విజ్ఞాన్స్‌లో గిన్నిస్‌ వరల్డ్స్‌ రికార్డ్‌ క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌

విజ్ఞాన్స్‌లో గిన్నిస్‌ వరల్డ్స్‌ రికార్డ్‌ క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ, గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్, సీపీవోఐల (కలెక్టివ్‌ పవర్‌ ఆఫ్‌ వన్‌ ఇంటర్నేషనల్, యూఎస్‌ఏ) సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన లార్జెస్ట్‌ సెర్వికల్‌ ( గర్భాశయ ) క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌కు గిన్నిస్‌ వరల్డ్స్‌ రికార్డ్‌  లభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గిన్నిస్‌ వరల్డ్స్‌ రికార్డ్‌ తరుపున జడ్జిగా హాజరైన స్వప్నిల్‌ డంగారికర్‌ మాట్లాడుతూ దాదాపు 3465 మందికి పైగా మహిళలకు ఒకేసారి సెర్వికల్‌ క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహించడం ఇదే తొలిసారి కావడం వలన గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు నమోదైందని పేర్కొన్నారు. ఇదివరకు ఉన్న 1919 మహిళలకు అవగాహన కల్పించిన రికార్డును నేటితో బద్ధలు అయ్యిందని వెల్లడించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌ రోబోటిక్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ డైరక్టర్‌ డాక్టర్‌ చిన్నబాబు సుంకవల్లి, యూఎస్‌ఏ– టెక్సాస్‌లోని సీపీవోఐ ఫౌండర్, సీఈవో డాక్టర్‌ సత్య ఎస్‌.కలంగి, యూఎస్‌ఏ– టెక్సాస్‌లోని సీపీవోఐ బోర్డ్‌ మెంబర్‌ డాక్టర్‌ డేల్‌ క్లైమీ, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ వెంకట సుజాత  వెల్లంకి, విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరయ్యారు. 

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌ రోబోటిక్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ డైరక్టర్‌ డాక్టర్‌ చిన్నబాబు సుంకవల్లి మాట్లాడుతూ గర్భాశయ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ ప్రాణాలను కాపాడుతుందని రుజువు ఉన్నప్పటికీ, అవగాహన లోపం కారణంగా ప్రజలు చురుకుగా పాల్గొనడం లేదన్నారు. గర్భాశయ క్యాన్సర్‌తో ప్రతి సంవత్సరం దాదాపు 71,000 మంది భారతీయ స్త్రీలు చనిపోతున్నారని వెల్లడించారు. విస్తృతమైన స్క్రీనింగ్‌ అమలు చేయకపోతే ఈ సంఖ్య మిలియన్లకు చేరుకుంటుందని హెచ్చరించారు. మామోగ్రఫీ, ఓరల్‌ ఎగ్జామినేషన్, ఛాతీ ఎక్స్‌–రే మరియు పాప్‌ స్మెర్మ్‌ వంటి సాధారణ స్క్రీనింగ్‌ పద్ధతులు ముందస్తుగా గుర్తించి, నయం చేయడంలో సహాయపడుతాయన్నారు. గర్భాశయ క్యాన్సర్‌ కొత్త కేసులలో సగానికి పైగా ఎప్పుడూ లేదా అరుదుగా మాత్రమే పరీక్షించబడని మహిళల్లో సంభవించాయన్నారు. పేదలు, దిగువ మధ్య తరగతి ఉన్న ఆదాయ దేశాలలో గర్భాశయ క్యాన్సర్‌ కారణంగా పది మరణాలలో తొమ్మిది మరణాలు సంభవిస్తున్నాయన్నారు. అదే అధిక–ఆదాయ దేశాలలో బాలికలకు హ్యూమన్‌ పాపిల్లోమావైరస్‌ (హెచ్‌పీవీ) వ్యతిరేకంగా టీకాలు వేయడంతో పాటు స్త్రీలు క్రమం తప్పకుండా పరీక్షించబడతారు. ఏదైనా ముందస్తు క్యాన్సర్‌ గాయాలకు ముందుగానే చికిత్స చేస్తారు. ఫలితంగా 90% వరకు గర్భాశయ క్యాన్సర్లను నివారించడం సాధ్యమవుతుందన్నారు. కాబట్టి మహిళలు, విద్యార్థులు సెర్వికల్‌ క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవడం చాలా కీలకమని పేర్కొన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ వెంకట సుజాత వెల్లంకి మాట్లాడుతూ ప్రపంచంలో సెర్వికల్‌ క్యాన్సర్‌ సమస్యతో  ప్రతి రెండు నిమిషాలకు ఒక మహిళ, మన దేశంలో అయితే ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ మృతి చెందుతున్నారని వెల్లడించారు. దాదాపు 40 దేశాలలో మహిళలలు మృతి చెందుతున్న  ప్రధాన కారణాలలో సెర్వికల్‌ క్యాన్సర్‌ ఒకటిగా నిలుస్తుందన్నారు. సెర్వికల్‌ క్యాన్సర్‌ను సరైన సమయంలో ఎలా గుర్తించాలి అనే అంశాలపై విద్యార్థులకు కూలంకషంగా వివరించారు.  సెక్స్‌ తర్వాత అసాధారణ రక్తస్రావం, మూత్రవిసర్జన సమయంలో నొప్పి, బరువు తగ్గడం, అబ్‌డామినల్‌ పెయిన్, వెన్నునొప్పి, డిజ్జినెస్, లెగ్‌ స్వెల్లింగ్, బ్లడీ స్టూల్స్‌ వంటి లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే వెళ్లి సెర్వికల్‌ క్యాన్సర్‌ పరీక్షలను చేయించుకోవాలన్నారు. బహుళ లైంగిక భాగస్వాములను కలిగి ఉండటం, ధూమపానం, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, జనన నియంత్రణ మాత్రలు వాడకపోవడం, ఇతర లైంగికంగా సంక్రమించే వ్యాధులు సెర్వికల్‌ క్యాన్సర్‌కు దారితీస్తాయన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యూఎస్‌ఏ– టెక్సాస్‌లోని సీపీవోఐ ఫౌండర్, సీఈవో డాక్టర్‌ సత్య ఎస్‌.కలంగి మాట్లాడుతూ గర్భాశయ క్యాన్సర్‌ నెమ్మదిగా పెరుగుతుంది కాబట్టి... ఇది ఒక ముఖ్యమైన ముప్పుగా మారకముందే దీనిని సాధారణంగా గుర్తించి చికిత్స చేయవచ్చన్నారు. పాప్‌ స్మియర్‌ పరీక్షల వంటి మెరుగైన స్క్రీనింగ్‌ పద్ధతుల ద్వారా క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించగలమన్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ 35 నుంచి 44 మధ్య వయస్సు గల మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుందన్నారు. అయినప్పటికీ, 15% కంటే ఎక్కువ కొత్త కేసుల్లో 65 ఏళ్లు పైబడిన మహిళలు కూడా  ఉన్నారన్నారు. ముఖ్యంగా రెగ్యులర్‌ చెకప్‌లు పొందని వారు. క్యాన్సర్‌కు గురయ్యే ముందు కణాలను గుర్తించి వాటికి చికిత్స చేయడం అవసరమన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ లార్జెస్ట్‌ సెర్వికల్‌ ( గర్భాశయ ) క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌ను విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో నిర్వహించి గిన్నిస్‌ వరల్డ్స్‌ రికార్డ్‌ను పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ సెర్వికల్‌ క్యాన్సర్‌ గురించి మహిళలందరికి అవగాహన ఉండాలన్నారు. నేటి కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, మహిళలు అందరూ సెర్వికల్‌ క్యాన్సర్‌ గురించి పూర్తిగా తెలుసుకుని మీ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు సెర్వికల్‌ క్యాన్సర్‌ గురించి అవగాహన కల్పించాలన్నారు. 

అనంతరం గిన్నిస్‌ వరల్డ్స్‌ రికార్డ్‌ తరుపున జడ్జిగా హాజరైన స్వప్నిల్‌ డంగారికర్‌ గిన్నిస్‌ వరల్డ్స్‌ రికార్డుకు సంబంధించిన ధృవపత్రాన్ని విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌ రోబోటిక్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ డైరక్టర్‌ డాక్టర్‌ చిన్నబాబు సుంకవల్లి, యూఎస్‌ఏ– టెక్సాస్‌లోని సీపీవోఐ ఫౌండర్, సీఈవో డాక్టర్‌ సత్య ఎస్‌.కలంగిలకు అందజేసారు.