అవార్డులు గౌరవాన్ని అందించడమే కాదు బాధ్యతను పెంచుతాయి

టాలెంట్  ఎక్స్ ప్రెస్ న్యూస్:

అవార్డులు గౌరవాన్ని అందించడమే కాదు బాధ్యతను పెంచుతాయి.. భీష్మ అవార్డు గ్రహీత, సినీ నటి డా.శ్రీజ సాదినేని. కళా సేవలో కొనసాగుతుండడం వల్లనే భీష్మ అవార్డు లాంటి విశిష్ట పురస్కారం దక్కింది అని తెలిపారు సినీ నటి, రచయిత్రి, డా శ్రీజ సాదినేని.
తెలంగాణా రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, వందే భారత్ సామాజిక సేవా సంస్థ సంయుక్తంగా మంచిరేవుల అడ్రస్ కన్వెన్షన్ సెంటర్లో గురువారం నిర్వహించిన భీష్మ విశిష్ట పురస్కారం అందుకున్నారు డా.శ్రీజ సాదినేని. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. 
బాలనటిగా రంగస్థల ప్రవేశం చేసిన తాను ఈ 29 సంవత్సరాల ప్రస్థానంలో నటిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా, లైటింగ్, మేకప్, సెట్ డిజైనింగ్ ఆర్టిస్ట్ గా, ఈవెంట్ మేనేజర్ గా, నాటక నిర్మాతగా, నాటక పరిషత్ నిర్వాహకురాలుగా, యాక్టింగ్ ఫ్యాకల్టీగా రంగస్థలం లో సేవలు అందించడమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా, షార్ట్ ఫిల్మ్ దర్శక నిర్మాతగా, యూ ట్యూబర్ గా ఇలా అనేక రంగాలలో ప్రావీణ్యం కనబరుస్తూ కళా సేవ కొనసాగిస్తున్నానని, నంది, గరుడ, అశ్వం, హనుమ వంటి వాటితో కలిపి మూడు వేలకు పైగా అవార్డులు అందుకున్నానని, ఇప్పుడు వందే భారత్ వారు అందించిన ప్రతిష్టాత్మకమైన భీష్మ అవార్డు కూడా తన బాధ్యతను మరింత పెంచుతూ తన కళా ప్రయాణానికి ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని కలిగించిందని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు రమేష్ గారికి, డా సాజిదా ఖాన్ లకు తన కృతజ్ఞతలు తెలిపారు. 
అవార్డులు గౌరవాన్ని అందించడమే కాకుండా తమ బాధ్యతను అనుక్షణం గుర్తు చేస్తుంటాయని, తన చివరి క్షణం వరకు కళా రంగానికి సేవ చేస్తూనే ఉంటానని పత్రికా ముఖంగా ఆమె తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు సినీ నాటక ప్రముఖులు డా.శ్రీజ సాదినేనికి అభినందనలు అందజేశారు.