ఫార్మసీ విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారించాలి

ఫార్మసీ విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారించాలి

  గుంటూరులోని డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ దోనవల్లి లక్ష్మణ్‌

  విజ్ఞాన్‌ ఫార్మసీలో ఘనంగా ప్రారంభమైన జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌
ఫార్మసీ విద్యార్థులు పరిశోధనల వైపు ఆసక్తి పెంచుకోవాలని, అప్పుడే దేశానికి ఉపయోగపడే విధంగా కొత్త మందుల ఆవిష్కరణలకు నాంది పలకవచ్చని గుంటూరులోని డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ దోనవల్లి లక్ష్మణ్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫార్మసీ ప్రాక్టీస్, సూట్స్‌ కేర్‌ నెట్‌వర్క్‌ల సంయుక్త ఆధ్వర్యంలో  ‘‘ప్రివెంటెవ్‌ అండ్‌ ఎమర్జెన్సీ మెడికల్‌ సైన్సెస్‌’’ అనే అంశంపై  రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ స్థాయి కాన్ఫరెన్స్‌ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కాన్ఫరెన్స్‌ను ‘‘ఏ పారాడిమ్‌ షిఫ్ట్‌ ఆఫ్‌ క్లినికల్‌ ప్రాక్టీస్‌ ఫ్రమ్‌ హాస్పిటల్‌ టు కమ్యూనిటీ ఎట్‌ లార్జ్‌’’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరులోని డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ దోనవల్లి లక్ష్మణ్‌ మాట్లాడుతూ ఫార్మాస్యూటికల్‌ విద్యార్థులు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తేనే విజయం సాధించగలరని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి విజన్‌తో ముందుకెళ్లాలని, క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ఇలాంటి సదస్సులు ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. కార్యక్రమానికి మరో విశిష్ట అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్‌ ఫార్మసీ కౌన్సిల్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ విలియం కారే మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు సమాజంలో ప్రబలుతున్న వ్యాధులపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. ఫార్మాస్యూటికల్‌ విద్యార్థులకు మన దేశంతోపాటు, ఇతర దేశాలలో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఇనిస్టిట్యూట్‌కి ఇండస్ట్రీలకు మధ్య అవగాహనలు ఉంటే విద్యార్థులకు లాభసాటిగా ఉంటుందన్నారు. విద్యార్థులు ఇదే కాలేజీ నుంచి ఉత్తీర్ణులై వివిధ రంగాలలో స్థిరపడిన విద్యార్థులతో సంబంధాలను మెరుగుపరచుకోవాలన్నారు. కార్యక్రమానికి దేశంలోని ప్రముఖ కాలేజీల నుంచి దాదాపు 410 మంది హాజరయ్యారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, సూట్స్‌ కేర్‌ నెట్‌వర్క్‌ సీఈవో డాక్టర్‌ సోమశేఖర రెడ్డి, డైరక్టర్‌ డాక్టర్‌ ప్రిన్స్‌ అభిషేక్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.