విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ముగిసిన ఎన్‌సీసీ క్యాంపు

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ముగిసిన ఎన్‌సీసీ క్యాంపు
  ఐదు రాష్ట్రాల నుంచి 600  మంది ఎన్‌సీసీ క్యాడెట్లు హాజరు

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఐదు రాష్ట్రాల నుంచి ఏక్‌ భారత్‌.. శ్రేష్ట భారత్‌ ఎన్‌సీసీ శిబిరం నిర్వహణలో భాగంగా 600 మంది ఎన్‌సీసీ క్యాడెట్‌ విద్యార్థులకు ఏర్పాటు చేసిన శిక్షిణా శిబిరం ఆదివారం ఘనంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, చత్తీస్‌ఘడ్‌ల నుంచి హాజరైన ఎన్‌సీసీ విద్యార్థులకు 12 రోజుల పాటు సాంస్కృతిక శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. గుంటూరు ఎన్‌సీసీ గ్రూప్, క్యాంపు కమాండర్‌ కల్నల్‌ ఎస్‌ఎమ్‌. చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఏక్‌ భారత్‌.. శ్రేష్ట భారత్‌లో భాగంగా నిర్వహించిన శిక్షణా శిబిరంలో విద్యార్థులు వారి రాష్ట్రాలకు చెందిన సంస్కృతి, సంప్రదాయాలను ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు వివిధ ప్రదర్శనల ద్వారా తెలియజేయడమే ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశ్యమన్నారు. 12 రోజుల క్యాంపులో భాగంగా విద్యార్థులతో కొండవీడు కోటకు వెల్లి ట్రెజర్‌ హంట్‌ కండక్ట్‌ చేశామన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడి, ఉండవల్లి గుహలు, అమరావతి బుద్ధ విగ్రహం, మ్యూజియం, సూర్యలంక ఏయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌లను సందర్శించామన్నారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ ఎన్‌సీసీ వలన విద్యార్థులకు క్రమశిక్షణ, సమయపాలన, సానుకూల దృక్పథం, సమాజంలో ఇతరులతో ఎలా మెలగాలో నేర్చుకుంటారని తెలియజేసారు. విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ మాట్లాడుతూ  ఎన్‌సీసీ వలన క్రమశిక్షణతో పాటు, కలిసి మెలిసి ఉండటం, ప్రజలకు సామాజిక సేవ చేసే అవకాశం దొరుకుతుందన్నారు. విద్యార్థులందరూ ఎన్‌సీసీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలన్నారు. శిక్షణా శిబిరాన్ని పురస్కరించుకుని గ్రూప్‌ సాంగ్స్, డిబేట్స్, గ్రూప్‌ డాన్స్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, టగ్‌ ఆఫ్‌ వార్, ఎన్‌సీసీ సాంగ్‌ కాంపిటీషన్‌లో నిర్వహించిన పలు పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులకు మెడల్స్‌తో పాటు ప్రశంసా పత్రాలను అందజేసారు. కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్,  విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, గుంటూరు ఎన్‌సీసీ గ్రూప్, క్యాంపు కమాండర్‌ కల్నల్‌ ఎస్‌ఎమ్‌. చంద్రశేఖర్, గుంటూరులోని 25ఏ బెటాలియన్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ సీఎస్‌ సిద్ధు ఆయా విభాగాల డీన్లు, ఎన్‌సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.