ఎలక్ట్రికల్‌ సేఫ్టీ ప్రమాణాలు తప్పక పాటించాలి

ఎలక్ట్రికల్‌ సేఫ్టీ ప్రమాణాలు తప్పక పాటించాలి

  ఏపీ ఎలక్ట్రికల్‌ సేఫ్టీ డైరక్టరేట్, సీఈఐజీ జీ.విజయలక్ష్మి

వినియోగదారులందరూ ఎలక్ట్రికల్‌ సేఫ్టీ ప్రమాణాలు తప్పక పాటించాలని ఏపీ ఎలక్ట్రికల్‌ సేఫ్టీ డైరక్టరేట్, సీఈఐజీ జీ.విజయలక్ష్మి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ఈఈఈ డిపార్ట్‌మెంట్‌ విభాగంలోని ఎలక్ట్రికల్‌ మెయింటనెన్స్‌  ఆధ్వర్యంలో ‘‘ ఎలక్ట్రికల్‌ సేఫ్టీ’’ అనే అంశంపై శుక్రవారం ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ ఎలక్ట్రికల్‌ సేఫ్టీ డైరక్టరేట్, సీఈఐజీ జీ.విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రయాణించే వాహనాలపై ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగలు జారిపడినా లేదా వాటికి మనం ప్రయాణించే వాహనం తగిలినట్లైతే వాహనంలో నుంచి బయటపడేందుకు హాపింగ్‌ (గెంతడం లేదా దూకటం) విధానాన్ని అనుసరించాలన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు సంబంధించి మోటారు స్టార్టర్లు స్విచ్చులు ఉన్న ఇనుప బోర్డులను విధిగా ఎర్తింగ్‌ చేయాలని పేర్కొన్నారు. మోటార్లు తిరగని ఎడల విద్యుత్‌ స్తంభాలను, ట్రాన్స్‌ఫార్మర్లను మరమ్మత్తు నిమిత్తమై రైతులు ఎక్కరాదన్నారు. పొలాల్లో తెగిపడిన, జారిపడి తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్‌ వైర్లకు దూరంగా ఉండి సంబంధిత విద్యుత్‌ సిబ్బందికి గానీ, గ్రామ సచివాలయాల్లో ఉన్న ఎనర్జీ సహాయకులకు గానీ ఫిర్యాదు చేయాలని తెలియజేసారు. ఇంట్లోగానీ, వాణిజ్య సంస్థల్లోగానీ లూజ్‌ ఎర్త్‌ కనెక్షన్లు, లూజ్‌ వైరింగ్‌ లేకుండా పర్మినెంటుగా ఉండేటట్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇండస్ట్రీ పరిసరాలలో తాత్కాలిక వైరింగ్‌ కాకుండా శాశ్వతమైన పీవీసీ పైపుల ద్వారా ఏర్పాటు చేయించే బాధ్యతను విద్యార్థులు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీ ఎలక్ట్రికల్‌ సేఫ్టీ డైరక్టరేట్, టెక్నికల్, డిప్యూటీ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ వీ.జయబాబు, ఏపీ ఎలక్ట్రికల్‌ సేఫ్టీ డైరక్టరేట్‌ గుంటూరు డిప్యూటీ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పీ.బాలక్రిష్ణ, విజ్ఞాన్స్‌ వర్సిటీలోని ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక, ఎలక్ట్రికల్‌ మెయింటనెన్స్‌ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.