ఇంజినీరింగ్‌ విద్యార్థులందరూ క్రియేటర్సే

ఇంజినీరింగ్‌ విద్యార్థులందరూ క్రియేటర్సే!
  బెంగళూరులోని యూఆర్‌ రావ్‌ సాటిలైట్‌ సెంటర్, ఇస్రో ఆర్‌ అండ్‌ క్యూఏ మెకానికల్‌ ఇంటిగ్రేషన్‌ అండ్‌ టెస్టింగ్‌ హెడ్‌ మహేందర్‌ పాల్‌ సింగ్‌

  విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ఇంజినీర్స్‌ డే వేడుకలు

ఇంజినీరింగ్‌ విద్యార్థులందరూ క్రియేటర్సేనని బెంగళూరులోని యూఆర్‌ రావ్‌ సాటిలైట్‌ సెంటర్, ఇస్రో ఆర్‌ అండ్‌ క్యూఏ మెకానికల్‌ ఇంటిగ్రేషన్‌ అండ్‌ టెస్టింగ్‌ హెడ్‌ మహేందర్‌ పాల్‌ సింగ్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం ప్రఖ్యాత ఇంజినీరు, భారతరత్న అవార్డు గ్రహీత మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజినీర్స్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బెంగళూరులోని యూఆర్‌ రావ్‌ సాటిలైట్‌ సెంటర్, ఇస్రో ఆర్‌ అండ్‌ క్యూఏ మెకానికల్‌ ఇంటిగ్రేషన్‌ అండ్‌ టెస్టింగ్‌ హెడ్‌ మహేందర్‌ పాల్‌ సింగ్‌ మాట్లాడుతూ విద్యార్థులందరూ కష్టపడి చదవకుండా ఇష్టంతో ప్రయోగాలు చేయడం వలన సమాజంలో ఉన్న  సమస్యలకు ఇంజినీరింగ్‌ రంగం ద్వారా పరిష్కారం వెతికి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించవచ్చన్నారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, రవాణా రంగం, తయారీ రంగం, వ్యవసాయం, ఆటో మొబైల్‌.... ఇలా ఏ రంగం తీసుకున్నా అందులో ఇంజినీర్ల పాత్రే ఎక్కువగా ఉంటుందన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ సీఈవో డాక్టర్‌ అనిల్‌కుమార్‌ టెంటు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి వారికొచ్చే ఆలోచనలలో ఒక్కటైనా ఆచరణలోనికి తీసుకురాగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చునన్నారు. విద్యార్థులందరూ వారి ఆలోచననలను స్టార్టప్స్‌గానో, కంపెనీలతో అసోసియేట్‌ అవ్వడమో చేసి పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నారు. సమాజానికి, ప్రజలకు ఉపయోగపడే వినూత్న ఆలోచనలు చేసే ఇంజినీర్లకు ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికీ ఉంటుందన్నారు. భారతీయ ఇంజినీరింగ్‌ విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచుకుంటే ప్రపంచ దేశాలను శాసించే సదావకాశం మన ముంగిట ఉంటుందన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులందరూ నిర్వహణ నైపుణ్యాలు, కమ్యూనికేషన్, టెక్నాలజీలను అప్‌డేట్‌ చేసుకోవాలన్నారు. ప్రపంచం ఇంత వేగంగా ముందుకెళ్తుందంటే దానికి కారణం ఇంజినీర్లేనని పేర్కొన్నారు. విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని, ఇంజినీరింగ్‌ విద్యార్థులంతా మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకుని సరికొత్త టెక్నాలజీలను ఆవిష్కరించాలన్నారు. అప్పుడే మోక్షగుండం విశ్వేశ్వరయ్య కన్న కలలు, ఆశయాలు సాకారమవుతాయన్నారు.  విద్యార్థులు నిరంతరం కొత్త కోర్సులు నేర్చుకుంటూ ఉండాలన్నారు. విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ మాట్లాడుతూ ఇరిగేషన్‌ బ్లాక్‌ సిస్టమ్‌ అనే నూతన విధానాలను తీసుకువచ్చి వ్యర్థమైన నీటిని నిల్వచేసి తిరిగి ఉపయోగించే విధంగా విశ్వేశ్వరయ్య కృషి చేసారని కొనియాడారు. విశ్వేశ్వరయ్య సివిల్‌ ఇంజినీరుగా, ఆర్థికవేత్తగా, నీటి యాజమాన్య నిపుణుడిగా, డ్యాముల నిర్మాతగా, స్టేట్స్‌మన్‌గా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి దేశాభివృద్ధికి బాటలు వేశారని తెలిపారు.  ఆటోమేటిక్‌ స్లూయిజ్‌ గేట్లను కనుగొన్నది ఆయనేనని, ఆ గేట్లు ఇరిగేషన్‌ వ్యవస్థలో పెను విప్లవంగా నిలిచాయన్నారు. ఇప్పటికీ ఇదే పరిజ్ఞానాన్ని జలాశయాల నిర్మాణంలో వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన తన ఆలోచనలతో దేశానికి ఎంతో సేవ చేశారని, నీటి పారుదల వ్యవస్థలో దేశానికి తిరుగులేని పరిజ్ఞానాన్ని అందించారని పేర్కొన్నారు. ఈయన జన్మదినాన్ని మనదేశంతో పాటు శ్రీలంక, టాంజానియా దేశాలు కూడా ఈరోజును ఇంజనీర్స్‌ డేగా జరుపుకుంటారని తెలియజేసారు. ఇంజనీర్స్‌డేను పురస్కరించుకుని విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్‌ ఎక్స్‌పోలు అతిథులను ఆకట్టుకుంది. అత్యుత్తమంగా రూపొందించిన ప్రాజెక్టులకు బహుమతులు అందజేశారు. పరిశోధన పత్రాలు సమర్పించిన అధ్యాపకులకు ప్రశంసా పత్రాలతో పాటు నగదు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.