సమయాన్ని పట్టించుకోవద్దు

సమయాన్ని పట్టించుకోవద్దు

  హైదరాబాద్‌లోని సీడీఎఫ్‌డీ డైరక్టర్‌ డాక్టర్‌ కే.తంగరాజ్‌
  ఉపాధి కల్పించాలి : యూఎస్‌ఏలోని జీనోమిక్స్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ సీఈవో డాక్టర్‌ రత్నగిరి పోలవరపు

  విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ముగిసిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌

పరిశోధన రంగంలో రాణించాలనుకునే విద్యార్థులు సమయాన్ని పట్టించుకోకూడదని హైదరాబాద్‌లోని సీడీఎఫ్‌డీ డైరక్టర్‌ డాక్టర్‌ కే.తంగరాజ్‌ బుధవారం అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, స్కూల్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ సైన్సెస్‌ విభాగాల ఆధ్వరంలో ‘‘ ఫ్రాంటీర్స్‌ ఇన్‌ న్యూట్రిషన్, మెడికల్‌ జీనోమిక్స్‌ అండ్‌ డ్రగ్‌ డిస్కవరీ (ఇన్‌బిక్స్‌–22)’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్‌లోని సీడీఎఫ్‌డీ డైరక్టర్‌ డాక్టర్‌ కే.తంగరాజ్‌ మాట్లాడుతూ పరిశోధన చేసే విద్యార్థులకు ఓపిక, సహనంతో పాటు కష్టపడేతత్వం ఉండాలన్నారు. అనంతరం పాపులేషన్‌ జీనోమిక్స్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అనే అంశంపై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. దేశంలో దాదాపు 4635 శాఖలు, తెగలు, జాతులకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారని తెలియజేసారు. ఒకే శాఖకు చెందిన కుటుంబాల్లోని రక్త సంబంధీకుల మధ్య వివాహాలు జరిగినట్లైతే పుట్టబోయే పిల్లలు జన్యుపరమైన లోపాలతో పుట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నారు.

ఉపాధి కల్పించాలి : యూఎస్‌ఏలోని జీనోమిక్స్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ సీఈవో డాక్టర్‌ రత్నగిరి పోలవరపు

కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన యూఎస్‌ఏలోని జీనోమిక్స్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ సీఈవో డాక్టర్‌ రత్నగిరి పోలవరపు మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్‌ తర్వాత విద్యార్థులు తప్పనిసరిగా పారిశ్రామికవేత్తలుగా మారి కనీసం 10 మందికి ఉపాధి కల్పించాలన్నారు. విద్యార్థులందరూ ట్రాన్స్‌లేషనల్‌ రీసెర్చ్‌ వైపు మొగ్గుచూపాలని పిలుపునిచ్చారు.


కార్యక్రమానికి మరో గౌరవ అతిథిగా హాజరైన అస్సాంలోని సీఎస్‌ఐఆర్‌ ఎన్‌ఈఐఎస్‌టీ డైరక్టర్‌ డాక్టర్‌ జీ.నరహరి శాస్త్రి మాట్లాడుతూ బయోఇన్ఫర్మాటిక్స్‌ చదువుతున్న విద్యార్థులు వారి సబ్జెక్టులతో పాటు గణితం, స్టాటిస్టిక్స్‌లలో కూడా  పట్టుసాధించాలన్నారు.  గణితం, స్టాటిస్టిక్స్‌ నేర్చుకోవడం వలన విద్యార్థులకు అదనపు ప్రయోజనాలు కలుగుతాయన్నారు. జైపూర్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ రాజస్థాన్‌ ప్రొఫెసర్‌ నిర్మల్‌ కుమార్‌ లోహియా మాట్లాడుతూ సంతానోత్పత్తి, గర్భనిరోధకాలపై అతను 60 సంవత్సరాల పాటు కొనసాగించిన పరిశోధనలను విద్యార్థులతో పంచుకున్నారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులందరినీ ఘనంగా సన్మానించారు. మూడు రోజుల అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో భాగంగా నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేసారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.