బ్రతుకు రంగస్థలం తోలుబొమ్మలాటనే నిత్య సత్యం


ఆధునిక ప్రపంచం ఆవహిస్తుంది
ఎన్నో దృశ్యాలు టీవీ చిత్రాల్లలే కదిలిపోతున్నాయి
ముగానోము పట్టినట్లు మది నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తుంది
కాలం పరుగుల పోటీలో తగ్గేదేలేదంటుంది...

టిక్ టిక్ లయలో రోబోలా యాంత్రిక నడకలు నడిచిచూపుతుంది
ఓమధురం ఓమాధుర్యం అప్పుడే కాచిన వేడినీటి సెగలా ఆవిరైపోతుంది
మంచు తుఫాను తాను దేనికి తీసిపొనంటూ కసితిరా వడలుతున్న తనువును పట్టిపట్టి గుచ్చుతుంది..

ఎక్కడో మమతలతో అల్లిన ప్రేమ దుప్పటి అక్కున చేర్చుకొని లాలిస్తుంది...
యదార్ధం దాపరికం రెండు దొంగాట ఆడుతున్నవి
తడిసిన మట్టి విలువ ఎవరికి తెలుసు
గుప్పెడు గింజలు అవినీతి చీడ పట్టి
రాలిపోతున్నాయి...

సిరిని తిని అరగదీసుకోలేక కుబేరులు ఆపసోపాలు పడుతున్నారు
కొందరు యవ్వన తుఫాన్లతో తమ గోయితామే తీసుకుంటున్నారు
 అదేంటో ఆకాశము సముద్రమైంది
 భూదేవి భారం పంచుకోవాలని  తలచినట్లుంది...

 కన్నీరు పన్నీరులా  కురుస్తుంది
 ఆపలేని పాపాలు శాపాలు పెడుతున్నాయి
వీరవనితలు  చావును  ముద్దాడుతున్నారు
 హృదయాలు ఇంకా గాలిపటంలా  ఎగురుతూనే ఉన్నవి...

 మంచి కోసం నిజం వెతుకుతుంది
 చట్టం న్యాయాన్ని ఊయలూపుతుంది
 మంచి చెడు చర్చించుకుంటూ ముసుగురూపాలను లెక్కిస్తున్నవి 
 స్మశానాలు విశాలమై ఊర్లు వల్లకాడులా కనిపిస్తున్నవి..

 వీధికోక్క  నాయకుల శిల్పాలు ఉలుకు  పలుకు లేక కాపలా కాస్తున్నాయి.
నచ్చినవాడిదే  మెచ్చిన రాజ్యమంటూ 
 ఎవరి దండోరా వారు వేసుకుంటున్నారు
 చూసిన వెన్నెల నవ్వుకుంటుంది...

 నాకెందుకంటూ  కమ్ముకున్న  దుఃఖపు మేఘాల చాటు తప్పుకుంది.
 ఉషోదయ కాంతికై  సూరీడు యధావిధిగా  సిద్ధపడుతున్నాడు
 పంచభూతాలు  తమ పని తాము చేసుకోని పోతున్నాయి..
 కాలపు పరుగు అలజడుల లోతులలో  మానవుడు కూరుకు పోతున్నాడు..

 విధాత రాత తప్పదని నిగూఢము 
 నిక్షిప్తమైనది..
 పగటి వెలుగు కన్నులకు ఇంపు
 మది వెలుగు మమతలు నింపు
 బ్రతుకు రంగస్థలం తోలుబొమ్మలాటనే నిత్య సత్యం!
 హెచ్చరికంటూ  ఓ మెరుపు మెరిసింది!

           _ అరుణ సందడి 🖋️