వైఎస్సార్ సీపీ పాల‌న‌లో స‌త్తా చాటుతోన్న ఏపీఐఐసీ


వైఎస్సార్ సీపీ పాల‌న‌లో స‌త్తా చాటుతోన్న ఏపీఐఐసీ

- 2021–22 కాలంలో ఇంజనీరింగ్‌ పనులకు రూ.348.71 కోట్ల వ్యయం
- అదే ఏడాది రూ.656 కోట్ల స‌ముపార్జ‌న‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) వైఎస్సార్ సీపీ పాల‌న‌లో స‌త్తా చాటుతోంది. మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌, ఆదాయ ఆర్జ‌న‌లో మంచి ఫ‌లితాలు సాధిస్తోంది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఎప్పుడూ లేని విధంగా 2021–22 కాలంలో ఇంజనీరింగ్‌ పనుల కోసం రికార్డు స్థాయిలో రూ.348.71 కోట్లు వ్యయం చేసింది. అధికారిక గ‌ణాంకాల మేర‌కు.. 2014 నుంచి 2022 వరకు రూ.2,079 కోట్లు ఖర్చు చేస్తే అందులో టీడీపీ ఐదేళ్ల పాలనలో రూ.1,021 కోట్లు మాత్ర‌మే ఖర్చు చేసింది. మొత్తంగా వైఎస్సార్‌సీపీ సర్కారు మూడేళ్లలో రూ.1,058 కోట్లు ఖర్చు చేసింది. ఇదే సమయంలో మొత్తం 51 పారిశ్రామిక పార్కుల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేసింది. 

*రికార్డు స్థాయిలో ఆదాయ వృద్ధి..*
మౌలిక వసతుల కల్పనలోనే కాకుండా ఆదాయ ఆర్జనలో కూడా ఏపీఐఐసీ స‌త్తా చాటుతోంది. గడిచిన ఏడేళ్లుగా చూస్తే ఏపీఐఐసీ సగటు వార్షిక ఆదాయం రూ.590 కోట్లుగా ఉంటే 2021–22లో ఏకంగా రూ.656 కోట్లు స‌ముపార్జించింది. అద‌నంగా.. ఏపీఐఐసీ 501 ఎకరాల్లో రూ.750 కోట్లతో కడపలోని కొప్పర్తిలో వైఎస్సార్ ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్‌ను విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇటు 7,000 ఎకరాల్లో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్, 2,500 ఎకరాల్లో రూ.1,500 కోట్లతో నిర్మిస్తున్న క్రిస్ సిటీ కూడా ఏపీఐఐసీ ఆధ్వర్యంలోనే న‌డుస్తోంది. అంతేకాకుండా, ఏపీఐఐసీ గత ఎనిమిదేళ్లలో 1 లక్ష మందికి పైగా ఉపాధిని కల్పించింది.

రాష్ట్రానికి పెట్టుబడులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఏపీఐఐసీ ఈ ఘనత సాధించగలిగింది. గత కొన్నేళ్లుగా ఏపీ స‌ర్కార్ అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో ఇక్క‌డ కంపెనీల ఏర్పాటు కోసం ఒప్పందాలు చేసుకుంది. ఈ క్ర‌మంలోనే ఆయా కంపెనీల యూనిట్ల స్థాప‌న‌కు తగిన మౌలిక సదుపాయాలను నిర్మించడానికి ఏపీఐఐసీ విశేష‌ కృషి చేస్తోంది. ప్రస్తుతం కొప్పర్తి, తిరుపతి, పెద్దాపురం, విజయవాడ వంటి ప్రాంతాల్లో 20కి పైగా రెడీ టు బిల్డ్ ఫ్యాక్టరీలను నిర్మిస్తున్నారు.