కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో రోడ్ల మరమ్మతులకు రూ.189 కోట్లు



కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో రోడ్ల మరమ్మతులకు రూ.189 కోట్లు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో రోడ్ల మరమ్మతులకు ఏపీ ప్రభుత్వం రూ.189 కోట్లు విడుదల చేసింది. గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో రోడ్లు దెబ్బ తిన్నాయి. దీంతో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన సర్కారు.. రోడ్ల తక్షణ పునరుద్ధరణకు రూ.189 కోట్ల నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం  కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 83 చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయని, వాటికి తక్షణ మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు గుర్తించారు.
దీనిపై రోడ్లు, భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ జాన్ మోషే మాట్లాడుతూ.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లపై పలు చోట్ల గుంతలు ఏర్పడ్డాయన్నారు.  ఆర్‌ అండ్‌ బీ శాఖ అప్రమత్తమై రవాణా సమస్యలన్నింటినీ సత్వరమే పరిష్కరించేలా చూస్తోందని వెల్లడించారు. ప్రస్తుతం కౌటవరం-నిడుమోలు, మంటాడ-లంకపల్లి, గన్నవరం-పుట్టగుంట, కందులపాడు-గంగినేని, యర్రుపాలెం, మచిలీపట్నం-కమ్మవారిచెరువు, ఎలప్రోలు-ఉయ్యూరు-లంకపల్లి రోడ్ల పునరాభివృద్ధి పనులు ప్రాధాన్యతా ప్రాతిపదికన ప్రారంభమయ్యాయి.
2023 మార్చి నాటికి అన్ని జిల్లాల్లో దెబ్బతిన్న రోడ్లను గుర్తించి మరమ్మతులు చేయాలని ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలోనే అధికారులు ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపడుతున్నారు. పది రోజుల కింద (అక్టోబర్ 7న) జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణీత గడువులోగా రోడ్లకు సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. అలాగే నగరాల్లో పరిశుభ్రత పాటించాలని, చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి, సుందరీకరణ పనులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు.