అమ్మాయిగా పుట్టడం శాపం కాదు

అమ్మాయిగా పుట్టడం శాపం కాదు
 - సినీ నటి, రచయిత్రి డా. శ్రీజ సాదినేని

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఆడపిల్లగా పుట్టడం శాపం కాదని, ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగి చూపించే అదృష్టం స్త్రీ మూర్తులకు మాత్రమే ఉందని ప్రముఖ సినీ, టీవీ నటి, రచయిత్రి డా శ్రీజ సాదినేని తెలిపారు.  
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  ఒకేరోజు వేరు వేరు ప్రదేశాలలో రెండు అవార్డులు అందుకున్నారు డా.శ్రీజ సాదినేని. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అమ్మాయిల భద్రత అస్తవ్యస్తంగా తయారవుతున్న ఈ రోజుల్లో అమ్మాయిలకు అన్ని విషయాలపై అవగాహన కల్పిస్తూ, ధైర్యం పెంపొందించడం ఇంటి నుండే ప్రారంభం కావాలని, మగపిల్లలతో సమానంగా ఆడపిల్లల్ని కూడా పెంచడం మాత్రమే కాదు, సమాజంలో ఈరోజు జరుగుతున్న అన్యాయాలు, మోసాలు, అత్యాచారాలు, దుర్మార్గాలు తెలియజేస్తూ వాటిని ఎదుర్కునే ధైర్యమే కాక వాటి బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కూడా చిన్నతనం నుండే ఇంట్లో వాళ్ళు, టీచర్లు అవగాహన కల్పిస్తూ పెంచాలని తెలిపారు. 
మహిళలు ఈరోజు ఇంటి పనులు, వంట పనులు చక్క దిద్దుకుంటూ, అన్ని రంగాలలో అగ్ర స్థానాలను కైవసం చేసుకోవడమే కాక మరోతరాన్ని అందించే ప్రాణ ప్రతిష్ట కూడా చేయగలరని, ఇలా పురుషులకు సాధ్యం కాని ఎంతో గొప్ప అదృష్టం స్త్రీ మూర్తికి మాత్రమే దక్కిన అరుదైన వరం అని డా.శ్రీజ మహిళా లోకాన్ని కొనియాడారు.
తన చిన్నతనం నుండే నాన్నగారు కళారంగం లో ప్రవేశం కల్పించి ప్రావీణ్యం పెంపొందేలా చేయడమే కాకుండా సమాజంలో దూసుకు వెళ్లే ధైర్యం, జాగ్రత్తగా మసలుకునే మెళకువలు కూడా నేర్పడం వల్లనే ఈరోజు సినీ,టీవీ,రంగస్థల రంగాలలో నటిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా, వ్యాఖ్యాత్రిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, యాక్టింగ్ ఫ్యాకల్టీగా,
యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకురాలుగా ఎన్నో శిఖరాలను అధిరోహించ గలిగానని, ప్రతి ఒక్కరూ తమ అమ్మాయిలకు అలాంటి ఆత్మ విశ్వాసాన్ని పెంపొందేలా పెంచాలని ఆమె పిలుపునిచ్చారు. 
తన ప్రతిభను గుర్తించి మరికొందరికి తెలిసేలా ఈ అవార్డులను అందించి, గౌరవ సత్కారాలను అందించిన హుస్సేన్ గారికి, చేతన బ్రాడ్ కాస్టింగ్ సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని డా శ్రీజ సాదినేనికి పలువురు సినీ, రాజకీయ, రంగస్థల ప్రముఖులు అభినందనలు, శుభాకాంక్షలు అందించారు.