విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ‘‘వర్టెక్స్‌

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ‘‘వర్టెక్స్‌’’
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఙాన్స్‌ యూనివర్సిటీలో ‘‘విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌’’ కార్యకలాపాలు ప్రారంభించి ఒక సంవత్సరం పూరైన సందర్భంగా ‘‘వర్టెక్స్‌’’ (విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌ రీక్రియేషనల్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్మేషనల్‌ ఎక్సీపీరియన్స్‌’’ అనే కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌ ద్వారా బీబీఏ(జనరల్‌), ఎంబీఏ (హెచ్‌ఆర్‌), ఎంబీఏ (ఫైనాన్స్‌), ఎంబీఏ(జనరల్‌), బీసీఏ, ఎంసీఏ విభాగాలలో అడ్మిషన్‌ పొందిన విద్యార్థులందరూ ఈ కార్యక్రమం ద్వారా ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం వీవోఎక్స్‌ ( విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌ ఎక్స్‌పీరియన్స్‌) అనే ప్లాట్‌ఫామ్‌ను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అరవింద్ వారియర్ People, Strategy, Culture and Happiness at Litmus7  Head మాట్లాడుతూ వీవోఎక్స్‌ వలన విద్యార్థులకు ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్‌లతో పాటు ప్రముఖ విద్యావేత్తల నుంచి గైడెన్స్‌తో కూడిన మెంటర్‌షిప్‌ పొందే అవకాశం ఉందన్నారు. దీని వలన విద్యార్థులు పరిపూర్ణమైన అభివృద్ధి సాధించడంతో పాటు వారితో సంభాషించడం, వారి విజయ ప్రయాణం గురించి తెలుసుకోవడానికి అవకాశం లభిస్తుందన్నారు. విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ 21వ శతాబ్ధంలో విద్యార్థులు ఉపాధ్యాయులపైనో, కళాశాలల్లో ఉండే అధ్యాపకులపైనో ఆధారపడకూడదన్నారు. ఎవరైతే స్వయం శిక్షణ( సెల్ఫ్‌ లెర్నింగ్‌) చేస్తారో వాళ్లకే నిజమైన భవిష్యత్తు ఉంటుందన్నారు. నేటి డిజిటల్‌ యుగంలో ఈ రోజు ఉన్నవి రేపటి రోజున ఉంటాయో లేదో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. క్షణ క్షణం విషయం మారిపోవటం, కొత్త ఆవిష్కరణలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిదానికి కళాశాలకు వెళ్లి నేర్చుకుంటామంటే కుదిరే పనికాదన్నారు. ఎప్పటికప్పుడు విద్యార్థులు అంతర్జాలంలోకి వెళ్లి  నేర్చుకునేందుకు అలవాటుపడాలన్నారు.

విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌ సీఈవో నందిగం శ్రీకాంత్‌ మాట్లాడుతూ విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌ ద్వారా అడ్మిషన్‌ పొంది ఈ–లెర్నింగ్‌లో కోర్సును అభ్యసిస్తున్న విద్యార్థులందరిని వర్టెక్స్‌ కార్యక్రమం ద్వారా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కేవలం ఒక్క సంవత్సరం కాల వ్యవధిలో విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌ ద్వారా భారీ సంఖ్యలో విద్యార్థులు నమోదు చేసుకునేందుకు కృషి చేసిన అధ్యాపక బృందాన్ని అభినందించారు. న్యూఢిల్లీలోని యూజీసీ ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ డిగ్రీలను ఆఫ్‌లైన్‌ డిగ్రీలతో సమానంగా గుర్తించిందని విద్యార్థులకు తెలియజేసారు. కాబట్టి భవిష్యత్‌ అవసరాలు, మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఎప్పటికప్పడు టెక్నాలజీలను అప్‌డేట్‌ చేసుకోవాలని తెలిపారు.

కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌ సీఈవో నందిగం శ్రీకాంత్, సీడీఓఈ డైరక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.వీరాంజనేయులు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విజ్ఞాన్‌ ఆన్‌లైన్‌ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.