ప్రతి న్యాయవిద్యార్థి సోషల్‌ ఇంజినీరే!

ప్రతి న్యాయవిద్యార్థి సోషల్‌ ఇంజినీరే!

  _ ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ ఆంధ్రప్రదేశ్‌ జనరల్‌ సెక్రటరీ, ఏపీ హైకోర్ట్‌ అడ్వకేట్‌ ఎన్‌.శ్రీనివాస్‌ రావ్‌

న్యాయ విద్యను అభ్యసించే ప్రతి విద్యార్థి సోషల్‌ ఇంజినీరేనని ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ ఆంధ్రప్రదేశ్‌ జనరల్‌ సెక్రటరీ, ఏపీ హైకోర్ట్‌ అడ్వకేట్‌ ఎన్‌.శ్రీనివాస్‌ రావ్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని లా డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో ‘‘ న్యాయవిద్య – కొత్త మార్గాలు ’’ అనే అంశంపై ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ ఆంధ్రప్రదేశ్‌ జనరల్‌ సెక్రటరీ, ఏపీ హైకోర్ట్‌ అడ్వకేట్‌ ఎన్‌.శ్రీనివాస్‌ రావ్‌ మాట్లాడుతూ సమాజంలోని ప్రతి సమస్యను పరిష్కరించేది లాయరేనని పేర్కొన్నారు. న్యాయ విద్యను అభ్యసించే విద్యార్థులు ప్రతిరోజు సమాజంలో ఎటువంటి సంఘటనలు, పరిణామాలు సంభవిస్తున్నాయో గమనిస్తూ ఉండాలన్నారు. న్యాయవాది వృత్తి సవాళ్లతో కూడుకున్నదని, ఇందులో రాణించాలనుకునే విద్యార్థులు పుస్తకాలు, జర్నల్స్‌ బాగా చదవాలన్నారు. ప్రస్తుతం డిజిటలైజేషన్, సైబర్‌ నేరాలు పెరుగుతున్నందు వలన న్యాయశాస్త్రం చదివే విద్యార్థులు ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్‌ వంటి కొత్త టెక్నాలజీలపై పట్టు సాధించాలన్నారు. క్రిమినల్, సివిల్, మాట్రిమోనియల్, కమర్షియల్, లేబర్, వినియోగదారుల చట్టాలపై అవగాహన పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ముఖ్య అతిథిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.