రోజుకు 19 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి




రోజుకు 19 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి

- జెన్ కో మూడో యూనిట్  జాతికి అంకితం చేసిన సీఎం జగన్
- కృష్ణపట్నం పోర్టులో ఫిషింగ్ జెట్టీ నిర్మాణానికి శంకుస్థాపన
-నేలటూరు బహిరంగ సభలో సీఎం జగన్

 ఏపీ జెన్ కో మూడో యూనిట్ 800 మెగావాట్లు ద్వారా ప్రతి రోజు 19 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని సీఎం జగన్ ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలం నేలటూరులోని ఏపీ జెన్ కో ప్రాంగంణంలో మూడో యూనిట్ ను సీఎం జగన్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ ప్లాంట్ తో అతి తక్కువ ఖర్చు, తక్కువ బొగ్గు వినియోగంతో విద్యుత్ ఉత్పత్తి చేయపట్టనున్నట్లు తెలిపారు. నిత్యం 19 మిలియన్ యూనిట్ల ఏపీ విదుత్ గ్రిడ్ కు అనుసంధానం అవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నేలటూరులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగిందన్నారు. విద్యుత్ ఉత్పత్తి అంశంలో నేడు మరో ముందడుగు పడిందని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన జెన్‌కో మూడో యూనిట్‌ 800 మెగావాట్ల ప్లాంటు జెన్ కో ఉత్పాదకతలో కీలకంగా నిలవనున్నట్లు పేర్కొన్నారు. అప్పట్లో ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2008 లో జెన్ కో విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. ఈ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌కు మన రాష్ట్ర తొలిదళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టుకున్నామని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వరంగంలో సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌పవర్‌ స్టేషన్‌ నిర్మాణానికి వైఎస్సార్‌ శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ లో అత్యధిక సామర్థ్యం కలిగిన మూడో యూనిట్ 800 మెగావాట్లు ఇవాళ పూర్తి సామర్థ్యంతో ప్రారంభించడం దేవుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.3,200 కోట్లు కేటాయించినట్లు వివరించారు. 3 సంవత్సరాల 4 నెలల కాలంలో ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర విద్యుత్‌ అవసరాల్లో దాదాపు 45 శాతం విద్యుత్ ఉత్పత్తిని ప్రభుత్వ రంగ విద్యుత్‌ సంస్థలే చేపడుతున్నట్లు సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రకటించారు. తక్కువ బొగ్గుతో ఎక్కువ విద్యుత్ వినియోగం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుందన్నారు. 

*12,787 కుటుంబాలకు ప్యాకేజీ అమలు*

భూములు ఇచ్చిన రైతులకు గత ప్రభుత్వం హడావిడిగా కేవలం 3,500 మందికి మాత్రమే ప్యాకేజీ అమలు చేసిందని సీఎం జగన్ విమర్శించారు. అప్పట్లో ఇచ్చిన రూ. 14,000 కూడా సరిగా ఇవ్వలేదని విమర్శించారు. కానీ నెల్లూరు జిల్లాలో భూములు ఇచ్చిన మొత్తం 12,787 కుటుంబాలకు ప్యాకేజీ అమల చేసినట్లు వివరించారు. దీంతో పాటు చంద్రబాబు హయాంలో ప్యాకేజీ ఇవ్వకుండా పెండింగ్ లో ఉన్న మొత్తాన్ని విడుదల చేస్తున్నామన్నారు. ఒకవైపు కృష్ణపట్నం పోర్టు, మరోవైపు థర్మల్‌ పవర్‌ ప్లాంటు ఈ రెండింటితో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ప్రభుత్వం అంకుఠిత దీక్షతో పనిచేసిందన్నారు. ఈ ప్రాజెక్టుల కోసం భూములిచ్చిన రైతులందరికీ కూడా నిండు మనస్సుతో శిరసు వంచి ప్రత్యేకంగా అభివాదం తెలియజేస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. భూములు ఇచ్చిన 326 రైతు కుటుంబాలకు ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చామని, రెండో దశలో మరో 150 కుటుంబాలకు ఉద్యోగాలిచ్చే ప్రక్రియను నవంబర్ లోపు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 

*కృష్ణ పట్నం పోర్టులో జెట్టీ నిర్మాణానికి శంకుస్థాపన*

కృష్ణ పట్నం పోర్టులో మత్స్యకారులకు ప్రయోజనం కల్పించే జెట్టీ నిర్మాణం కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ రూ. 25 కోట్లతో జెట్టీ నిర్మాణం కోసం సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. నూతన జెట్టీతో స్థానిక మత్స్య కారులకు ప్రయోజనం చేకూరనుందని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 16,337 మత్స్యకార, మత్స్యకారేతర కుటుంబాలకు రూ.36 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నట్లు తెలిపారు. సభలో వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఉప్పుకాలువ, వెంకటాచలం రోడ్డు నుంచి తిరుమలమ్మపాలెం హైలెవల్‌ బ్రిడ్జి కోసం రూ.12 కోట్ల నిధులను కేటాయించాలన సీఎం జగన్ కోరగా సీఎం జగన్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు నెల్లూరు నక్కలవాగు కృష్టపట్నం రోడ్డు నుంచి పోటంపాడు వయా బ్రహ్మదేవం వరకు మరో హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణం కోసం మరో రూ.10 కోట్లు సీఎం జగన్ కేటాయించారు.
స్థానిక ఎమ్మెల్యే విజ్ణప్తి మేరకు నెల్లూరు జిల్లాలో పెన్నానది పై ముదివర్తి, ముదివర్తిపాలెం మధ్య సబ్‌మెర్జబుల్‌ కాజ్‌వే నిర్మాణం కోసం రూ.93 కోట్లు సీఎం జగన్ కేటాయించారు. ఈ సబ్మెర్జబుల్ చెక్‌డ్యాం నిర్మాణం కోసం ఖర్చుతో సముద్రం నుంచి వచ్చే బ్యాక్‌ వాటర్‌ను ఆపగలుగుతామని, తద్వారా నాలుగు మండలాల నీటి సమస్యపరిష్కారం అవుతుందని సీఎం జగన్ వివరించారు. కానీ కేవలం రూ. 93 కోట్లను గత ప్రభుత్వాలు కేటాయించక పోవడంపై చంద్రబాబు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని సీఎం ప్రశ్నించారు.