విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు లైఫ్‌ సేవర్‌ అవార్డ్‌

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు లైఫ్‌ సేవర్‌ అవార్డ్‌
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు వరుసగా 7వ సారి లైఫ్‌ సేవర్‌ అవార్డు లభించింది. గుంటూరులోని తలసేమియా నీడ్స్‌ బ్లడ్‌ సెంటర్‌కు ఒక ఏడాది కాలంలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు రక్తదానం చేసినందుకుగాను యూనివర్సిటీలోని ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగంలోని యూఈఏసీ ( యూనివర్సిటీ ఎక్సెటెన్షన్‌ యాక్టివిటీ కౌన్సిల్‌)కు గురువారం లైఫ్‌ సేవర్‌ అవార్డు అందించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌కు తలసేమియా నీడ్స్‌ బ్లడ్‌ సెంటర్‌ ప్రెసిడెంట్‌ శ్రీధర్‌ ప్రశంసా పత్రంతో పాటు అవార్డును అందజేసారు. ఈ సందర్భంగా తలసేమియా నీడ్స్‌ బ్లడ్‌ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ ‘‘ రక్తదానం చేయండి– జీవితాన్ని కాపాడండి ’’ అనే ఉద్దేశ్యంతో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని యూఈఏసీ టీమ్‌ సభ్యులు, విద్యార్థులందరూ ఆపత్కాలంలో ఎంతోమందికి రక్తదానం చేసి ప్రాణాలను కాపాడుతున్నారని కొనియాడారు. అంతేకాకుండా మరెంతో మందికి రక్తదానం చేయడం వలన కలిగే ఉపయోగాలను అందరికీ తెలియజేసి రక్తదానం చేసే దిశగా ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. రక్తదానం చేశాక శరీరం తాను కోల్పోయిన రక్తాన్ని 48 గంటల్లోగా తిరిగి భర్తీ చేసుకుంటుందని వెల్లడించారు. రక్తాన్ని కృత్రిమంగా తయారుచేయలేమని, ఎవరైనా దానం చేస్తేనే లభిస్తుందన్నారు. ప్రమాదాల సమయంలో బాధితులకు రక్తం అవసరం ఎంతో ఉంటుందని చెప్పారు. రక్తదానం వల్ల నేడు ఎంతో మందిని వైద్యులు బతికించగలుగుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, యూఈఏసీ టీమ్‌ సభ్యులు పాల్గొన్నారు.

ఫోటోరైటప్‌ :
తలసేమియా నీడ్స్‌ బ్లడ్‌ సెంటర్‌ ప్రతినిధి చేతుల మీదుగా అవార్డును అందుకుంటున్న విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, యూఈఏసీ టీమ్‌ సభ్యులు