సీన్ పేపర్ అంటే ఏంటి.. దాని ఫార్మాట్ ఎలా ఉంటుంది

"సీన్ పేపర్ అంటే ఏంటి.. దాని ఫార్మాట్ ఎలా ఉంటుంది.."  

స్క్రీన్‌ప్లే భగవద్గీత.. ఒక్కో సీను అందులో ఒక పర్వం..

నటీనటులకు ఆ సీనులో ఏం జరుగుతోంది, వాళ్ళ పాత్ర ఎంత ఉంది, మాట్లాడే మాటలేంటి, ఇవాల్సిన ఎక్స్‌ప్రెషన్లేంటి అనే వివరాలు తెలిస్తే టెక్నికల్ క్రూ మొత్తానికి షూటింగుకి కావాల్సిన వివరాలన్నీ తెలిసేది సీను పేపరు వల్లే..

సీనంటే స్క్రీన్‌ప్లే లో ఒక లొకేషనులో మొదలై అదే లొకేషనులో పూర్తయే ఒక దృశ్యం. ఆ దృశ్యంలో ఎమోషను మారచ్చు, పాత్రధారులు మారవచ్చు, పాత్రధారులు కదులుతూ వెళ్తూండగా అదే లొకేషనులో సెటప్ మారచ్చు.. (ఉదా: ఒక ఇంట్లో హాల్లో మొదలై బెడ్రూములో ముగిసే సీను). కానీ అదే ఎమోషనుతో ఉన్నా లొకేషను మారితే సీను మారుతుంది.. సీను నంబరు మారుతుంది.. ఇది మొదటి పాయింటు..

లొకేషను ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే..

 సీను పేపరు రాసుకునేది షూటింగుకి ప్రిపరేషను కోసం.. సో, ఒకరోజు ఒక లొకేషనుకి వెళ్తే అక్కడ ఆ నటీనటులతో చేయగలిగిన సీన్లన్నీ లిస్టేసుకుని ప్లాన్ చేసుకోడానికి బేస్ సీన్ పేపరే..

ఇది కామన్ సెన్సు.. ఇక్కణ్ణుంచి తరవాతి ఆర్టికిల్ అంతా ప్రొడక్షను, ప్లానింగు, స్కెడ్యూలింగు దృష్టితో చూడండి.. మీకు తేలిగ్గా అర్ధమవుతుంది..

సీను పేపరు మీద హెడర్స్ గా ఉండే ముఖ్య వివరాలు.. సీన్ నంబరు, ఆ దృశ్యం ఎక్కడ (లొకేషను) జరుగుతోంది, లోపలా బయటా (ఇంటీరియర్/ఎక్స్‌టీరియర్) పగలా రాత్రా (డే/నైట్ ఎఫెక్ట్).. ఇంటీరియరు, డే/నైట్ వివరాలు లైటింగు, ఎక్విప్‌మెంటు ఏమేం కావాలి అన్నదాన్ని నిర్ణయిస్తుంది..

ఇక మ్యాటరుకొస్తే మన ఇండియన్ ఫార్మాటులో సీను పేపరుని మధ్యకు విభజించి లెఫ్టు సైడు యాక్షను, రైటు సైడు డైలాగు రాయడం ఆనవాయితీ.. కోడైరెక్టరు సీను పేపర్ని మధ్యకు మడిచి పట్టుకుని తిరుగుతూ ఉండడాన్ని గమనించే ఉంటారు..

యాక్షన్ పార్టులో జనరల్‌గా షాటు రేంజి ఏంటి వైడా క్లోజా అన్నదానితో మొదలై లొకేషన్ డిస్క్రిప్షను, ప్రాపర్టీసు, మూడెలా ఉంది, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఏమొస్తోంది, క్యారక్టర్లెవరు, వాళ్ల కదలికలేంటి, భావాలేంటి.. ఇలా విజువలైజేషనుకి కావాల్సిన వివరాలన్నీ రాసుకోవచ్చు.. యాక్షను మొత్తం రాశాక దాని తరవాతి లైనులో రైట్ సైడు డైలాగు రాస్తారు..  

డైలాగు మధ్యలో లేదా ఇద్దరు పాత్రధారుల మాటల మధ్యలో ఏదన్నా యాక్షనుంటే మళ్ళీ లెఫ్టు సైడుకొచ్చి అది రాసి మళ్లీ రైటు సైడుకెళ్తారు.. ఇదీ ప్రాసెస్.. ఇండియన్ స్క్రీన్‌ప్లేలలో కొలతలు లేవు.. రైటరుకి, డైరెక్టరుకీ ఎంత క్లారిటీ కావాల్సొస్తే అంత రాసుకుంటారు..

కానీ హాలీవుడ్ స్క్రీన్‌ప్లేలలో అలా కాదు.. ఒక పేజీ ఒక నిముషం స్క్రీన్ టైము కింద లెక్క.. స్టూడియోలు మొత్తం సినిమా లెంగ్తు, తీయాల్సిన షూటింగ్ రోజులు, యాక్టర్ల కాల్షీట్లు, సీజీలు.. ఇలా అన్నీ ఎక్సెల్ షీట్లలో రాసుకుని డైరెక్టరు, ప్రొడ్యూసర్ల గొంతు నులిమి మరీ రాబట్టుకుంటాయి.. అదో లెక్క.. 

అందుకే హాలీవుడ్ స్క్రీన్‌ప్లేలో యాక్షను పార్టు మొత్తం ప్రిసైజుగా ఉంటుంది.. ఫార్మాటు విషయానికొస్తే యాక్షనంతా ఎడ్జి టు ఎడ్జి ఉండి, డైలాగు మాత్రం మధ్యలో సగానికి ఉంటుంది.. సెల్టెక్సు, స్టూడియోబైండరు, ఫైనల్ డ్రాఫ్టు, ఇంకా చాలా సాఫ్టువేర్లు ఉన్నాయి మార్కెట్లో.. అన్నిట్లోనూ సీను పేపరు ఫార్మాట్ ఒకటే..

ఇప్పుడు సాఫ్టువేర్లన్నీ మనకూ అందుబాటులో ఉండడంవల్ల కొత్తగా వొస్తున్న రైటర్లు, డైరెక్టర్లు వాటిని వాడడంలో అత్యుత్సాహం చూపిస్తున్నారు.. అయితే తెలుగు స్క్రిప్టుని డైరెక్టుగా అవి గుర్తించకపోవడంవల్ల యాక్షను మొత్తం ఇంగ్లీషులో రాసుకుని, డైలాగు టింగ్లీషులో రాయడం అలవాటైపోయింది..

మూడేళ్ల క్రితం ఒక కుర్రాడు నాకు రెండొందల ముఫ్ఫై పేజీల స్క్రిప్టు అలా పంపించాడు.. నాదికాని స్క్రిప్టు చదువుతున్న ఫీలింగు.. భయం వేసి పక్కన పడేశాను.. కానీ మొన్న ఒక ఓటీటీ వాళ్ళకి నేనో స్క్రిప్టు సరిగా అదే ఫార్మాటులో ఇవాల్సొచ్చింది.. వాళ్లకు తెలుగు చదవడం రాదని, సెల్టెక్సు ఫార్మాటులోనే వాళ్లంతా అర్ధం చేసుకుంటారని చెబితే..

జార్గన్ బహుశా ఇప్పుడు అందరం మాట్లాడుతూనే ఉన్నాం..

మనం చమత్కారంగా, ఒక్కోసారి వెటకారంగా వాడే "కట్ చేస్తే.." అనే మాటకి ఎంతో వాల్యూ ఉంది.. ఆ సీను ఎక్కడ కట్ చేసి తరవాతి సీను ఎలా ఓపెన్ చేస్తామనే విషయం ఎడిటరుకి, కెమెరామ్యానుకి విజువలైజేషనులో క్లారిటీ ఇస్తుంది.. కట్ చేయకుండా డిజాల్వ్, ఫేడిన్/ఫేడవుట్, ప్యాన్, రోల్.. ఇలా ట్రాన్సిషన్స్ కూడా వాడతారు.. సీను పేపర్లోనే ఇవి ఉండడం ఒక క్లారిటీ..

ఇవి కాక వాయిసోవరు / అవుట్‌బ్లాకు వాయిసు, క్రేను, ట్రాలీ, జూము, కెమెరా పాన్, విష్ పాను, టిల్ట్, డచ్చాంగిలు, ఫోర్తు వాలు, పీఓవీ, ఏరియల్/బర్డ్స్ ఐవ్యూ, బీట్, బీజీయెం, ప్రాప్స్, టాలెంటు.. ఇలా ఎన్నో.. దాదాపుగా అన్నీ ఇంగ్లీషులో వాడేస్తూండడం, హాలీవుడ్ స్క్రీన్‌ప్లేలు అందరికీ అందుబాటులో ఉండడం వల్ల జార్గన్ మొత్తం యూనివర్సల్ అయిందని చెప్పవచ్చు..
 
భగవద్గీతో లేక జస్ట్ ఒక రిఫరెన్స్ డాక్యుమెంటో పక్కన పెడితే, ఒకటి మాత్రం నిజం..

సీను పేపరనేది దర్శకుడికీ, మిగతా టీము మొత్తానికీ ప్రొడక్షన్ చేయడానికి అనువుగా, అందరికీ అర్ధమయే రీతిలో రాసుకునే ఒక కాగితం.. ఒక్కో దర్శకుడిదీ ఒక్కో శైలి.. రైటరు స్క్రీన్‌ప్లేలో ఏదైనా రాసుకోనీ, నేను తీసేది నా మైండులో క్లియర్‌గా ఉందని సీను పేపరు చూడకుండా షూటింగు చేసుకునే దర్శకులున్నారు, సీను పేపరులోనే షాట్ డివిజను చేసి టీము మొత్తాన్నీ కూర్చోబెట్టి చర్చించి ప్రతి ఫ్రేముకీ స్టోరీ బోర్డు చేయించి అప్పుడు షూటింగుకి వెళ్ళే దర్శకులూ ఉన్నారు..

సో, ఒక్కో దర్శకుడిదీ, స్క్రీన్ రైటరుదీ ఒక్కో టెంప్లేటు.. ఒక్కో ఫార్మాటు..