విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో వైభవంగా ‘కైజెన్‌–2కే23

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో వైభవంగా ‘కైజెన్‌–2కే23

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో జాతీయ స్థాయి మేనేజ్‌మెంట్‌ మీట్‌ ‘‘ కైజెన్‌–2కే23’ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కైజెన్‌( కీ టు ఆంబీషియస్‌ అండ్‌ ఇంటెలెక్చుయల్‌ జోన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ నోవల్టీ)ను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ విద్యార్థులందరూ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగాలన్నారు. ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగగలిగితే పది మందికి ఉపాధి కల్పించే అవకాశం లభిస్తుందన్నారు. అందుకని ప్రతి విద్యార్థి ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. విద్యార్థులందరూ ఎప్పుడూ ఒకే విధంగా మూసధోరణిలో పనులు చేసుకుంటూ వెళితే  కొన్నాళ్లకే బోరు కొట్టేస్తుందన్నారు. మీ పరిధిని దాటి సులువైన పద్ధతుల కోసం ఆలోచనలు చేయాలన్నారు. చేసే పనులను కాస్త కొత్తగా, సృజనాత్మకంగా చేయడానికి ప్రయత్నిస్తే విజయం మీ సొంతమవుతుందని పేర్కొన్నారు. సాధించాల్సిన లక్ష్యాల గురించి వివిధ రకాలుగా ఆలోచించి తగిన ప్రణాళికలు వేసుకోవాలన్నారు. మీ ఆలోచనలు, ఐడియాలు, అభివృద్ధి ఎప్పుడూ ఊహలకే పరిమితం చేయరాదన్నారు. మీ ఆలోచనల రథానికి సారథి మీరే కాబట్టి మీ నాయకత్వంలోనే అవన్నీ నిజమయ్యేలా అన్ని రకాలుగా ప్రయత్నించాలన్నారు. కైజెన్‌–2కే23ను పురస్కరించుకుని నిర్వహించిన పలు పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులకు బహుమతులను అందజేసారు. కార్యక్రమంలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగం డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.