తెలియనిది తెలియజేయడమే లక్ష్యం

తెలియనిది తెలియజేయడమే లక్ష్యం

  _ ఎన్‌ఐటీ రూర్కెల డైరక్టర్‌ ప్రొఫెసర్‌ కే.ఉమామహేశ్వర రావు
 టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
విద్యార్థులకు తెలియని విషయాలను తెలియజేయడమే లక్ష్యంగా ఉంచుకోవాలని ఎన్‌ఐటీ రూర్కెల డైరక్టర్‌ ప్రొఫెసర్‌ కే.ఉమామహేశ్వర రావు బుధవారం ఉపాధ్యాయులకు సూచించారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డీన్‌ ప్రమోషన్స్, కొలాబరేషన్స్, ఫ్యాకల్టీ అఫైర్స్‌ ఆఫీస్‌ ఆధ్వర్యంలో ‘‘ అట్రిబ్యూట్స్‌ ఆఫ్‌ గుడ్‌ టీచింగ్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ ఎడ్యుకేషన్‌ ’’ అనే అంశంపై ఇంటరాక్టివ్‌ సెషన్‌ను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్‌ఐటీ రూర్కెల డైరక్టర్‌ ప్రొఫెసర్‌ కే.ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ విద్యార్థులు తప్పులు చేసినప్పుడు వారిని దండించకుండా సున్నితంగా తెలియజేసి సన్మార్గంలోకి తీసుకురావాలని పేర్కొన్నారు. విద్యార్థులకు బోధించే విషయాలను కష్టంగా కాకుండా ఇష్టంతో, సులువుగా బోధించినప్పుడే ఉత్తమ ఫలితాలను అందుకోగలమన్నారు. మంచి వ్యక్తిత్వం, తగినంత జ్ఞానం, పరిశోధనలంటే ఎంజాయ్‌ చేసే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. ఎప్పుడూ ఒకే విధంగా మూసధోరణిలో పనులు చేసుకుంటూ వెళితే  కొన్నాళ్లకే బోరు కొట్టేస్తుందని, పరిధిని దాటి సులువైన పద్ధతుల కోసం ఆలోచించాలన్నారు. చేసే పనులను కాస్త కొత్తగా, సృజనాత్మకంగా చేయడానికి ప్రయత్నించాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.