ఐవోటీతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌

ఐవోటీతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌

  పర్పుల్‌ టెక్నాలజీస్‌ సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ రామక్రిష్ణ
ఐవోటీ ( ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌)లో పట్టుసాధించిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని పర్పుల్‌ టెక్నాలజీస్‌ సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ రామక్రిష్ణ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలోని ఈసీఈ డిపార్ట్‌మెంట్, పర్పుల్‌ టెక్నాలజీస్‌ల సంయుక్త ఆధ్వర్యంలో మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్‌ విద్యార్థులకు ‘‘ఆర్డినో అండ్‌ ఐవోటీ’’లపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న వర్క్‌షాప్‌ను మంగళవారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పర్పుల్‌ టెక్నాలజీస్‌ సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ రామక్రిష్ణ మాట్లాడుతూ స్మార్ట్‌ హోమ్‌ ఆటోమేషన్, ఆరోగ్య సేవలు, ఇండస్ట్రియల్‌ ఐవోటీ, అగ్రికల్చర్, స్మార్ట్‌ సిటీస్‌ వంటి రంగాలకు ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఆర్డినో, ఐవోటీ టెక్నాలజీల గురించి చాలా తక్కువ మందికి తెలుసునని, భవిష్యత్‌లో ఈ టెక్నాలజీలు మానవ జీవితంలో ముఖ్య భాగం కానున్నాయని తెలియజేసారు. వ్యవసాయ రంగంలో ఈ టెక్నాలజీ ద్వారా రైతులు ఇంటి వద్ద నుంచే నీటి మోటార్లను కంట్రోల్‌ చేయవచ్చునన్నారు. ఐవోటీ సహాయంతో ఆరోగ్య రంగంలో సామాన్య ప్రజల ఆరోగ్య పర్యవేక్షణ, రక్తపోటు, హార్ట్‌ రేటులను మానిటరింగ్‌ చేయవచ్చునన్నారు. అంతేకాకుండా హాస్పిటల్‌ అడ్మిట్‌ అయిన రోగి కదలికలను కూడా గమనించవచ్చని తెలియజేసారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ఇలాంటి వర్క్‌షాప్‌లు ఉపయోగపడుతాయని అన్నారు. ఉజ్వల భవిష్యత్‌ కోసం ఒకరికొకరు ప్రోత్సాహాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారానే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్ర కుమార్, ఆయా విభాగాల అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.