అతిపెద్ద మహోత్సవానికి రంగం సిద్ధం

అతిపెద్ద మహోత్సవానికి రంగం సిద్ధం
 -  విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌
 ‘‘విజ్ఞాన్‌ మహోత్సవ్‌–2కే23’’ పోస్టర్లు ఆవిష్కరణ

  జాతీయస్థాయిలో పోటీలు
  ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు మెగా వేడుకలు
 పోటీలకు ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు
 మొత్తం 82 ఈవెంట్ల నిర్వహణ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో మరో అతిపెద్ద మహోత్సవానికి రంగం సిద్ధం చేశామని వర్సిటీ వైస్‌ చాన్సల్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ శనివారం తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శనివారం జాతీయస్థాయిలో నిర్వహించే యూత్‌ ఫెస్టివల్‌ ‘‘విజ్ఞాన్‌ మహోత్సవ్‌–2కే23’’ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ తమ యూనివర్సిటీ భారీ యువజనోత్సవాలకు వేదిక కాబోతోందన్నారు. విజ్ఞాన్‌ మహోత్సవ్‌లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల నుంచి 50వేల మంది విద్యార్థులు తరలివచ్చే అవకాశం ఉందని తెలిపారు. విజ్ఞాన్‌ మహోత్సవ్‌ పోటీల విజేతలకు భారీ స్థాయిలో నగదు బహుమతులను అందజేస్తామని తెలిపారు. విజ్ఞాన్‌ మహోత్సవాన్ని ఈ ఏడాది వినూత్నంగా నిర్వహించడంతో పాటు పారా అథ్లెటిక్స్‌ పోటీలను కూడా ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతిభను ప్రదర్శించుకునేందుకు సరైన వేదిక విజ్ఞాన్‌ మహోత్సవ్‌ అనే ఓ బ్రాండ్‌ ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యార్థి లోకంలో నెలకొని ఉన్నదని ఆయన వివరించారు.

82 ఈవెంట్ల నిర్వహణ
విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహోత్సవ్‌లో మొత్తం 82 ఈవెంట్లను నిర్వహించనున్నారు. తొలుత నిర్వహించే స్పోర్ట్స్‌ ఫీట్‌లో వాలీబాల్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, టేబుల్‌ టెన్నిస్, చెస్, అథ్లెటిక్స్, త్రోబాల్‌ తదితర క్రీడాంశాల్లో జాతీయస్థాయిలో విద్యార్థులకు పోటీలు ఉంటాయని చెప్పారు. వీటితోపాటు కల్చరల్స్, లిటెరరీ, ఫైన్‌ ఆర్ట్స్, ఫ్యాషన్, మ్యూజిక్, డాన్స్, స్పాట్‌లైట్, థియేటర్‌ ఆర్ట్స్‌ వంటి తదితర రంగాలను కలుపుకుని సాంకేతిక, సాంస్కృతికాంశాల్లో జాతీయస్థాయిలో పోటీలు ఉంటాయని వివరించారు. పారా అథ్లెటిక్స్‌ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్స్‌ నిర్వహిస్తున్నామని తెలియజేసారు. విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు, వారి సత్తాను పెంపొందించుకునేందుకు విజ్ఞాన్‌ మహోత్సవ్‌ ఓ చక్కని వేదిక అని తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థులంతా ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ సంస్థల చైర్మన్‌  డాక్టర్‌ లావు రత్తయ్య, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు పాల్గొన్నారు.