విజ్ఞాన్స్‌లో ‘‘జిన్నా’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘జిన్నా’’ సినిమా యూనిట్‌ సందడి
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో సోమవారం సినీహీరో మంచు విష్ణు తన ‘‘జిన్నా’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో మంచు విష్ణుతో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్, స్క్రిప్ట్‌ రైటర్‌ కోనవెంకట్, కమెడియన్‌ చమ్మక్‌ చంద్ర కూడా పాల్గొన్నారు. అవ్రామ్‌ భక్త మంచు సమర్పణలో అవా ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై మంచు మోహన్‌బాబు ‘‘ జిన్నా ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్లుగా పాయల్‌ రాజ్‌పుత్, సన్నీలియోన్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో మంచు విష్ణు మాట్లాడుతూ ఈ నెల 21న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ జిన్నా సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. రంగంపేటలో జరిగిన కథ ఆధారంగా ఈ సినిమాను తీశామన్నారు. ఈ సినిమా తన మనసుకు బాగా దగ్గరైన సినిమానని తెలియజేసారు. ఈ సినిమాలో కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు. ఈ సినిమాలో తన పాత్ర ఇప్పటివరకు చేసిన పాత్రల కంటే వైవిధ్యభరితమైనదని తెలియజేసారు. క్రియేటివ్‌ ప్రొడ్యూసర్, స్క్రిప్ట్‌ రైటర్‌ కోనవెంకట్‌ మాట్లాడుతూ నేను ఇప్పటివరకు రైటర్‌గా పనిచేసిన సినిమాలన్నింటిలోకెల్లా ఉత్తమమైన సినిమాగా నిలుస్తుందన్నారు. ఢీ సినిమాతో గీతాంజలి సినిమా కలిపితే ఎలా ఉంటుందో ‘‘జిన్నా’’ సినిమా అలా ఉండబోతుందన్నారు. ఈ సినిమాకి ఇషాన్‌ సూర్య దర్శకత్వం వహించగా, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్, స్క్రిప్ట్‌ రైటర్‌గా కోనవెంకట్, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా అనూప్‌ రూబెన్స్‌ పనిచేశారని తెలిపారు. అనంతరం జిన్నా సినిమా హీరో మంచు విష్ణు విద్యార్థులతో సెల్ఫీలు దిగారు.