చందూస్‌ సిల్వర్‌ కప్‌ క్రికెట్‌ చాంఫియన్స్‌గా ‘విజ్ఞాన్‌

చందూస్‌ సిల్వర్‌ కప్‌ క్రికెట్‌ చాంఫియన్స్‌గా ‘విజ్ఞాన్‌
  రన్నర్స్‌గా ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల (భీమవరం)

గుంటూరులోని జేకేసీ కళాశాల ఆధ్వర్యంలో అధ్యాపకుల కోసం నిర్వహించిన 26వ చందూస్‌ సిల్వర్‌ కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేతగా విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ నిలిచింది. స్థానిక జేకేసీ కళాశాలలోని క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ జట్టు భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల జట్టు మీద 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫైనల్‌ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌కేఆర్‌ బ్యాట్స్‌మెన్‌ శ్రీహరి వర్మ మంతెన (41) పరుగులతో రాణించగా విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ బౌలర్లలో మాదినేని లోకేష్, పీ.కిషోర్‌ ఇద్దరూ రెండేసి వికెట్లు తీసి తక్కువ పరుగులకే కట్టడి చేసారు. అనంతరం 120 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ కేవలం 15.2 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 123 పరుగులు సాధించి 5 వికెట్లతో విజయదుందుభి మోగించింది. విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ బ్యాట్స్‌మెన్‌లలో ఎస్‌. వినోత్‌ (37), టీ.చందు (34), రవికిషోర్‌ రెడ్డి (25) పరుగులు సాధించి విజయంలో కీలకపాత్ర పోషించారు. ఎస్‌ఆర్‌కేఆర్‌ బౌలర్లలో కేఎస్‌ఎన్‌ రాజు 2 వికెట్లతో రాణించారు. టోర్నీలో బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌తో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌గా మాదినేని లోకేష్‌ (విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ), టోర్నీలో బెస్ట్‌ బౌలర్‌గా కెప్టెన్‌ శ్రీకాంత్‌ నల్లపనేని ( విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ) నిలిచారు. విజేతల బహుమతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ, నాగార్జున ఎడ్యుకేషన్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ రాయపాటి శ్రీనివాస్, జేకేసీ కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ జాగర్లమూడి మురళీమోహన్‌  చేతుల మీదుగా విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ టీమ్‌ కెప్టెన్‌ నల్లపనేని శ్రీకాంత్‌ ట్రోఫీను సగౌరవంగా అందుకున్నారు. చందూస్‌ సిల్వర్‌ కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేతలుగా నిలిచిన క్రికెట్‌ టీమ్‌ సభ్యులను విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.