ఇంజినీరింగ్‌ విద్యార్థులు సూపర్‌ స్టార్స్‌

ఇంజినీరింగ్‌ విద్యార్థులు సూపర్‌ స్టార్స్‌
  _ ప్రముఖ యంగ్‌ సినీ దర్శకుడు అనిల్‌ రావిపూడి 


టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
నాలుగు సంవత్సరాలు కష్టపడి ఇంజినీరింగ్‌ పూర్తిచేసేటటు వంటి అందరు విద్యార్థులు నా దృష్టిలో సూపర్‌ స్టార్సేనని ప్రముఖ యంగ్‌ సినీ దర్శకుడు అనిల్‌ రావిపూడి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి పూర్వ విద్యార్థుల కలయికలో భాగంగా యూనివర్సిటీకు విచ్చేసిన యంగ్‌ డైరక్టర్‌ అనిల్‌ రావిపూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ, విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ స్థాయి మహోత్సవ్‌ కార్యక్రమంలో ఆరోజు నేను స్కిట్‌ డైరక్ట్‌ చేసి ఉండకపోతే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదన్నారు. అవకాశాలనేవి మన దగ్గరకు రావని... విద్యార్థులే వాటికి ఎదురెళ్లి తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి జీవితంలో నిర్ధిష్టమైన లక్ష్యం ఉండాలన్నారు. దాని సాధించేంతవరకు అవిశ్రాంతంగా కష్టపడాలన్నారు. వినూత్న ఆలోచనలకు కాసింత క్రియేటివిటీ, టెక్నాలజీను ఉపయోగించుకుంటే జీవితంలో విద్యార్థులు ముందుకు దూసుకెళ్లి పోవచ్చన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ లారా కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.