విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు అటానమస్‌ హోదా

విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు అటానమస్‌ హోదా
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు  అటానమస్‌ ( స్వయం ప్రతిపత్తి) హోదా కల్పిస్తున్నట్లు న్యూఢిల్లీలోని యూజీసీ ( యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమీషన్‌) ఉపకార్యదర్శి గోపీచంద్‌ మేరుగు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు అటానమస్‌ హోదా లభించండం వలన స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కోర్సులను, సొంత పాఠ్యప్రణాళిక ఏర్పాటు చేసుకోవడంతో పాటు పరీక్షల నిర్వహణ, మూల్యాకంనం, డిగ్రీలను ప్రదానం చేయవచ్చన్నారు. ఈ అటానమస్‌ హోదా 2023–24 అకడమిక్‌ విద్యా సంవత్సరం నుంచి 2032–33 (10 సంవత్సరాల) పాటు లభించిందని పేర్కొన్నారు. ఈ హోదాతో బహుళజాతి కంపెనీలు విస్తృతంగా క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని తెలిపారు. అంతేకాకుండా విద్యా ప్రమాణాల మెరుగుదలతో పాటు మెరుగైన విద్యాబోధనకు కృషి చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు నాక్‌ ఏ+ అక్రిడిటేషన్‌తో పాటు ఐదు ఇంజినీరింగ్‌ ప్రోగ్రామ్స్‌కు ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ కూడా ఉన్నాయని తెలియజేసారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య అటానమస్‌ హోదా ధృవపత్రాన్ని  లారా కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్, ఆయా విభాగాల అధిపతులు, అధ్యాపక సిబ్బందికి అందజేసారు.