విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో జోహో అవగాహన ఒప్పందం

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో జోహో అవగాహన ఒప్పందం
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో తమిళనాడు రాష్ట్రంలో చెన్నై ప్రధాన కార్యాలయంగా పనిచేసే గ్లోబల్‌ టెక్నాలజీ కంపెనీ జోహో కార్పోరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సోమవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జోహో కార్పోరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రోడక్ట్‌ మార్కెటింగ్‌ లీడ్‌ ఎస్‌.మీర, టీమ్‌ లీడ్‌ కే.మణికందరాజ్‌లతో వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం వలన జోహో కార్పోరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారు సరికొత్తగా రూపొందించిన ‘‘జోహో యంగ్‌ క్రియేటర్‌’’ ప్రోగ్రామ్‌లో రిజిస్టరైన విద్యార్థులకు ఆన్‌లైన్‌తో పాటు ఫిజికల్‌ ట్రైనింగ్‌ని కూడా అందించి యాప్స్‌ను అభివృద్ధి చేయడంలో సహాయపడతారన్నారు. అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్‌లో రిజిస్టర్‌ అయిన విద్యార్థులకు ఉచితంగా స్టూడెంట్‌ ఎడిషన్‌ లైసెన్స్‌ను ఇవ్వడంతో పాటు ట్రైనింగ్‌ మెటీరియల్‌ను కూడా అందజేస్తుందన్నారు. యంగ్‌ క్రియేటర్‌ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లతో పాటు అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారికి నగదు బహుమతులను కూడా అందజేస్తారని పేర్కొన్నారు. వీటితో పాటు అకడమిక్, పరిశోధన, ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్స్‌ను అభివృద్ధి చేస్తారని వెల్లడించారు. విద్యార్థులకు, అధ్యాపకులకు ఉపయోగపడే విధంగా పరస్పర అవగాహనతో యూనివర్సిటీలోకానీ, వర్చువల్‌గా కానీ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారని తెలియజేసారు. ఈ సందర్భంగా జోహో కార్పోరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రోడక్ట్‌ మార్కెటింగ్‌ లీడ్‌ ఎస్‌.మీర మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థులు ఇండస్ట్రీ లేదా వృత్తితో సంబంధం లేకుండా డిజిటల్‌ ప్రపంచంలో వస్తున్న సాంకేతికతను స్వీకరించాలన్నారు. యంగ్‌ క్రియేటర్‌ ప్రోగ్రామ్‌ ద్వారా జోహో టీమ్‌ నిపుణులు సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించే నైపుణ్యాలను విద్యార్థులకు అందించి భవిష్యత్తు నాయకులుగా వారిని శక్తివంతం చేయడమే మా లక్ష్యమని తెలియజేసారు. విద్యార్థులకు నైపుణ్యాలను పెంచే ప్రయత్నంలో విజ్ఞాన్స్‌ విశ్వవిద్యాలయంతో భాగస్వామి అయినందుకు మేము సంతోషిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు పాల్గొన్నారు.