రాష్ర్టంలో భూ సమస్యలకు శాశ్విత పరిష్కారం



రాష్ర్టంలో భూ సమస్యలకు శాశ్విత పరిష్కారం


*వందేళ్ల అనంతరం మొట్టమొదటిగా సమగ్ర భూ సర్వే*

*అమరావతిలో పేదల ఇళ్లకు గవర్నర్ ఆమోదం*

*2024 ఎన్నికలు పేదలు, దనవంతుల మధ్య యుద్ధం*

*22 (ఎ) భూముల డీ నోటిఫై సభలో సీఎం జగన్*

2024 ఎన్నికల కోసం వచ్చే 18 నెలల కాలాన్ని పేదలు, ధనవంతుల మధ్య యుద్ధంగా సీఎం జగన్ అభివర్ణించారు. ఈ యుద్ధం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి, ప్రజల సొమ్మును దోచుకునే ఓ వర్గం ధనికులకు మధ్య జరగనుందన్నారు. పేదల ప్రజల సంక్షేమంపై ఎల్లో మీడియా విషం చిమ్ముతోందని విమర్శించారు. దుష్టచతుష్టం రాష్ర్ట అభివృద్ధి సంక్షేమానికి అవరోధంలా మారిందన్నారు. 22 (ఎ) కింద నిషేధిత జాబితాలో ఉన్న భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి పట్టాలు అందించేందుకు ఎన్టీఆర్ జిల్లాలోని అవనిగడ్డలో గురువారం నాడు నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ 22 వేల మంది రైతులకు భూ హక్కు పత్రాలు అందించారు. మొత్తంగా 355 గ్రామాల్లో 22(ఏ) నిషేధిత జాబితాలో ఉన్న 18,889 సర్వే నంబర్లకు సంబంధించి మొత్తం 35,669 ఎకరాల భూమి సమస్యకు పరిష్కారం లభించినట్లు వివరించారు. దీంతో ఆయా భూములను సాగు చేస్తున్న 22,042 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చినట్లు వివరించారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ భూ సర్వే కోసం ఆధునిక టెక్నాలజీ కోర్స్‌(కంటిన్యూస్‌ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ సిస్టం) బేస్‌ సిస్టంను ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. 
భూ సమస్యలు లేని రాష్ర్టంగా ఏపీని తీర్చిదిద్దాలనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపడుతన్నట్లు సీఎం జగన్ తెలిపారు. వందేళ్ల తరువాత మొట్టమొదటి సారిగా రాష్ర్ట ప్రభుత్వం సమగ్ర భూ సర్వే నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. భూ సర్వేను పక్కాగా చేపట్టి రైతుల భూ వివాదాలకు శాశ్విత పరిష్కారంగా భూ సర్వే రికార్డులను డిజిటలైజేషన్ చేయనున్నట్లు పేర్కొన్నారు. దీని కోసం ఇప్పటికే 15 వేల సర్వేయర్లను రిక్రూట్ చేసినట్లు వివరించారు. సమగ్ర సర్వే కోసం కోట్ల రూపాయల ఖర్చుతో డ్రోన్లు, రోవర్లు, హెలీకాప్టర్లను సైతం వినియోగిస్తున్నట్లు వివరించారు. వంద సంవత్సరాలకు పూర్వం బ్రీటీష్ కాలంలో జరిగిన సర్వేకు మరలా పక్కాగా రీ సర్వే చేయించి, హద్దులను మళ్లీ పూర్తిగా మార్కు చేసి రికార్డులు అప్ గ్రేడ్ చేయనున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి మొత్తం సమగ్ర భూ సర్వే కార్యక్రమం పూర్తి చేస్తామని వివరించారు. భూ సమగ్ర సర్వేలో ఏపీ దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతన్నలకు భూ వివాదాలు లేని పక్కా రికార్డులు ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 

*మంచికి – మోసానికీ జరిగే యుద్ధం*

2024 ఎన్నికల్లో మంచికి మోసానికి యుద్ధం జరుగుతుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఇది పేదవాడికీ – పెత్తందారులకీ మధ్య జరుగుతున్న యుద్ధంగా పేర్కొన్నారు. దోచుకో దాచుకో ఎజెండాగా పనిచేస్తున్న దుష్ట చతుష్టయం సమాజాన్ని ముక్కలుగా చేసి లబ్ధి పొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఎన్నికలే లక్ష్యంగా ఫేక్ మేనిఫోస్టేలు ప్రకటించి మరిన్ని సమీకరణలతో దుష్ట చతుష్టయం ప్రజల్లోకి వస్తుందన్నారు. ఇలాంటి కుట్రలు ఈ యుద్ధంలో మరింత ఎక్కవగా కనిపిస్తాయని వివరించారు. ప్రజల మద్ధతు లేక విపక్షాలన్నీ కలిసి కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు.

*అమరావతిలోనూ పేదలకు ఇళ్లు*

అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించే చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం లభించినట్లు సీఎం జగన్ వివరించారు. దీంతో సీఆర్డీఏ, మృడా చట్ట సవరణలు అమల్లోకి రానున్నట్లు తెలిపారు. తాజా సవరణలతో అమరావతి పరిధిలో రాజధాని గ్రామాల పేదలకే కాకుండా ఇతర ప్రాంతాల్లోని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించే అవకాశం ఉంటుందని వివరించారు. అలాగే అమరావతి అభివృద్ధి కోసం క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సిఆర్‌డిఎ) చట్టం, 2014, మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీస్ (మృడా) చట్టం, 2016 సవరణలు చేయనున్నట్లు వివరించారు. MRUDA చట్ట సవరణతో రాజధాని మాస్టర్ ప్లాన్, మాస్టర్ ఇన్ ఫ్రాస్ర్టక్చర్ ప్రణాళికలు, రాజధానిలో జోనల్ ఏరియా డెవలప్ మెంట్ కోసం అవసరమైన మార్పులు చేయనున్నట్లు తెలిపారు.