నేటి నుంచి విజ్ఞాన్స్‌లో అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌

నేటి నుంచి విజ్ఞాన్స్‌లో అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ 

  -ముఖ్య అతిథిగా నోబెల్‌ గ్రహీత డాక్టర్‌ సర్‌ రిచర్డ్‌ జే.రాబర్ట్స్‌ రాక

  - విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ప్రారంభమైన ప్రీ–కాన్ఫరెన్స్‌ ట్యుటోరియల్‌

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో నేటి నుంచి మూడు రోజుల పాటు అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ ఆదివారం తెలిపారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, స్కూల్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ సైన్సెస్‌ విభాగాల ఆధ్వరంలో ‘‘ ఫ్రాంటీర్స్‌ ఇన్‌ న్యూట్రిషన్, మెడికల్‌ జీనోమిక్స్‌ అండ్‌ డ్రగ్‌ డిస్కవరీ (ఇన్‌బిక్స్‌–22)’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు సంబంధించిన ప్రీ–కాన్ఫరెన్స్‌ ట్యుటోరియల్‌ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య ఉపన్యాసకులుగా నోబెల్‌ బహుమతి గ్రహీత డాక్టర్‌ సర్‌ రిచర్డ్‌ జే.రాబర్ట్స్‌ హాజరుకానున్నారని వెల్లడించారు. కాన్ఫరెన్స్‌కు ముఖ్య అతిథిగా బెంగళూరులోని ఐఐఎస్‌సీ మాజీ  డైరక్టర్, బైరాక్‌ చైర్మన్, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత ప్రొఫెసర్‌ జీ.పద్మనాభన్‌ హాజరవుతారని పేర్కొన్నారు. అంతేకాకుండా గౌరవ అతిథులుగా యూఎస్‌ఏ–కొలంబస్‌లోని ఓహియో స్టేట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డీ.పీ.ఎస్‌.వర్మ, హైదరాబాద్‌లోని సీడీఎఫ్‌డీ డైరక్టర్‌ డాక్టర్‌ కే.తంగరాజ్‌ వస్తున్నారని తెలియజేసారు. ఆదివారం ప్రారంభించిన ప్రీ–కాన్ఫరెన్స్‌ ట్యుటోరియల్‌లో అండర్‌స్టాండింగ్‌ ఆఫ్‌ నెక్ట్స్‌ జనరేషన్‌ సీక్వెన్సింగ్‌ అండ్‌ ఇట్స్‌ అప్లికేషన్స్‌ అనే అంశాన్ని అహ్మదాబాద్‌లోని యూనిపత్‌ ల్యాబ్స్‌కి చెందిన డాక్టర్‌ స్పందన్‌ చౌదరి తెలియజేసారు. మెషిన్‌ లెర్నింగ్‌ స్ట్రాటజీస్‌ ఫర్‌ బయోలాజిస్ట్స్‌ అనే అంశాన్ని పూణేలోని ఫ్లేమ్‌ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ జయరామన్‌ కే వలది వివరించారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.