ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌దే భవిష్యత్‌

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌దే భవిష్యత్‌

  విజయవాడలోని ఏపీసీపీడీసీఎల్‌ టెక్నికల్‌ డైరక్టర్‌ - - బీ.జయ భారత్‌ రావ్‌
విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో ఘనంగా ఆరంభమైన జాతీయస్థాయి సదస్సు

భవిష్యత్‌లో ప్రజలందరూ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌నే వినియోగిస్తారని విజయవాడలోని ఏపీసీపీడీసీఎల్‌ టెక్నికల్‌ డైరక్టర్‌ బీ.జయ భారత్‌ రావ్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఈఈఈ ఆధ్వర్యంలో ‘‘ ఎమర్జింగ్‌ ట్రెండ్స్‌ ఇన్‌ పవర్, ఎనర్జీ అండ్‌ కంట్రోల్‌ ( ఈటీపీఈసీ–22)’’ అనే అంశంపై రెండు రోజుల పాటు జరగనున్న ఐదవ జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌ను ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీసీపీడీసీఎల్‌ టెక్నికల్‌ డైరక్టర్‌ బీ.జయ భారత్‌ రావ్‌ మాట్లాడుతూ విద్యార్థులు వినూత్నంగా ఆలోచిస్తే.. విజయం దానంతట అదే సిద్ధిస్తుందన్నారు. విద్యార్థులకు అవగాహనతో కూడిన  విద్య అవసరమని, ధైర్యం ఉంటే ఏదైనా సాధించొచ్చని, విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని సడలనించవద్దని తెలిపారు. . విద్యుత్‌ రంగంలో రోజు రోజుకూ వినూత్న పద్ధతులు, సాంకేతిక అంశాలు చొచ్చుకువస్తున్నాయని వెల్లడించారు. ఆయా సాంకేతిక అంశాలపై విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. కరెంటును అధికంగా వినియోగించినట్లైతే భావితరాలు ఇబ్బందిపడాల్సి వస్తుందని అన్నారు. విద్యుత్‌ రంగంలో ఇప్పటికీ లోవోల్టేజి, కరెంటు వృథా, విద్యుత్‌ అంతరాయం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయని, ఇలాంటి సమస్యల పరిష్కారంపై ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు దృష్టి సారించాలని సూచించారు.

కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన గోవాలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సురేష్‌ మిక్కిలి మాట్లాడుతూ వివిధ రకాల పద్ధతులలో ఉత్పత్తి చేసిన కరెంటును మైక్రోగ్రిడ్‌ టెక్నాలజీ ద్వారా కంట్రోల్‌ చేయవచ్చునని వెల్లడించారు. ఈ టెక్నాలజీలో కంప్యూటర్‌ ప్రోగ్రామ్స్‌ ఉపయోగించి సెక్యూరిటీతో పాటు ఫాల్ట్‌ ఐడింటిఫికేషన్‌లను సులభంగా గుర్తించవచ్చునని విద్యార్థులకు తెలియజేసారు. విద్యార్థులు తమ పరిశోధనల ద్వారా విద్యుత్‌ రంగంలో గల సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని సూచించారు. ఈ కాన్ఫరెన్స్‌లో భాగంగా పవర్‌ సిస్టమ్‌ ప్రొటెక్షన్, పవర్‌ క్వాలిటీ, ప్రొటెక్షన్‌ అండ్‌ రిలియబిలిటీ కంట్రోలర్స్, ఎనర్జీ హార్వెస్టింగ్‌ కర్వర్షన్, పవర్‌ సిస్టమ్‌ ప్లానింగ్‌ కంట్రోల్, ఎనర్జీ స్టోరేజ్‌ డివైజెస్‌ అండ్‌ సిస్టమ్స్, డిస్ట్రిబూటెడ్‌ జెనెరేషన్, హైబ్రిడ్‌ వెహికల్స్, సోలార్‌ థర్మల్‌ టెక్నాలజీస్, ఇమేజ్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్, రిమోట్‌ సెన్సింగ్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, రెనీవబుల్‌ ఎనర్జీ సిస్టమ్స్‌ ఆపరేషన్‌ వంటి తదితర అంశాలపై ప్రముఖ సంస్థల ఆచార్యులు అవగాహన కల్పించారు. అనంతరం జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌కు సంబంధించిన పుస్తకాన్ని విడుదల చేశారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, వర్సిటీ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ డీన్‌ డాక్టర్‌ జీ.శ్రీనివాసరావు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.