సుస్థిర వ్యవసాయంతోనే ఉత్పత్తి సాధ్యం

సుస్థిర వ్యవసాయంతోనే ఉత్పత్తి సాధ్యం
  - సంగం సీడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ డాక్టర్‌ ఆలపాటి సత్యనారాయణ

ప్రపంచంలో రోజు రోజుకు పెరుగుతున్న వాతావరణ మార్పులు, పర్యావరణ సమస్యలు, పెరుగుతున్న జనాభాకు తగ్గ స్థిరమైన ఉత్పత్తిని సాధించాలంటే సుస్థిర వ్యవసాయంతోనే సాధ్యమని సంగం సీడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ డాక్టర్‌ ఆలపాటి సత్యనారాయణ పేర్కొన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌ టెక్నాలజీ విభాగంలోని అగ్రికల్చరల్‌ అండ్‌ హార్టికల్చరల్‌ సైన్సెస్‌  డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో ‘‘ క్లైమేట్‌ స్మార్ట్‌ అగ్రికల్చర్‌’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న అంతర్జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌ రెండో రోజైన మంగళవారం ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంగం సీడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ డాక్టర్‌ ఆలపాటి సత్యనారాయణ మాట్లాడుతూ సుస్థిర వ్యవసాయమును సామాజిక, పర్యావరణ, ఆర్థిక రంగాలుగా విభజించవచ్చునన్నారు. సుస్థిర వ్యవసాయ పద్ధుతులను వినియోగిస్తున్నప్పుడు ఎదురయ్యే అడ్డంకులను గుర్తించడంతో పాటు వాటిని అధిగమించడానికి విద్యార్థులు కృషి చేయాలన్నారు.  సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా రైతులు పునరుత్పాదక శక్తిపై ఆధారపడటం, రసాయన ఎరువుల వినియోగం, వనరుల కొరత తగ్గించుకోవచ్చన్నారు.

కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన ధార్వాడలోని యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ సైన్స్‌ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ ఆర్‌ఆర్‌ హంచినల్‌ మాట్లాడుతూ సీడ్‌ ఇండస్ట్రీలో ఉన్న అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. సీడ్‌ ప్రొడక్షన్‌లో ఆధునిక మెలుకవలను వినియోగించి విస్తృత పరిశోధనలు చేయాలన్నారు. 

కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్‌లోని ఐసీఏఆర్‌– ఐఐఓఆర్‌ డైరక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.కే. మాథూర్‌ పెరుగుతున్న దేశ జనాభాకు అవసరమైన వంట నూనెల్లో ఎక్కువ శాతం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. గోధుమ, వరి, ఆహారపంటలు సాగు విస్తీర్ణంతో పోలిస్తే నూనె గింజల పంటల సాగు పెరుగుదల తక్కువేనని పేర్కొన్నారు. అందువల్ల నూనె గింజల ఉత్పత్తిలో దేశ ప్రజల అవసరాలు తీర్చడానికి పెద్ద ఎత్తున వివిధ వ్యవసాయ బౌగోళిక మండలాలో అక్కడి వాతావరణ పరిస్థితులకు అనువైన పంటల సాగు చేపట్టడం, ఉత్పాదకత పెంచడం ఎంతో అవసరమని తెలియజేసారు. 

కార్యక్రమంలో రాజమహేంద్రవరంలోని ఐసీఏఆర్‌ – సీటీఆర్‌ఐ డైరక్టర్‌ డాక్టర్‌ ఎం.శేషు మాధవ్‌ విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, డీన్‌ ఎస్‌ఏఎఫ్‌టీ, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అగ్రికల్చరల్‌ విద్యార్థులు పాల్గొన్నారు.