నీటిని కాపాడుకుంటేనే భవిష్యత్‌

నీటిని కాపాడుకుంటేనే భవిష్యత్‌

 - హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌ ( ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ)  చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ఎస్‌.శ్రీధర్‌
- విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా వరల్డ్‌ వాటర్‌ డే

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
కంటికి కనిపించని భూగర్భ జలాన్ని పది కాలాలపాటు కాపాడుకుంటేనే మానవ జాతికి భవిష్యత్‌ ఉంటుందని హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌ ( ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ)  చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ఎస్‌.శ్రీధర్‌  పేర్కొన్నారు.  చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ ఫోరమ్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ, స్కూల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ డిపార్ట్‌మెంట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం వరల్డ్‌ వాటర్‌ డేను పురస్కరించుకుని ‘‘ వాటర్‌ ఫ్యూరిఫికేషన్‌ అండ్‌ వేస్ట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ త్రూ ఇన్నోవేటివ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీæ’’ అనే అంశంపై జాతీయస్థాయి సింపోసిజమ్‌ ఉపన్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ‘‘ యాక్సలరేటింగ్‌ చేంజ్‌ టు సాల్వ్‌ ద వాటర్‌ అండ్‌ సానిటేషన్‌ క్రైసిస్‌’’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌ ( ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ)  చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ఎస్‌.శ్రీధర్‌ మాట్లాడుతూ ప్రకృతి ప్రసాదిత జలానికి ప్రత్యామ్నాయం లేదన్నారు. ఈ అమూల్యమైన సహజ వనరును పరిరక్షించుకుంటూ పొదుపుగా, సమర్థంగా వాడుకుంటేనే జల సంక్షోభాలను ఎదుర్కోగలమన్నారు. వర్షాలు తగ్గిపోవడం వలన భూగర్భ జలాలపై ఒత్తిడి అధికమై తాగునీటికి కటకట ఏర్పుడుతోందన్నారు. కురిసిన వర్షంలో అధిక శాతం వృథాగా పోవడం, నిల్వ చేసుకోవడానికి తగిన సదుపాయాలు లేకపోవడం, వర్షాలు అన్నిచోట్ల సమానంగా కురవకపోవడం కూడా కారణమన్నారు. ప్రస్తుత నీటి లభ్యత, వర్షపాతాల పరిస్థితులనుబట్టి చూస్తే భవిష్యత్‌లో తీవ్ర కొరత ఎదురు కావడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. ఇప్పటినుంచైనా వర్షపు నీటిని ఒడిసిపట్టాలని, భూగర్భం నుంచి తీసుకునే నీటికి రెట్టింపు జలాన్ని నేలలోకి ఇంకించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. దీనికోసం ఇంకుడు గుంతలు, బోరు రీచార్జ్‌ ఛాంబర్లు, పంట కుంటల నిర్మాణాన్ని ప్రోత్సహించాలన్నారు.  పట్టణాలు, నగరాల్లో వర్షం నీటిని నిల్వచేసే భూగర్భ ట్యాంకుల నిర్మాణం తప్పనిసరి చేయాలన్నారు. వివిధ రకాల టెక్నాలజీ పద్దతులను వినియోగించి వరద నీటిని శుద్ధి చేసి తాగునీరుగా మార్చే పద్ధుతులను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ ఫోరమ్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ, స్కూల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ డిపార్ట్‌మెంట్‌ల డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.