207 మంది విజ్ఞాన్స్‌ లారా విద్యార్థుకు ఉద్యోగాలు

207 మంది విజ్ఞాన్స్‌ లారా విద్యార్థుకు ఉద్యోగాలు
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలోని∙నాలుగో సంవత్సరానికి చెందిన 207 మంది విద్యార్థులు ప్రముఖ బహుళజాతి కోర్‌ కంపెనీలైన రామ్‌టెక్, ఇసూజు, మౌల్డ్‌ టెక్, మైల్‌ కాల్, సున్వి ఇంజినీరింగ్, ఎఫ్ఫాట్రానిక్స్, ఎక్సెల్‌టెక్‌ వంటి కంపెనీలకు ఎంపికయ్యారని విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ ఫణీంద్రకుమార్‌ మాట్లాడుతూ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల్లో ఇప్పటికే 75 శాతంకి పైగా విద్యార్థులు ఒకటికి మించి ఉద్యోగ అవకాశాలు సాధించారని తెలియజేసారు. ప్రస్తుతం ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులు గరిష్టంగా రూ.5.3 లక్షల వార్షిక వేతనం అందుకోనున్నారని వెల్లడించారు. ఎంపికైన విద్యార్థులలో సీఎస్‌ఈ విభాగం నుంచి 25 మంది, ఈసీఈ విభాగం నుంచి 34 మంది, ఐటీ విభాగం నుంచి 6 మంది, ఈఈఈ విభాగం నుంచి 64, మెకానికల్‌ విభాగం నుంచి 49 మంది, సివిల్‌ విభాగం నుంచి 12 మంది, ఎంసీఏ విభాగం నుంచి 17 మంది ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. ఐటీ రంగంలో మాంద్యం ముంచుకొస్తున్న తరుణంలో ప్రస్తుతం ఐటీ కంపెనీలు ఉద్యోగ నియామకాలు చేపట్టే పరిస్థితులు లేవన్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా తమ కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రాంగణ ఎంపికల్లో సత్తాచాటారని పేర్కొన్నారు. తమ విద్యార్థులకు కోర్‌ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించే విధంగా శిక్షణ ఇవ్వటం వలనే సాధ్యమయ్యిందన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రముఖ బహుళజాతి కోర్‌ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్ర కుమార్, ఉపాధి కల్పనాధికారులు, ఆయా విభాగాల అధిపతులు పాల్గొని అభినందించారు.