కళాతపస్వి కే.విశ్వనాథ్‌కు విజ్ఞాన్స్‌లో ఘన నివాళి

కళాతపస్వి కే.విశ్వనాథ్‌కు విజ్ఞాన్స్‌లో ఘన నివాళి
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ యాజమాన్యం, విద్యార్థులందరూ కలిసి ప్రముఖ సినీదర్శకుడు, కళాతపస్వి కే.విశ్వనాథ్‌కు శుక్రవారం ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు తన సినిమాల ద్వారా గొప్ప గుర్తింపు తీసుకురావడంలో విశ్వనాథ్‌ గారు చాలా కృషి చేశారన్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు సినీ సాహిత్యానికి, సంప్రదాయ సంగీతానికి, కళలకు, చిత్రసీమకు ఎనలేని ప్రతిష్టను తెచ్చాయని పేర్కొన్నారు. సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకుని విశ్వనాథ్‌ చేసిన సినిమాలు గొప్ప మార్పునకు దారితీశాయన్నారు. కళా రంగంతో పాటు సాహిత్యంలో ఎన్నో ఘనతలు సాధించిన కళాతపస్వి కే.విశ్వనాథ్‌గారికి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్‌ అందించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. స్టూడియోలో సౌండ్‌ రికార్డిస్ట్‌గా సినీ జీవితాన్ని ప్రారంభించి... సిని రంగంలో అత్యున్నత అవార్డు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు సాధించేదాకా ఎదిగిన ఆయన ప్రస్థానం నేటి విద్యార్థులకు ఆదర్శప్రాయమన్నారు. ఒక శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరమువ్వ వంటి సినిమాలతో తెలుగు ఆత్మగౌరవాన్ని జాతీయస్థాయిలో రెపరెపలాడించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కే.విశ్వనాథ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.