ఐఐఎస్‌సీ బెంగళూరుతో విజ్ఞాన్‌ గ్రూప్‌ అవగాహన ఒప్పందం

ఐఐఎస్‌సీ బెంగళూరుతో విజ్ఞాన్‌ గ్రూప్‌ అవగాహన ఒప్పందం
గుంటూరు ప్రధాన కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక విద్యాసంస్థలు నిర్వహిస్తున్న విజ్ఞాన్‌ గ్రూప్‌ ( లావు ఎడ్యుకేషనల్‌ సొసైటీ) బెంగుళూరులోని ఐఐఎస్‌సీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను విజ్ఞాన్‌ గ్రూప్‌ వైజాగ్‌ సీఈవో నందిగం శ్రీకాంత్‌కు ఐఐఎస్‌సీ బెంగళూరు రిజిస్ట్రార్‌ శ్రీధర్‌ వారియర్‌ అందజేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజ్ఞాన్‌ గ్రూప్‌ వైజాగ్‌ సీఈవో నందిగం శ్రీకాంత్‌ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలోని విద్యాసంస్థలతో కాకుండా వెలుపలి రాష్ట్రాలలోని ప్రైవేట్‌ విద్యాసంస్థలతో ఐఐఎస్‌సీ బెంగుళూరు అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఈ అవగాహన ఒప్పందం వలన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని విజ్ఞాన్‌ గ్రూప్‌ విద్యార్థులకు సైన్స్‌తో పాటు మ్యాథమేటిక్స్‌ సబ్జెక్టులను సులభంగా బోధించడంతో పాటు భోధనా నాణ్యతను మరింత పెంచి ఎక్సిపెరిమెంటల్‌ లెర్నింగ్‌ను అందించడానికి ఉపయోగపడుతుందన్నారు. ఐఐఎస్‌సీ బెంగుళూరులో పనిచేసే సీనియర్‌ ప్రొఫెసర్లు రెండు తెలుగు రాష్ట్రాలలోని విజ్ఞాన్‌ విద్యాసంస్థల్లో పనిచేసే 500 మంది ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు సైన్స్‌తో పాటు మ్యాథమేటిక్స్‌ విద్యను ప్రోత్సహించేలా కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ్‌ జిల్లాలోని చల్లకెరె శాటిలైట్‌ క్యాంపస్‌లో 10 రోజుల పాటు ప్రత్యేకమైన శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తారు. ఈ శిక్షణా శిబిరము రానున్న మే నెలలో కానీ జూన్‌ నెలలో కానీ నిర్వహిస్తారని తెలియజేసారు. ఐఐఎస్‌సీ బెంగుళూరుతో అవగాహన ఒప్పందం కుదుర్చోకోవడం పట్ల విజ్ఞాన్‌ గ్రూప్‌ ప్రిన్సిపల్స్, అధ్యాపక సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.