విజ్ఞాన్‌లో పల్లెవించిన సంక్రాంతి

విజ్ఞాన్‌లో పల్లెవించిన సంక్రాంతి

  సంక్రాంతి అంటే రైతుల పండుగ

_  విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్ చైర్మన్‌ లావు శ్రీకృష్ణ దేవరాయలు 

 _ విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో వైభవంగా సంక్రాంతి వేడుకలు

  _సంప్రదాయ వస్త్రాల్లో మెరిసిన విద్యార్థులు
సంక్రాంతి విశిష్టతను తెలిపే రంగురంగుల రంగవల్లులు, హరిదాసు సంకీర్తనలు, కోలాటాలతో తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో మంగళవారం సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్ చైర్మన్‌ లావు శ్రీకృష్ణ దేవరాయలు  విద్యార్థులతో మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే రైతుల పండుగని తెలిపారు. మన పండుగల్లోని విశిష్టతను, శాస్త్రీయతను విద్యార్థులు గుర్తించాలని సూచించారు. ఈ సమయంలో రైతు లోకం పంట చేతికొచ్చిన ఆనందంలో ఉంటుందని చెప్పారు. సంక్రాంతి పర్వదినాల్లో పల్లెటూళ్లు ఎంతో అందంగా, ఆహ్లాదంగా ఉంటాయని చెప్పారు. రకరకాల జానపద వినోద కళాకారులు, పగటివేషధారులు ఈ పండుగ సమయంలో పల్లెల్లో వినోదాన్ని పంచుతారని తెలిపారు. ఎడ్ల పందేలు, కోడి పందేలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు.. ఇలా సంక్రాంతి అంటేనే సరదాల పండుగ అని చెప్పారు. తమ విద్యాసంస్థల్లో ఏటా అన్ని పండుగలను వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. పిల్లలకు సంస్కృతి సంప్రదాయాలపై గౌరవం పెంచాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 

కళకళలాడిన యూనివర్సిటీ ప్రాంగణం

సంక్రాంతి సంబరాలతో విశ్వవిద్యాలయ ప్రాంగణం కొత్త కళను సంతరించుకుంది. విద్యార్థులు గోమాతను పూజించారు. పొంగళ్లు పొంగించారు. చిన్నారులకు భోగి పళ్లు పోశారు. చెరుకుగడలు అల్లారు. రంగురంగుల ముగ్గులు వేశారు. భోగిమంటలు వేశారు. సంక్రాంతి పాటలు పాడారు. సంక్రాంతి విశిష్టతను తెలిపేలా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమ నృత్యాలు ఆకట్టుకున్నాయి. బొమ్మల కొలువులు ఏర్పాటుచేశారు. హరిదాసు సంకీర్తనలు వినిపించాడు. పిండి వంటలు వండారు. డోలు, సన్నాయిలతో వినోద బృందం కనువిందు చేసింది. గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. రథం ముగ్గులు ఆకర్షించాయి. గాలిపటాలు, బెలూన్లు ఎగురవేశారు. ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం విద్యార్థులకు  నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతులతో పాటు సర్టిఫికెట్లను అందజేసారు. కార్యక్రమంలో విజ్ఞాన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పీ. నాగభూషణం, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.