషువా.ఓ రకంగా దేవుడి కంటే 
మృత్యుదేవతే నయం‌..దుష్టుడి మీదా..మంచి
వాడి మ దా ఒకే రకపు చూపును ప్రసరింపజేస్తుం
వుంటారు..!!

బిరుదులు/ సమ్మానాలు..!!

జాషువా గారికి గజారోహణ..కనకాభిషేకాలు 
జరిగాయి.కవికోకిల,కవితా విశారద,కవి దిగ్గ
జం, నవయుగకవి చక్రవర్తి,మధుర శ్రీనాథుడు.,
విశ్వకవి సామ్రాట్ బిరుదులతో పాటు.. కళాప్ర
పూర్ణ, పద్మభూషణ్ వంటి ప్రభుత్వ పురస్కారా
లు కూడా వరించాయి.

1971జులై 21న అంటే..75యేళ్ళ వయసులో
అనారోగ్యంతో స్వర్గస్తులయ్యారు.

*రాజు మరణించె నొక తార రాలిపోయె
 కవి మరణించె నొక తార గగనమెక్కె
 రాజు జీవించు రాతి విగ్రహములు
 సుకవి జీవించు ప్రజల  నాలుకల యందు.!!

పేదరికం,కులవివక్ష,వల్ల తాను బాధలు పడినా
మనుషులెప్పుడూశనవ్వుతూ వుండాలని చెప్పే
వారు...చెప్పినట్లే నవ్వుతూజీవించారు.పేదలు,
అట్టడుగు వర్గాల కోసంకలంపట్టి నిలిచి పోరాడిన 
యోధుడు..కవిరాజు.జాషువా గారు.. తెలుగు 
సాహిత్యంలో ఇలాంటి కవి మరొకరు లేరంటే
అతిశయోక్తి కాదు.

       
- ఎ.రజాహుస్సేన్