వెన్నెల చీకటి

//వెన్నెల చీకటి/

చీకటెంత బావుందీ 
వెన్నెల వీధుల్లో విహరిద్దామంది తాను
ఓహ్.. చీకటంటే భయం అన్నా నేను
ఎందుకేంటీ అని ప్రశ్నించింది ఆమె

నాకు నేనే వినిపిస్తాననీ
అంతు చిక్కని లోతుల్లో 
పడిపోతాననీ 
అంతరంగ మూలాల్లో  
దేవులాడతానేమోననీ 
నా సమాదానం 

పక్కుమని నవ్విందామె
అంత భయమయితే  ఎలా..!!
నిత్యమూ చూడాలి
అంతరంగంలో వెతకాలి
అలికిడి చేయని 
అద్భుతమైన జీవ నదీనదాల్ని 
అక్కడే వెతకాలంది తాను

అగాధశూన్యాలన్నీ లోలోనే కదా
చీకటికి బయపడితే 
వెలుగందమేం తెలుస్తుందీ 
రా మరీ  అంటూ చేయి పట్టింది 
తోడుగా నడుస్తూ..

మనసే మధుకలశం
మనసే భయకంపితం
చిమ్మచీకట్లోకి నడుస్తున్నా
నాలోని నన్ను వెతుకుతూ 
అసలు ఎత్తు పల్లాల్ని ధర్శిస్తూ..
విశ్వధర్శనమంతా ఇప్పుడు 
నా లోపలే గోచరిస్తుంది

ఏయ్ మనసా 
సరిగా  పనిచేయ్
నన్ను  నాకు 
విస్తృతం చేస్తూ సాగిపో..
నీ తోడుగా నేను 
నా తోడుగా నువ్వు 
వదలకెప్పుడూ 
పట్టిన చేతిని అన్నా నేను

సరే బాస్ 
పద పద 
వెన్నెల వైపుగా సాగుదాం 
అలా పున్నమి రేయి  వరకూ
కృష్ణ  పక్షంలో 
శుక్ల పక్షంలో  
వెన్నెల చీకట్లో
నేర్చుకోవాలిద్దరం అంది తాను.



యామినీ"స్