సానుభూతి, నిబద్ధత కలిగిన నాయకులుగా ఎదగాలి

సానుభూతి, నిబద్ధత కలిగిన నాయకులుగా ఎదగాలి 

  వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇన్నోవేటర్‌ సుధాన్షు మణి

  అంకితభావంతో కృషి చేయండి :  న్యూఢిల్లీలోని బోట్‌ల్యాబ్‌ డైనమిక్స్‌ ఎండీ డాక్టర్‌ సరిత అహల్వాత్‌

  దేశానికి సేవచేయండి : నూకాన్‌ ఏరోస్పేస్‌ ఆపరేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అరవింద్‌ కే సింగ్‌

  నైపుణ్యాల్ని వెలికి తీసేందుకే: విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య

  భావి శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు విద్యార్థుల అడుగులు

  విజ్ఞాన్‌లో వైభవంగా ముగిసిన జాతీయస్థాయి సృజనాంకుర–2కే23

  వైజ్ఞానిక ప్రదర్శనలో ఆకట్టుకున్న నమూనాలు

  విజేతలకు రూ.9 లక్షల విలువైన నగదు బహుమతల పంపిణీ

విద్యార్థులు నాయకులుగా ఎదిగే క్రమంలో సానుభూతితో పాటు నిబద్ధత కలిగి ఉండాలని వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇన్నోవేటర్‌ సుధాన్షు మణి అన్నారు.  చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి విజ్ఞాన్స్‌ సృజనాంకుర–2కే23 కార్యక్రమం అట్టహాసంగా ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇన్నోవేటర్‌ సుధాన్షు మణి మాట్లాడుతూ లెర్నింగ్‌ జీవితంలో నిరంతర ప్రక్రియని పేర్కొన్నారు. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ విజయవంతం కావడంలో తనతో పాటు తెరవెనుక ఎంతోమంది కృషి చేశారని తెలియజేసారు. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ విజయవంతం కావడం కంటే ముందు తాను లెక్కించలేనన్ని ఓటములను ఎదుర్కొన్నాని పేర్కొన్నారు. ఓటములను ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే విజయాలకు దరిచేరగలమని తెలియజేసారు. విద్యార్థులందరూ మీ దగ్గరున్న ఐడియాలను సరైన దిశలో ఆచరణ పెట్టినట్లైతే విజయం మీ సొంతమవుతుందన్నారు. విద్యార్థులు చేసే ఏ పనైనా గర్వంగా, సొంతంగా చేయడానికే ప్రయత్నించాలన్నారు.

అంకితభావంతో కృషి చేయండి : న్యూఢిల్లీలోని బోట్‌ల్యాబ్‌ డైనమిక్స్‌ ఎండీ డాక్టర్‌ సరిత అహల్వాత్‌

మీ కలల సాకారానికి అంకితభావంతో కృషి చేస్తే ఉన్నతంగా ఎదిగే శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయని న్యూఢిల్లీలోని బోట్‌ల్యాబ్‌ డైనమిక్స్‌ ఎండీ డాక్టర్‌ సరిత అహల్వాత్‌ అన్నారు. ఇది సాధించలేనేమో అనే భయం, సందేహాలకు జీవితంలో తావివ్వొద్దని విద్యార్థులకు సూచించారు. డబ్బుతో సాధించలేనివి ఎన్నో ప్రేమ, మన్నింపు, ధైర్యంతో సాధించవచ్చని అన్నారు. సృజనాంకుర వంటి కార్యక్రమాల్లో ప్రాజెక్టుల ప్రదర్శనలతో విద్యార్థుల్లో సమైక్యతను పెంచడమే కాకుండా సృజనాత్మకత పెరుగుతుందన్నారు. 

దేశానికి సేవ చేయండి : నూకాన్‌ ఏరోస్పేస్‌ ఆపరేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అరవింద్‌ కే సింగ్‌

భారతీయ యువతలో మేథాశక్తికి కొదవలేదు. ఈ దేశాన్ని ఆర్థికంగా పరిపుష్ఠం చేయడానికి మీ అందరి ఆలోచనలకు పదునుపెట్టండి. దేశానికి సేవ చేయండని నూకాన్‌ ఏరోస్పేస్‌ ఆపరేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అరవింద్‌ కే సింగ్‌ పిలుపునిచ్చారు. పటిష్టమైన ఉన్నత విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. విద్యార్థులు చేసే ప్రయోగాలు సామాన్యుల అవసరాలను తీర్చేలా సైన్స్‌ ఉండాలని  విద్యార్థుల్లో నేడు సృజనాత్మకత పెరుగుతుందని, దానికి అధ్యాపకులు కొంతమేర వారికి తోడ్పాటు అందించినట్లైతే వారు పెద్దవారైన తరువాత శాస్త్రవేత్తలుగా రాణిస్తారని పేర్కొన్నారు.

నైపుణ్యాల్ని వెలికి తీసేందుకే: విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య

విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ మన విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకే తాము ఏటా ఎంతో వ్యయంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. మరోవైపు ఇలాంటి కార్యక్రమాల వల్ల కలిసి పనిచేసే నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, నాయకత్వ స్ఫూర్తి, సమష్టితత్వం అనే జీవన నైపుణ్యాలు కూడా అలవడతాయన్నారు. విద్యార్థులు గెలుపుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు వారిలో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. విద్యార్థులు వివిధ రంగాలలో రాణించడానికి మంచి స్కోప్‌ ఉందన్నారు.

విజ్ఞాన్స్‌ సృజనాంకుర విజేతలకు బహుమతులు
చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి విజ్ఞాన్స్‌ సృజనాంకుర–2కే23 విజేతలకు రూ.9 లక్షల విలువైన బహుమతులను అందజేసారు. కార్యక్రమంలో విజ్ఞాన్‌ సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, లారా ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్, ఫార్మసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.