14న విజ్ఞాన్స్‌ వర్సిటీలో అంతర్జాతీయ వర్క్‌షాప్‌

14న విజ్ఞాన్స్‌ వర్సిటీలో అంతర్జాతీయ వర్క్‌షాప్‌
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఈ నెల 14న అంతర్జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్, ఐఐఐటీ అలహాబాద్‌ మాజీ డైరక్టర్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్క్‌షాప్‌కు సంబంధించిన గోడ పత్రికలను వైస్‌ చాన్స్‌లర్‌ విడుదల చేసారు. యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలోని ఈసీఈ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో ‘‘ వైర్‌లెస్‌ కమ్యూనికేషన్స్‌ అండ్‌ యాంటినా టెక్నాలజీస్‌ ఫర్‌ స్పేస్, ఏయిర్‌ అండ్‌ గ్రౌండ్‌ అప్లికేషన్స్‌’’ అనే అంశంపై అంతర్జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూఎస్‌ఏలోని రావూస్‌ కన్సల్టంట్స్‌ ప్రెసిడెంట్, సీఈవో, ఐఈఈఈ లైఫ్‌ ఫెల్లో డాక్టర్‌ సుధాకర్‌రావ్, యూఎస్‌ఏలోని నాసా/ జేపీఎల్‌ సీనియర్‌ ఇంజినీర్‌ డాక్టర్‌ నాసెర్‌ చహత్, బెంగళూరులోని క్వాడ్‌జెన్‌ వైర్‌లెస్‌ ప్రెసిడెంట్, సీఈవో సీఎస్‌.రావ్, తైవాన్‌లోని ఫెంగ్‌ చియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ చో–యెన్‌–డెస్‌మోండ్, ఇస్తాంబుల్‌ అట్లాస్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎల్‌.సెవ్గి, యూఎస్‌ఏలోని నాసా/జేపీల్‌ యాంటీనా ఇంజినీర్‌ డాక్టర్‌ గౌరాంగి గుప్త, పులివెందుల జేఎన్‌టీయూఏలోని ఈసీఈ హెడ్‌ ప్రొఫెసర్‌ రమణా రెడ్డి హాజరవుతున్నారని తెలియజేసారు. గోడ పత్రికల విడుదల కార్యక్రమంలో వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు పాల్గొన్నారు.